కేంద్రం వరాలు.. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల విజయం
x

కేంద్రం వరాలు.. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల విజయం

ఇది తెలుగు ప్రజల విజయం. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం వరాలివ్వడానికి ప్రజల తీర్పే కారణం. ఆ భయంతోనే ఏపీకి కేంద్రం నిధులు కేటాయించింది.


కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు సముచిత ప్రాధాన్యత నిచ్చింది. ఒక విధంగా వరాల వర్షం కురిపించిందని చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్‌ రీ ఆర్గనైజేషన్‌ చట్టంలోని అన్ని అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపించింది. ఏపీ రీ ఆర్గనైజేషన్‌ చట్టం ప్రకారం ఇవ్వాల్సిన రాయితీలు పదేళ్లు గడిచినా.. కేంద్ర ప్రభుత్వం ఇవ్వ లేదు. రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. కూటమిలో ప్రధానంగా టీడీపీ, జనసేన, బీజేపీలు అనుకున్న ప్రకారం విజయం సాధించాయి. దీంతో కేంద్రం తన అభిప్రాయాన్ని మార్చుకొని ఏపీ అభివృద్ధికి నిధుల కేటాయింపుల్లో పెద్ద మనసు చేసుకుంది. ప్రధానంగా రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, ఆంధ్రప్రదేశ్‌లోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీలు, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ వంటి అంశాలకు నిధులు కేటాయించాల్సి ఉంది. అయితే రైల్వే జోన్‌ ప్రస్తావనే బడ్జెట్‌ ప్రసంగంలో కనిపించ లేదు. రైల్వే జోన్‌ వల్ల వేలాది మందికి ఉపాధి కలిగే అవకాశం ఉంది. అమరావతి నిర్మాణానికి రూ. 15వేల కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి తన బడ్జెట్‌ ప్రసంగంలో వెల్లడించారు. దీంతో పాటుగా అమరావతి నిర్మాణానికి అవసరమైతే అధిక నిధులు కూడా కేటాయిస్తామని పార్లమెంట్‌ సాక్షిగా వెల్లడించారు.

ఆ భయంతోనే..
కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు వరాలను కురిపించడానికి తెలుగు ప్రజల గొప్పతనమే కారణమని ప్రముఖ ఆర్థిక రంగ నిపుణులు, రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ కేఎస్‌ చలం అభిప్రాయపడ్డారు. ఏపీ రీ ఆర్గనైజేషన్‌ చట్టంలో పేర్కొన్న అంశాలే అయినప్పటికీ పదేళ్లుగా నిధులు కేటాయించడం కానీ, అమలు చేయడం కానీ చేయలేదు. ఈ సారి ఎన్నికల్లో తెలుగు ప్రజలు ఇచ్చిన తీర్పు ఆంధ్రప్రదేశ్‌కు నిధులను తీసుకొచ్చింది, ఇది ఆంధ్రప్రదేశ్‌ ప్రజల విజయమని అభిప్రాయపడ్డారు. కేంద్రం ఏపీకి ప్రకటించిన నిధులను విడుదల చేయడంలో చొరవ చూపితే త్వరగా ఏపీలో అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్లుగా ఉంటుందని పేర్కొన్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగాలంటే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సపోర్టు తప్పనిసరిగా కావాలి. ఆ భయంతోనే ఏపీకి కేంద్రం వరాలు ఇచ్చినట్లు అభిప్రాయపడ్డారు. తెలుగు ప్రజలు తలుచుకుంటే ఏ ప్రభుత్వాన్నైనా తమ వైపు తిప్పుకునేందుకు వెనుకాడరని అన్నారు.
గతంలో వెనక్కి తీసుకున్న కేంద్రం
వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటిస్తూ.. గతంలో రూ. 350 కోట్ల నిధులను నాడు మోదీ ప్రభుత్వం కేటాయించింది. తర్వాత వాటిని వెనక్కు తీసుకుంది. ప్రస్తుత బడ్జెట్‌లో రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీని ఇస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటించారు. ప్యాకేజీ ఎంత మొత్తంలో ఇస్తారు, ఏ విధమైన అభివృద్ధికి చర్యలు తీసుకుంటారు వంటి అంశాలను స్పష్టం చేయలేదు.
పారిశ్రామిక కారిడార్‌కు గ్రీన్‌ సిగ్నల్‌
విశాఖ–చెన్నై పారిశ్రామిక కారిడార్‌ నిర్మాణానికి కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కొప్పర్తి పారిశ్రామిక అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. నీళ్లు, విద్యుత్, రోడ్లు, హైవేలకు నిధులు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. ఇదే జరిగితే పారిశ్రామిక అభివృద్ధికి చర్యలు తీసుకున్నట్లవుతుంది.
పోలవరం నిర్మాణానికి సంపూర్ణ సహకారం
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంపూర్ణ సత్వర సాయం ఉంటుందని నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. పోలవరం భారత ఆహార భద్రతకు కేంద్ర బిందువని, రైతులకు జీవ నాడి అని ఆమె తన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొనడం విశేషం. పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తి కావాలంటే వెను వెంటనే కేంద్రం నిధులను విడుదల చేయాల్సి ఉంది.
టూరిజం వైపుగా..
ఆంధ్రప్రదేశ్‌లో దేవాలయాలు, పర్యాటక రంగం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. టూరిజమ్‌ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్‌ ఎంతో అనుకూలంగా ఉంటుంది. శ్రీకాకుళం నుంచి చెన్నై వరకు సముద్ర తీర ప్రాంతం ఉండటం వల్ల ఓడరేవులు, బీచ్‌లు, రిసార్ట్‌లు, విడిది కేంద్రాలను ఎంతగానో అభివృద్ది చేసేందుకు అవకాశం ఉంది. ప్రపంచంలోనే పేరెన్నికగన్న దేవాలయాలు కూడా ఏపీలో ఉన్నాయి.
Read More
Next Story