ధర్మం, జ్ఞానం, సేవ... మూల సిద్ధాంతాలుగా కంచి పీఠాన్ని జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యులు తమిళనాడులో స్థాపించారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. హిందూ మత పరిరక్షణకు... ఆది శంకరాచార్యులు దేశంలోని నాలుగు ప్రాంతాల్లో నాలుగు పీఠాలను స్థాపించారని, నాటి నుంచి నేటి వరకు హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేస్తోందని వెల్లడించారు. గుంటూరు సమీపంలోని పెదకాకాని వద్ద ఆదివారం శంకర ఐ సూపర్ స్పెషాలిటీ కేంద్రాన్నిసీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శంకర ఐ ఫౌండేషన్ అవసరమైన వారికి దృష్టిని ప్రసాదిస్తూ మానవాళికి అద్భుతమైన సేవలను అందిస్తోందన్నారు. శంకర సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ కేంద్రం ప్రారంభోత్సవంలో పాల్గొనటం అదృష్టంగా భావిస్తున్నాను. మానవ సేవనే మాధవ సేవ అని నమ్ముతుంది కాబట్టే... కంచి పీఠం దేశ వ్యాప్తంగా కంటి ఆస్పత్రులు స్థాపించి... పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తోందన్నారు.
సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ కేంద్రాన్ని స్వామీజీ సమక్షంలో ప్రారంభించుకోవడం సంతోషకరం. సామాన్యులకు దృష్టి భాగ్యాన్ని కలిగిస్తున్న శంకర ఐ ఆస్పత్రి స్వర్ణోత్సవంలో నేను కూడా పాల్గొంటాను. ఐదు దశాబ్దాలలో దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 14 ఐ హాస్పిటల్స్ నిర్మించి... నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు 30 లక్షల మందికి ఉచితంగా కంటి శస్త్ర చికిత్సలు, 70 లక్షల మంది చిన్నారులకు కంటి పరీక్షలు చేయడం సాధారణ విషయం కాదు. ఈ ఆస్పత్రుల్లో రోజుకి సగటున 750 ఉచిత కంటి శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయని తెలిసి నాకు ఆశ్చర్యం కలిగింది. ఇది మరే సంస్థకు సాధ్యం కాని ప్రజా సేవ. భారత్ తో పాటు నేపాల్, కాంబోడియా, నైజీరియా వంటి దేశాల్లోనూ సాయం చేస్తోంది. ఇవాళ కొత్తగా ప్రారంభించిన ‘సూపర్ స్పెషాలిటీ ఐ కేర్’ బ్లాక్ ఏర్పాటుతో ప్రపంచ స్థాయి సౌకర్యాలు సమకూరాయని అన్నారు.
ఈ యూనిట్ ద్వారా రాష్ట్రంలో ఎంతో మంది పేదల జీవితాల్లో వెలుగులు వస్తాయి. రెయిన్‌బో ప్రోగ్రామ్ ద్వారా ప్రత్యేకంగా పిల్లల కంటి ఆరోగ్యంపై దృష్టి పెట్టడాన్ని అభినందిస్తున్నా. శంకర గ్రామీణ సేవా ప్రాజెక్ట్ గిఫ్ట్ ఆఫ్ విజన్ కింద ఇప్పటివరకు 32,000కు పైగా కంటి శిబిరాలు నిర్వహించడం విశేషం. ఆరోగ్యాంధ్రప్రదేశ్ లో భాగంగా హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీ అనేది మా విధానం. అనారోగ్యమే నిజమైన పేదరికం. అందుకే ప్రజల ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. ప్రజారోగ్య సంరక్షణకు వినూత్నంగా కార్యాచరణ అమలు చేస్తున్నాం. యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తెస్తున్నాం. టాటా సంస్థ సహకారంతో డిజిటల్ నెర్వ్ సెంటర్ ‘సంజీవని’ కేంద్రాలు త్వరలో రాష్ట్రమంతటా ఏర్పాటు చేస్తాం. ప్రజల ఆరోగ్యం కాపాడడానికి శంకర ఐ హాస్పిటల్స్ సేవలను స్వాగతిస్తున్నాను. ఇలాంటి ప్రతిష్టాత్మక సంస్థలతో కలిసి పనిచేయడానికి రాష్ట్రం ప్రభుత్వం సిద్దంగా ఉంది. పేదలకు సేవ చేసే ఇలాంటి సంస్థలకు మా సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని సీఎం చంద్రబాబు వెల్లడించారు.