వెనకబడిన ఉత్తరాంధ్రను అభివృద్ధి చెందిన ప్రాంతంగా మార్చివేసిన ఘనత ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌లకే చెందుతుందని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. దేశంలోనే మొట్టమొదటి జీఎమ్మార్–మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ అంకురార్పణ, ఎంవోయూ మార్పిడి కార్యక్రమంలో విశాఖలోని రాడిసన్ బ్లూ హోటల్‌లో మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి గోవా గవర్నర్, మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ పి.అశోక్‌గజపతిరాజు, ఏపీ అసెంబ్లీ స్పీకర్ సీహెచ్ అయ్యన్నపాత్రుడు, కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తదితరులు హాజరయ్యారు. మాన్సాస్ ట్రస్ట్ ఈ ఏవియేషన్ ఎడ్యుసిటీ కోసం విశాఖ జిల్లా భీమిలి మండలం అన్నవరంలో 136.62 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు ఏమన్నారంటే?
ఏవియేషన్ ఎడ్యుసిటీ ఎంవోయూల మార్పిడి
అభివృద్ధికి ఉత్తరాంధ్ర చిరునామా..
‘ఒకప్పుడు ఉత్తరాంధ్రకు వెనకబడిన వలసల ప్రాంతంగా పేరుండేది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ప్రాంతం అభివృద్ధికి చిరునామాగా మారిపోయి విశాఖ కేంద్రంగా ప్రపంచ దృష్టిని ఆకర్షించే స్థాయికి చేరుకుంది. దీనికంతటికీ ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, నేటి గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజులే కారణం. వీరంతా వలసలకు వెళ్లే రోజుల నుంచి మన వద్దకే ప్రపంచం వచ్చేలా ఉత్తరాంధ్రను తీర్చిదిద్దుతున్నారు.
జులైలో భోగాపురం విమానాశ్రయం ప్రారంభం..
వచ్చే జులైలో భోగాపురం వచ్చే జులైలో ప్రారంభమవుతుంది. అందుకవసరమైన పనులు చకచకా పూర్తవుతున్నాయి. నెల రోజుల్లో ట్రయల్ రన్స్ మొదలవుతాయి. రాష్ట్రంలో యూనివర్సిటీలను ఎడ్యు సిటీలుగా మార్చి ప్రంపచంలోని ఏ విశ్విద్యాలయంతోనైనా భాగస్వామ్యం చేసుకునేలా రూపకల్పన చేశాం. దేశంలో ప్రస్తుతం 800 ఎయిర్‌క్రాఫ్ట్‌లున్నాయి. మరో 1700 ఎయిర్‌క్రాఫ్ట్‌లకు అర్డర్లున్నాయి. ఒక్కో విమానానికి సంబంధించి వంద రకాల ఉద్యోగావకాశాలొస్తాయి. అని రామ్మోహన్‌నాయుడు వివరించారు.
ఏవియేషన్ ఎడ్యుసిటీతో ఎంతో మేలు..
గోవా గవర్నర్, మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ పి.అశోక్‌గజపతిరాజు మాట్లాడుతూ ‘దక్షిణాంధ్రప్రదేశ్‌లో ఇస్రో కేంద్రం ఉండగా, ఉత్తరాంధ్రలో ఏవియేషన్ ఎడ్యుసిటీ తో ఒక సమగ్ర ఎకో సిస్టమ్‌ను అభివృద్ధి చేస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధిని ఎవరూ ఆపలేరు. ఉత్తరాంధ్ర విద్యార్థులకు మా మాన్సాస్ ట్రస్ట్ నుంచి మంచి విద్యను ఇస్తున్నాం. ఈ ప్రాంతానికి ఒక నైపుణ్యం కలిగిన ఎడ్యుకేషన్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేసిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు చెబుతున్నాను. నా పిల్లల వయసున్న లోకేష్, రామ్మోహన్‌నాయుడులు ప్రజాసేవలో కీర్తి ప్రతిష్టలు సాధిస్తున్నందుకు అభినందిస్తున్నాను’ అని అన్నారు.
నాడు ఎన్టీఆర్.. నేడు చంద్రబాబు..
ఏపీ అసెంబ్లీ స్పీకర్ సీహెచ్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. ‘ఉత్తరాంధ్రకు స్వర్గీయ ఎన్టీఆర్ గుర్తింపు తెచ్చారు. ఇప్పుడు చంద్రబాబు, లోకేష్‌లు ఈ ప్రాంత అభివృద్ధి కోసం మమ్మల్ని నిద్రపోనివ్వడం లేదు. ఏవియేషన్ యూనివర్సిటీకి భూములిచ్చిన ఘనత అశోక్ గజపతిరాజుదే. ఈరోజుల్లో రూ.10 వేల విరాళం ఇచ్చి రూ.లక్ష ప్రచారం చేసుకుంటున్న వారెందరో ఉన్నారు. కానీ రూ.వేల కోట్ల భూములు, ఆస్తులు ప్రజల కోసం ఇచ్చి సామాన్య జీవితం గడుపుతున్నారు ఆయన’ అని స్పీకర్ కొనియాడారు.
టెన్త్ ఫెయిలైన వ్యక్తి ఎయిర్‌పోర్టులు కడ్తున్నారు..
టెన్త్ ఫెయిలైన వ్యక్తి ఇప్పుడు ఏకంగా ప్రపంచవ్యాప్తంగా ఎయిర్‌పోర్టులు కడ్తున్నారని జీఎమ్మార్ సంస్థ అధినేత గ్రంధి మల్లికార్జునరావునుద్దేశించి మాట్లాడుతూ మంత్రి లోకేష్ అన్నారు. ‘శంషాబాద్ ఎయిర్‌పోర్టు నిర్మాణ సమయంలో కొంతమంది ఆయనను ఎగతాళి చేశారు. కానీ ఇప్పుడు కొనియాడుతున్నారు. నేటి తరానికి జీఎమ్మార్ ప్రయాణం స్ఫూర్తిదాయకం. ఒక గజం భూమికోసం కొట్టుకుంటున్న నేటి సమాజంలో ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా రూ.వేల కోట్ల విలువైన 136.62 ఎకరాల భూములను ఉచితంగా ఇచ్చారు గజపతి కుటుంబీకులు. ఇది ఆ కుటుంబ ఔన్నత్యాన్ని చరిత్రలో నిలుపుతుంది’ అని లోకేష్ పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, వంశీకృష్ణ శ్రీనివాస్, అదితి గజపతిరాజు, కళా వెంకట్రావు, కోళ్ల లలితకుమారి, లోకం మాధవి, కోండ్రు మురళీమోహన్, ఈశ్వరరావు, ఎమ్మెల్సీలు గాదె శ్రీనివాసులు నాయుడు, రఘురాజు విశాఖ కలెక్టర్ హరేందిరప్రసాద్‌లు పాల్గొన్నారు.