ఏపీకి దిగ్గజ కంపెనీల రాక.. లోకేష్ పాత్ర
x

ఏపీకి దిగ్గజ కంపెనీల రాక.. లోకేష్ పాత్ర

సీఎం చంద్రబాబు కుమారుడు మంత్రి నారా లోకేష్ ఏపీలో పెట్టుబడుల కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ఇప్పటి వరకు ఇటీవల 12 కంపెనీలతో ఎంవోయూలు జరిగాయి.


మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ దూరదృష్టి, చురుకైన విధానాలు ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులకు అనుకూలంగా మార్చాయి. రిలయన్స్, TCS, ఆర్సెలర్‌మిత్తల్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్, ఇతర కంపెనీలతో కుదిరిన ఒప్పందాలు రాష్ట్ర ఆర్థిక వృద్ధికి బలమైన పునాదిని వేశాయి. లోకేష్ హాజరైన శంకుస్థాపనలు, ముఖ్యంగా RIL మరియు TCS ప్రాజెక్టులు, రాష్ట్రం పరిశ్రమల స్థాపనలో “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్”ను ప్రతిబింబిస్తాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో లోకేష్ నాయకత్వం రాష్ట్రాన్ని ఐటీ, రెన్యూవబుల్ ఎనర్జీ, మాన్యుఫ్యాక్చరింగ్ రంగాలలో గ్లోబల్ హబ్‌గా రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. రాబోయే సంవత్సరాల్లో లోకేష్ చూపే ఈ చొరవతో నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రిగా రాష్ట్రంలో సాంకేతిక ఆధారిత పరిశ్రమల స్థాపనకు నారా లోకేష్ ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన అమెరికా పర్యటనలో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, ఆపిల్ ఉపాధ్యక్షురాలు ప్రియా బాలసుబ్రమణ్యం, టెస్లా సీఎఫ్‌ఓ వైభవ్ తనేజా వంటి ప్రముఖులతో జరిపిన చర్చలు రాష్ట్రాన్ని గ్లోబల్ ఐటీ, ఏఐ హబ్‌గా మార్చే లక్ష్యాన్ని సూచిస్తాయి. “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” మంత్రం TCS ఒప్పందం వంటి వేగవంతమైన నిర్ణయాల ద్వారా ఈ విషయం వెల్లడవుతోంది. ఇది రాష్ట్రం పోటీతత్వాన్ని వియత్నాం, ఈక్వెడార్ వంటి దేశాలతో పోల్చదగిన స్థాయికి తీసుకువెళ్తుంది.

టెక్నాలజీ నేపథ్యం రాష్ట్రంలో ఏఐ, డ్రోన్ టెక్నాలజీ, రెన్యూవబుల్ ఎనర్జీ రంగాలను అభివృద్ధి చేయడంలో సహాయపడింది. ఉదాహరణకు కర్నూలులో 300 ఎకరాల డ్రోన్ హబ్, 35,000 డ్రోన్ పైలట్‌ల శిక్షణ ప్రణాళిక రాష్ట్రాన్ని డ్రోన్ టెక్నాలజీలో లోకేష్ ను జాతీయ నాయకుడిగా నిలిపే లక్ష్యంతో ఉంది. అమరావతిలో ఏఐ యూనివర్సిటీ స్థాపన కోసం న్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌తో చర్చలు రాష్ట్ర యువతను గ్లోబల్ ఏఐ నిపుణులుగా తయారుచేసే దిశగా అడుగులు పడుతున్నాయి.


ఏపీ ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్న కంపెనీలు

గత కొన్ని నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేక ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ కంపెనీలతో పెట్టుబడి ఒప్పందాలు (MoUs) కుదుర్చుకుంది. మంత్రి నారా లోకేష్ అమెరికా, దావోస్ వంటి అంతర్జాతీయ పర్యటనలు, పరిశ్రమల నాయకులతో చర్చలు ఈ ఒప్పందాలను సాధ్యం చేశాయి.


రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL)

రూ. 65,000 కోట్లు పెట్టుబడి పెట్టింది. 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ (CBG) ప్లాంట్ల స్థాపనకు భూమి పూజ జరిగింది. ఒక్కో ప్లాంట్ రూ. 130 కోట్ల వ్యయంతో వ్యర్థ భూములు ఉన్న ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు రాష్ట్ర గ్రీన్ ఎనర్జీ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తుంది. 2.5 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు నిర్ణయించుకుంది. ఈ మేరకు ప్రభుత్వానికి హామీ కూడా ఇచ్చింది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 20 శాతం క్యాపిటల్ సబ్సిడీ, SGST, విద్యుత్ డ్యూటీపై 5 సంవత్సరాల పాటు పూర్తి రీయింబర్స్‌మెంట్‌ ఇస్తుంది. రాష్ట్ర ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ అమలు కోసం ప్రభుత్వం రిలయన్స్ కు మద్దతు ఇస్తోంది.


ఆర్సెలర్‌మిట్టల్, నిప్పాన్ స్టీల్ (AM/NS ఇండియా)

రెండు దశల్లో ప్రాజెక్టు చేపడుతున్నారు. ఇందుకు రూ. 1.4 లక్షల కోట్లు ఖర్చు చేస్తారు. అనకాపల్లి జిల్లాలో 17.8 మిలియన్ టన్నుల సామర్థ్యం గల ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులు మొదలయ్యాయి. 2029 నాటికి 21,000 ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని కంపెనీ ప్రకటించింది. ఈ ఒప్పందం జూలై 2024లో లోకేష్, ఆర్సెలర్‌మిట్టల్ సీఈఓ ఆదిత్య మిట్టల్ మధ్య జూమ్ కాల్ ద్వారా ఖరారైంది.

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)

రూ. 1,370 కోట్ల పెట్టుబడితో విశాఖపట్నంలో కొత్త ఐటీ డెవలప్‌మెంట్ సెంటర్ స్థాపన జరిగింది. లోకేష్ ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం జరిగింది. 10,000 ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని కంపెనీ ప్రభుత్వానికి హామీ ఇచ్చింది. ఈ ఒప్పందం కేవలం 90 నిమిషాల సమావేశంలో ఖరారైందని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రం “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” సిద్ధాంతాన్ని ఇది తెలియజేస్తోంది.


ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్

ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సిటీలో తన కొత్త తయారీ యూనిట్‌ను స్థాపిస్తోంది. ఈ కర్మాగారం నిర్మాణం 2025 మే 8న ప్రారంభమైంది. 2026 చివరి నాటికి కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉంది. రూ. 5,001 కోట్ల పెట్టుబడితో సంస్థ నిర్మాణం జరుగుతోంది. ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్ స్థాపన జరిగినందున ఎల్జీ ఎలక్ట్రానిక్ రంగంలో ముందడుగు వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 1,495 మంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని కంపెనీ ప్రకటించింది.

టాటా పవర్

టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ (TPREL) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మార్చి 7, 2025న అమరావతిలో ఎంఓయూ (Memorandum of Understanding) కుదుర్చుకుంది. ఈ ఒప్పందం రాష్ట్రంలో 7,000 మెగావాట్ల (7 గిగావాట్ల) పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల (సోలార్, విండ్, హైబ్రిడ్) అభివృద్ధి కోసం జరిగింది. ఈ ప్రాజెక్టుల కోసం సుమారు రూ. 49,000 కోట్లు (అంటే సుమారు 5.6 బిలియన్ డాలర్లు) పెట్టుబడి పెట్టనున్నారు. ఇది రాష్ట్రంలో అతిపెద్ద పునరుత్పాదక ఇంధన పెట్టుబడుల్లో ఒకటిగా నిలుస్తుంది. ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు కానున్నాయి. నిర్థిష్టంగా ఒకచోట అని ఇంకా ఖరారు కాలేదు. కానీ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (NREDCAP) భూముల గుర్తింపు, సహాయక మౌలిక సదుపాయాల్లో సహకరిస్తుంది.

ఈ ప్రాజెక్టులు రాష్ట్రంలో 7.5 లక్షల ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, మానవ వనరుల అభివృద్ధి మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలు నైపుణ్య అభివృద్ధి, స్థానిక ఆర్థిక వృద్ధి, జీవనోపాధులకు ఊతం ఇస్తాయని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ను పునరుత్పాదక ఇంధన హబ్‌గా మార్చడంతో పాటు, రాష్ట్రంలోని ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ (ICE) పాలసీ కింద 160 గిగావాట్ల శుద్ధ ఇంధన సామర్థ్యం సాధించే లక్ష్యానికి ఈ ప్రాజెక్టులు దోహదపడతాయి. కంపెనీ ఈ ప్రాజెక్టుల కోసం రూ. 40,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ పెట్టుబడి లోకేష్ వ్యూహాత్మక చర్చల ఫలితంగా సాధించినట్లు ప్రభుత్వం చెబుతోంది.

లులూ గ్రూప్

లులూ గ్రూప్ ఇంటర్నేషనల్ ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాజెక్టులను చేపట్టనుంది, ప్రధానంగా విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి పట్టణాల్లో ఏర్పాటు కానున్నాయి. రూ. 3,500 కోట్లతో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో షాపింగ్ మాల్స్, హైపర్‌మార్కెట్లు, మల్టీప్లెక్స్‌లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నిర్మించనుంది. విశాఖపట్నంలో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్, షాపింగ్ మాల్, ఐదు నక్షత్రాల హోటల్ ప్రధాన ఆకర్షణలు. ఈ ప్రాజెక్టుల ద్వారా 7,000 కంటే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు వస్తాయని కంపెనీ చెబుతోంది. తాజా ఒప్పందం సెప్టెంబర్ 28, 2024న జరిగింది. 2025 మార్చి 26న విశాఖలో భూమి పూజా కార్యక్రమం జరిగింది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన షాపింగ్ మాల్, 8-స్క్రీన్ IMAX మల్టీప్లెక్స్ నిర్మాణం హార్బర్ పార్క్ వద్ద బీచ్ రోడ్డులో సుమారు 14 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు కానుంది. ఇందులో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్, షాపింగ్ మాల్, ఐదు నక్షత్రాల హోటల్, ఇతర సౌకర్యాలు ఉంటాయి.

విజయవాడలో అత్యాధునిక హైపర్ మార్కెట్, మల్టీపెక్స్ నిర్మాణాలు చేపట్టేందుకు గ్రూప్ నిర్ణయించింది. అలాగే తిరుపతిలో కూడా హైపర్ మార్కెట్, మల్టీప్లెక్స్ ల నిర్మాణాలు చేపట్టనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఆధునిక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, లాజిస్టిక్ సెంటర్ల ఏర్పాటు చేస్తారు.

లులూ గ్రూప్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య తాజా ఒప్పందం సెప్టెంబర్ 28, 2024న అమరావతిలో జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, లులూ గ్రూప్ ఛైర్మన్ ఎంఎ యూసుఫ్ అలీ పాల్గొన్నారు. గతంలో (2014-2019 మధ్య) తెలుగుదేశం పార్టీ (TDP) ప్రభుత్వం హయాంలో 2018లో విశాఖపట్నం ప్రాజెక్టు కోసం ఒప్పందం జరిగింది, కానీ YSRCP ప్రభుత్వం 2019లో ఈ ఒప్పందాన్ని రద్దు చేసింది. 2025 మార్చి 26న చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం విశాఖపట్నంలో 14 ఎకరాల భూమిని లులూ గ్రూప్‌కు పునరుద్ధరించి, ప్రాజెక్టును పునఃప్రారంభించేందుకు ఆదేశాలు జారీ చేసింది.


కల్యాణి స్ట్రాటజీ సిస్టమ్స్ లిమిటెడ్

కల్యాణి స్ట్రాటజీ సిస్టమ్స్ లిమిటెడ్ (KSSL)తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024 డిసెంబర్‌లో మెమోరాండమ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ (MoU) కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, KSSL ఆంధ్రప్రదేశ్‌లోని మండకసిర మండలంలోని ముర్రనహళ్లిలో అత్యాధునిక తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ యూనిట్ గన్ ప్రొపెల్లెంట్స్ (రక్షణ వ్యవస్థలకు ఉపయోగించే పేలుడు పదార్థాలు) తయారీ, ఆమ్యునిషన్ ఫిల్లింగ్ కాంప్లెక్స్ అభివృద్ధిపై దృష్టి సారిస్తుంది. ఈ సౌకర్యం దేశీయ, ఎగుమతి మార్కెట్‌లకు సేవలు అందిస్తుంది. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం కింద భారతదేశ రక్షణ తయారీ సామర్థ్యాన్ని పెంచుతుంది.

KSSL ఈ ప్రాజెక్ట్ కోసం సుమారు రూ. 2,400 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ప్రభుత్వం ఈ యూనిట్ ఏర్పాటు కోసం రూ. 1,000 ఎకరాల భూమి కేటాయించింది. కల్యాణి స్ట్రాటజీ సిస్టమ్స్ లిమిటెడ్ భారత్ ఫోర్జ్ లిమిటెడ్ సబ్సిడియరీ. రక్షణ, ఏరోస్పేస్ వ్యాపారాలపై దృష్టి సారిస్తుంది. ఇది ఆర్టిలరీ సిస్టమ్స్, రక్షిత వాహనాలు, ఆర్మర్డ్ వెహికల్ అప్‌గ్రేడ్‌లు, ఆమ్యునిషన్, ఎయిర్ డిఫెన్స్ సొల్యూషన్స్, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ వంటి రంగాలలో పనిచేస్తుంది. KSSL ఇటీవల IDEX అబుధాబి 2025లో MArG 45 అనే మొబైల్ గన్ సిస్టమ్‌ను ప్రదర్శించింది. ఇది యుద్ధభూమిలో అత్యంత చురుకైన, వేగవంతమైన ఫైర్‌పవర్ సామర్థ్యాన్ని అందిస్తుంది.

సిఫీ టెక్నాలజీస్

డేటా సెంటర్ లేదా ఐటీ సంబంధిత సౌకర్యాల స్థాపనకు సుముఖత వ్యక్తం చేసిన ఫార్చూన్ 500 కంపెనీ. లోకేష్ ఫిబ్రవరి 2025లో సిఫీ ఛైర్మన్ రాజు వేగేశ్నతో జరిపిన చర్చల ఫలితంగా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. సిఫీ టెక్నాలజీస్ లిమిటెడ్ (Sify Technologies Limited) భారతదేశంలో అత్యంత సమగ్రమైన ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ (ICT) సేవలు మరియు సొల్యూషన్స్ అందించే సంస్థగా పేరొందింది. చెన్నై, తమిళనాడులో ప్రధాన కార్యాలయం ఉంది. సిఫీ భారతదేశంలో మొదటి ప్రైవేట్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ISP)గా 1998లో గుర్తింపు పొందింది. ప్రస్తుతం డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సేవలలో అగ్రగామిగా ఉంది. ఇది NASDAQలో SIFY టిక్కర్ సింబల్‌తో లిస్ట్ చేశారు. నెట్‌వర్క్ సెంట్రిక్ సర్వీసెస్ అందిస్తుంది. ఇంటర్నెట్, ఐపీ, MPLS, VPN, SDWAN, మేనేజ్డ్ Wi-Fi, IoT, వాయిస్ సర్వీసెస్, నెట్‌వర్క్ మానిటరింగ్ వంటి సేవలు ఇస్తారు.

సిఫీ టెక్నాలజీస్ ఆంధ్రప్రదేశ్‌లో తన ఐసీటీ సేవల ద్వారా వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు సేవలు అందిస్తోంది. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌లోని బ్యాంకింగ్, రిటైల్, ఇతర రంగాల్లో సిఫీ డేటా సెంటర్లు, నెట్‌వర్క్ సేవలను ఉపయోగిస్తున్నారు.


సెరెంటికా గ్లోబల్

సెరెంటికా గ్లోబల్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ (ఏపీ) ప్రభుత్వంతో 10 గిగావాట్ (GW) పునర్వినియోగ శక్తి ప్రాజెక్టుల స్థాపన కోసం ప్రయత్నం చేస్తోంది. 2024 అక్టోబర్ 24న ముంబైలో మంత్రి నారా లోకేష్ సెరెంటికా గ్లోబల్ ప్రతినిధులతో సమావేశమై ఈ ప్రాజెక్టుల స్థాపన గురించి చర్చించారు. ఈ సమావేశంలో సెరెంటికా గ్లోబల్ 10 GW పునర్వినియోగ శక్తి సామర్థ్యాన్ని ఏర్పాటు చేసే ప్రణాళికను ప్రెజెంట్ చేశఆరు. ఏపీ ప్రభుత్వం 2030 నాటికి 72 GW పునర్వినియోగ శక్తి లక్ష్యాన్ని సాధించేందుకు సెరెంటికా వంటి కంపెనీలను స్వాగతించింది.

హీరో ఫ్యూచర్ ఎనర్జీస్

హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ (HFE) కంపెనీ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. 2023 మార్చి 15న ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 సందర్భంగా, హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ ఏపీ ప్రభుత్వంతో ఒక మెమోరాండం ఆఫ్ అండర్‌స్టాండింగ్ (MoU) కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, HFE రూ. 30,000 కోట్ల పెట్టుబడితో ఏపీలో సౌర, పవన విద్యుత్, గ్రీన్ హైడ్రోజన్ డెరివేటివ్‌లతో కూడిన పునర్వినియోగ శక్తి సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రాజెక్టులు వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు, యుటిలిటీ ప్రాజెక్టులకు, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి సంబంధించినవి. ఇవి మూడు నుంచి ఐదు సంవత్సరాలలో అమలు కానున్నాయి. ఈ సౌకర్యాలు సుమారు 10,000 మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉందని అంచనా.

2025 మార్చి 3న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతిలో HFE యొక్క గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్ ప్లాంట్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ ప్లాంట్ రూ. 1,000 కోట్ల పెట్టుబడితో నిర్మించారు. సంవత్సరానికి 25 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంది. సుమారు 2,000 మందికి ఉపాధి కల్పిస్తుంది. ఈ ప్లాంట్ గ్రీన్ హైడ్రోజన్‌ను పైప్డ్ న్యాచురల్ గ్యాస్ (PNG), లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG)తో మిళితం చేసే సాంకేతికతను ఉపయోగిస్తుంది. ఇది పరిశ్రమలలో కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.

జిఎమ్ఆర్ గ్రూప్

జిఎమ్ఆర్ గ్రూప్ ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి కోసం పెట్టుబడులు పెడుతోంది. ఈ ప్రాజెక్ట్ కోసం సుమారు రూ. 2,700 కోట్ల పెట్టుబడి ఉంటుందని అంచనా వేశారు. ఈ విమానాశ్రయం 2,200 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. దీని మొదటి దశలో సంవత్సరానికి 60 లక్షల మంది ప్రయాణికుల సామర్థ్యం ఉంటుంది. అదనంగా విమానాశ్రయం అభివృద్ధి కోసం జిఎమ్ఆర్ గ్రూప్ డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, నిర్మాణం, ఆపరేషన్, నిర్వహణ బాధ్యతలను చేపడుతుంది. ఇది 40 సంవత్సరాల కాలపరిమితి కలిగి ఉంటుంది. మరో 20 సంవత్సరాలు పొడిగించే అవకాశంతో నిర్మిస్తున్నారు.

జిఎమ్ఆర్ గ్రూప్ కు గతంలో కాకినాడలో 220 మెగావాట్ల గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రం ఉంది. దీనిని 2017లో USD 63 మిలియన్ (సుమారు రూ. 420 కోట్లు, ఆనాటి మారకం రేటు ప్రకారం)కు విక్రయించింది. ప్రస్తుతం, భోగాపురం విమానాశ్రయం జిఎమ్ఆర్ ప్రధాన పెట్టుబడి ప్రాజెక్ట్‌గా ఉంది.


మెస్సర్స్ యిటోవా మైక్రో టెక్నాలజీ లిమిటెడ్ (YMTL)

ఇండిచిప్ సెమీకండక్టర్స్ లిమిటెడ్, దాని జాయింట్ వెంచర్ భాగస్వామి జపాన్‌కు చెందిన మెస్సర్స్ యిటోవా మైక్రో టెక్నాలజీ లిమిటెడ్ (YMTL) ఏపీ ప్రభుత్వంతో రూ. 14,000 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడితో మొట్ట మొదటి ప్రైవేట్ సెమీకండక్టర్ తయారీ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడానికి ఒక అవగాహన ఒప్పందం (MoU)పై సంతకం చేశాయి.

‘ఈ అవగాహన ఒప్పందం హైదరాబాద్‌లో జరిగింది. ప్రతిపాదన సిలికాన్ కార్బైడ్ (SiC) చిప్‌ల తయారీపై దృష్టి పెడుతుంది. ఇది భారతదేశ సాంకేతిక పురోగతి, స్థిరత్వ లక్ష్యాలకు దోహదపడుతుంది" అని పరిశ్రమల మంత్రి టిజి భరత్ అన్నారు. ప్రభుత్వం నవంబర్ 2024లో ప్రకటించిన సెమీకండక్టర్ విధానం రాష్ట్రాన్ని ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ తయారీ కేంద్రంగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రతిపాదిత SiC ఫ్యాబ్ సౌకర్యం నెలకు 10,000 వేఫర్‌ల ఉత్పత్తి సామర్థ్యంతో ప్రారంభిస్తారు. రెండు నుంచి మూడు సంవత్సరాలలో నెలకు 50,000 వేఫర్‌ల వరకు పెరుగుతుంది. ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతకు అనుగుణంగా, ఈ వ్యూహాత్మక పెట్టుబడి ఇంధన, సమర్థవంతమైన సాంకేతికతలు, ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక ఇంధన పరిష్కారాల కోసం పెరుగుతున్న ప్రపంచ డిమాండ్‌ను పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది.

ఐటీ మంత్రి నారా లోకేష్, భరత్ సమక్షంలో ఇండిచిప్ మేనేజింగ్ డైరెక్టర్ పియూష్ బిచోరియా, APEDB CEO సాయికాంత్ వర్మ ఈ అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు.

‘ఈ పెట్టుబడి ఆంధ్రప్రదేశ్ వినూత్న విధానాలు, బలమైన మౌలిక సదుపాయాల ద్వారా అత్యాధునిక పరిశ్రమలను ఆకర్షించే సామర్థ్యానికి నిదర్శనం. ప్రతిభను పెంపొందించడం, నిరంతర మద్దతు అందించడంపై మా దృష్టి ఉంటుందని, భారతదేశం ప్రపంచ సెమీకండక్టర్ ను బలోపేతం చేస్తుంది’ అని మంత్రి లోకేష్ అన్నారు.

ఫార్మా కంపెనీలు (నోవార్టిస్, రోచె, లోన్జా, ఆల్కాన్)

జనవరి 2025లో జ్యూరిచ్‌లో లోకేష్ జరిపిన చర్చలలో ఈ ఔషధ కంపెనీలు రాష్ట్రంలో యూనిట్ల స్థాపనకు ఆసక్తి చూపాయి. కంపెనీలు స్థాపిస్తే తప్పకుండా సహకరిస్తామని ఆయా కంపెనీల వారికి లోకేష్ హామీ ఇచ్చారు.

పలు కంపెనీలతో చర్చలు...

లోకేష్ తన అమెరికా పర్యటనలో (అక్టోబర్-నవంబర్ 2024) మైక్రోసాఫ్ట్, ఆపిల్, అడోబ్, టెస్లా, అమెజాన్, గూగుల్ క్లౌడ్, సేల్స్‌ఫోర్స్, న్విడియా వంటి ఫార్చూన్ 500 కంపెనీలతో చర్చలు జరిపారు. ఈ చర్చలు ఐటీ, ఏఐ, ఎలక్ట్రిక్ వెహికల్స్, గ్రీన్ ఎనర్జీ రంగాలలో పెట్టుబడులను ఆకర్షించే అవకాశాలను సూచిస్తున్నాయి.

ఏప్రిల్ 2025 నాటికి రాష్ట్రం రూ. 8 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. 5 లక్షల ఉద్యోగ అవకాశాలను వచ్చేలా చేసింది. స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ (SIPB) నవంబర్ 2024లో రూ. 85,083 కోట్ల పెట్టుబడులతో 33,966 ఉద్యోగాలను సృష్టించే 10 పెద్ద పరిశ్రమలను ఆమోదించింది.

లోకేష్ చొరవకు సీఎం మద్దతు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లోకేష్ చొరవలను పూర్తిగా సమర్థిస్తున్నారు. రాష్ట్రాన్ని పెట్టుబడులకు అనుకూల గమ్యస్థానంగా మార్చడానికి ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డ్ (EDB)ను పునరుద్ధరించారు.

Read More
Next Story