
24 గంటల్లో తుపాన్ గా వాయుగుండం
ప్రస్తుతం సముద్రంలో ఉన్న మత్స్యకారులు వెంటనే తీరం చేరుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఆదేశించింది.
మలక్కా జలసంధి ప్రాంతంలో ప్రస్తుతం ఒక తీవ్రవాయుగుండం కొనసాగుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతూ ఈ రోజు (నవంబర్ 26, 2025) సాయంత్రం లేదా రేపు గురువారం ఉదయం నాటికి తుపానుగా (Cyclonic Storm) బలపడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అదే సమయంలో నైరుతి బంగాళాఖాతం, దక్షిణ శ్రీలంక సమీపం, ఆగ్నేయ హిందూ మహాసముద్రం ప్రాంతంలో మరో అల్పపీడనం కొనసాగుతోంది. ఈ అల్పపీడనం రాబోయే 12 గంటల్లో ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా మారనుంది. తదుపరి 24 గంటల్లో ఇది వాయుగుండంగా (Cyclonic Storm) బలపడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ నేపథ్యంలో మత్స్యకారులకు కీలక హెచ్చరిక జారీ చేశారు. రేపు గురువారం (నవంబర్ 27) నుంచి దక్షిణ బంగాళాఖాతం, శ్రీలంక తీరం, హిందూ మహాసముద్రంలోకి వేటకు వెళ్లరాదని సూచించింది. ప్రస్తుతం సముద్రంలో ఉన్న మత్స్యకారులు వెంటనే తీరం చేరుకోవాలని ఆదేశించింది.
ఈ రెండు వాతావరణ మార్పుల ప్రభావంతో శనివారం (నవంబర్ 29) నుంచి మంగళవారం (డిసెంబర్ 2) వరకు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి ఓ మోడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ముఖ్యంగా నవంబర్ 30, డిసెంబర్ 1 తేదీల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడవచ్చు. రైతులు పూర్తి అప్రమత్తతతో ఉండాలని, పంట కోత, నీటి ఎద్దడి, పశువుల భద్రత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంస్థ సూచించింది. తీరప్రాంత జిల్లాల్లో వర్షం, గాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది.

