
అందుకే గ్రీన్ హైడ్రోజన్‌కు ప్రాధాన్యత పెరిగింది
అమరావతిలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్శిటీలో జరిగిన గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్ సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో గ్రీన్ హైడ్రోజన్‌కు ప్రాధాన్యం పెరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. శుక్రవారం అమరావతిలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్శిటీలో నిర్వహించిన గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ కంపెనీల ఎండీలు, సీఈవోలతో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. గ్రీన్ హైడ్రోజన్‌కు పెరుగుతున్న ప్రాధాన్యం, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా గ్రీన్ హైడ్రోజన్ విద్యుత్ ఉత్పత్తికి ఉన్నటుంవంటి మెరుగైన అవకాశాల గురించి వారితో చర్చించారు.
ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ను గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా తాము నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అందుకు అవసరమైన టెక్నాలజీని తీసుకొని రావాలని వివిధ సంస్థల ఎండీలు, సీఈవోలకు సూచించారు. ఈ రంగానికి సంబంధించి మీ ఆలోచనలు వినేందుకు, ఆవిష్కణల గురించి తెలుసుకునేందుకు తాను ఈ సదస్సుకు వచ్చినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి మీద విద్యుత్ తయారీ రంగంలో ఉన్న సంస్థలు పరిశోధనలు చేయాలని సూచించారు.
దేశంలోనే తొలి సారిగా విద్యుత్ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది తానే అని సీఎం చంద్రబాబు తెలిపారు. అయితే ఆ సంస్కరణలు అమలు చేసిన కారణంగా నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తాము అధికారాన్ని కోల్పోయామని గుర్తు చేసుకున్నారు. గ్రీన్ హైడ్రోజన్ మీద విరివిగా పరిశోధనలు చేపట్టి తక్కువ ఖర్చుతో గ్రీన్ ఎనర్జీని ఎలా తయారు చేయాలి, తయారు చేసిన విద్యుత్‌ను ఎలా స్టోరేజీ చేయాలనే అంశాలపైన కూడా దృష్టి సారించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఇటువంటి వినూత్నమైన పరిశోధనలు, ఆవిష్కరణలకు ఏపీ కేంద్ర బిందువు కావాలన్నారు.
అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ గ్రీన్ హైడ్రోజన్ అంశంపై దృష్టి పెట్టందని, ఈ రకమైన పరిశోధనలకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను కూడా ఇస్తోందన్నారు. దాదాపు ఐదు గిగావాట్ల గ్రీన్ ఎనర్జీని తయారు చేయాలనే లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ పెట్టుకున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో పాటుగా నీతి ఆయోగ్ కూడా ఈ అంశంపైన దృష్టి పెట్టందన్నారు. నూతన పరిశోధనలు, నూతన ఆవిష్కరణల వల్ల రానున్న రోజుల్లో ఏపీ హైడ్రోజన్ వ్యాలీగా మారుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, నీతి ఆయోగ్ సభ్యులు సారస్వత్, ఏపీ సీఎస్ కే విజయానంద్, ఇంధన రంగ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.