అది ’సెలెక్టివ్‌ సూడో సెక్యులరిజమే‘
x

అది ’సెలెక్టివ్‌ సూడో సెక్యులరిజమే‘

సూడో సెక్యులరిజం పేరుతో న్యాయవ్యవస్థను బెదిరిస్తారా? అని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.


రాజ్యాంగబద్ధమైన సుప్రీం కోర్టు ధర్మాసనం శబరిమల అంశంపై శతాబ్దాలుగా కొనసాగుతున్న ఒక పవిత్రమైన ఆచారాన్ని రద్దు చేస్తూ తీర్పు ఇస్తే, దేశవ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున నిరసనలను తెలిపారు, కానీ ఎవరూ న్యాయమూర్తులపై అభిశంసన తీర్మానం చేయలేదు అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అత్యంత పవిత్రమైన హిందూ క్షేత్రాల్లో ఒకటైన శబరిమలలోని ప్రధాన ఆచార మార్పు అంశంపై ఇచ్చిన తీర్పుపై దాఖలైనవి కేవలం రీవ్యూ పిటిషన్‌లు మాత్రమే, రాజకీయంగా వారిని తొలగించాలని ఒత్తిడి చేయలేదన్నారు. సోషల్ మీడియా వేదికగా సెక్యులరిజం కోసం పోరాటం చేస్తున్న వారిపైన సోషల్ మీడియా వేదికగా పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు.

పవన్ కల్యాణ్ ఏమన్నారంటే..

ఇటీవల ఒక సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, “ఓహో! ఇప్పుడు దేవుడినే అడిగి ఏదైనా చేయమని చెప్పండి. మీరు విష్ణుభక్తుడని చెబుతున్నారా? అయితే వెళ్లి ప్రార్థించండి,” అని బహిరంగంగా వ్యాఖ్యలు చేసినప్పటికీ, అతనిపై ఏ చర్యా తీసుకోలేదు. కనీసం అతన్ని క్షమాపణ కోరలేదు, తొలగించాలని ప్రయత్నించలేదు. అంతేకాదు, ఆతనపై ఒక న్యాయవాది దుర్భాషలాడినప్పుడు, అన్ని రాజకీయ పార్టీలూ వెంటనే ఆ న్యాయమూర్తి గౌరవాన్ని కాపాడేందుకు ముక్తకంఠంతో ఖండించాయి.
కానీ ఈరోజు పరిస్థితి మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంది. హిందూ మతానికి చెందిన స్థలంలో శతాబ్దాలుగా కొనసాగుతున్న కార్తీక దీపం వెలిగించే ఆచారాన్ని కొనసాగించేందుకు భక్తుల హక్కును సమర్థిస్తూ తీర్పు ఇచ్చినందుకు ఒక విధుల్లో ఉన్న హైకోర్టు న్యాయమూర్తినే లక్ష్యంగా చేసుకున్నారు. న్యాయమూర్తిని తొలగించడానికి అతను "అసభ్యకరంగా వ్యవహరించడం" లేదా “అసమర్థత” మాత్రమే కారణాలై ఉండాలని భారత రాజ్యాంగం స్పష్టంగా చెబుతోంది.
కానీ DMK ఆధ్వర్యంలోని INDI కూటమి బ్లాక్‌కు చెందిన 120మందికి పైగా ఎంపీలు రాజ్యాంగాన్నే ఆయుధంగా చేసుకుని, ఈ న్యాయమూర్తిపై అభిశంసన నోటీసు ఇచ్చారు. ఇది న్యాయపాలనపై జవాబుదారీతనం కాదు, ఇది బహిరంగ రాజకీయ బెదిరింపు. హిందూ భక్తుల హక్కులను కాపాడుతూ తీర్పు ఇచ్చినందుకు ఇలా ఒక న్యాయమూర్తిని లక్ష్యంగా చేసుకోవడానికి కారణం ఏమిటి? ఇది న్యాయవ్యవస్థ మొత్తాన్ని భయపెట్టే యత్నం కాదా? హిందూ సంప్రదాయాలు, ఆచారాలపై తీర్పు ఇస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలన్న పరోక్ష సందేశం కాదా?
ఇది న్యాయవ్యవస్థను నేరుగా భయపెట్టే ప్రయత్నం.
ఇది సూటిగా “హిందూ ఆచారాలపై తీర్పులు మా రాజకీయ విధానాలకు అనుగుణంగా లేకపోతే మిమ్మల్ని లక్ష్యంగా చేస్తాం” అన్న సందేశం. ఈ ఘటన సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవడానికి,ఈ ఉమ్మడి స్వరం వినిపించేందుకు ఒక సమిష్టి వేదిక అవసరాన్ని మరింత బలపరుస్తోంది.
ఇలాంటి సందర్భంలో భక్తులు తమ దేవాలయాలను, తమ మత వ్యవహారాలను స్వతంత్రంగా నిర్వహించేందుకు, రాజకీయ జోక్యం లేకుండా, రాజకీయ ద్వేషంతో ప్రేరితమైన న్యాయ దుర్వినియోగాలకు గురవకుండా ఉండేందుకు "సనాతన ధర్మ రక్షణ బోర్డు" ఏర్పాటే దేశానికి అత్యవసరం.
చివరిగా, దేశంలోని స్వయం ప్రకటిత మేధావులకు, ముఖ్యంగా సూడో సెక్యులర్లకు స్పష్టం చేస్తున్నాను,హిందువులు తమ మతాచారాలను ఆచరించడం కూడా భారత రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కు సనాతన ధర్మాన్ని ఆచరించడం అంటే ఇతర మతాలకు వ్యతిరేకమని కాదు. సెక్యులరిజం రెండువైపులా నడవాలి. ఒకవైపే నడిస్తే అది సెక్యులరిజం కాదు, అది సెలెక్టివ్‌ సూడో సెక్యులరిజం. ప్రతి మతాన్నీ సమాన గౌరవంతో చూడాలి. అందులో హిందువులు కూడా ఉన్నారు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అంటూ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Read More
Next Story