కుక్క కాదు ప్రాణం..2 లక్షలతో సమాధి
x

కుక్క కాదు ప్రాణం..2 లక్షలతో సమాధి

శునకంపై అంతులేని ప్రేమను పెంచుకున్నారు. దానికి ఆరోగ్యం బాగలేకపోతే వైద్యానికి రూ.7 లక్షలు ఖర్చుపెట్టారు.


అది కుక్క కాదు వారి ప్రాణం. వారి పట్ల ఎంతో విశ్వాసంగా మెలిగిన ఆ శునకం అనారోగ్యంతో మరణిస్తే ఆ కుటుంబం తట్టకోలేకపోయింది. కుటుంబంలో సభ్యుడితో సమానంగా చూసుకున్న పెంపుడు కుక్క అనారోగ్యానికి గురైతే లక్షలు ఖర్చు చేసి వైద్యం చేయించారు. మరణించిన తర్వాత ఘనంగా అంత్యక్రియలు నిర్వహించి, దానిపై ఉన్న ప్రేమతో ఏకంగా సమాధి కూడా కట్టించారు. ఈ అరుదైన, హృదయాన్ని హత్తుకునే సంఘటన చిత్తూరులో చోటు చేసుకుంది.

వివరాలు
చిత్తూరులోని సిద్ధార్థనగర్‌కు చెందిన డాక్టర్‌ సుదర్శన్‌ దంపతులు సుమారు పదేళ్ల క్రితం జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన ఒక శునకాన్ని ఇంటికి తెచ్చుకున్నారు. దానికి 'బాక్సీ రాట్‌వీల్లర్‌' అని పేరుపెట్టి కుటుంబంలో ఒకరిగా పెంచుకున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. దానిని విడిచి ఉండలేక పోయేవారు.
ఆ శునకం ఆ కుటుంబం పట్ల ఎంతో విశ్వాసాన్ని ప్రదర్శించేది. పగలూ రాత్రి తేడా లేకుండా ఇంటికి కాపలా కాస్తూ ఉండేది. గతంలో రెండు సార్లు ఇంట్లో జరగబోయిన చోరీలను సమర్థవంతంగా అడ్డుకుంది. ఆ శునకం దెబ్బకు దొంగలు పారిపోయారు. దీంతో ఆ శునకంపై ఇంకా వారికి ప్రేమ పెరిగిపోయింది. అయితే ఇటీవల వయసు (వయోభారం) కారణంగా బాక్సీ తీవ్ర అనారోగ్యానికి గురైంది. దీంతో డాక్టర్ సుదర్శన్ కుటుంబం ఏ మాత్రం వెనుకాడకుండా చెన్నై, బెంగళూరులోని పెద్ద ఆసుపత్రులకు తీసుకెళ్లి వైద్యం చేయించారు.
ఇందుకోసం సుమారు రూ. 7 లక్షల వరకు ఖర్చు చేశారు. అయితే వారి ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఎంత ప్రయత్నంచినా, ఎన్ని ఆసుపత్రులకు తిప్పినా ఆ శునకాన్ని ప్రాణాలతో కాపాడుకోలేకపోయారు. నవంబరు 11న ఆ శునకం మరణించడంతో ఆ డాక్టర్ కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మనిషికి చేసినట్లుగానే ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. దానిపై ఉన్న అంతులేని ప్రేమతో ఏకంగా రూ. 2 లక్షలు ఖర్చు చేసి సమాధి నిర్మించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఆ శునకానికి, ఆ డాక్టర్ కుటుంబానికి మధ్య ఉన్న ప్రేమను, ఆప్యాయతను, ప్రపంచానికి చాటారు. కేవలం రెండు లక్షలతో సమాధి కట్టించడమే కాకుండా దానిపై ఆ శునకం రూపాన్నిచెక్కించి పెట్టారు. ఇది స్థానికులనే కాదు, చూపరులను కూడా ఆకట్టుకుంటోంది.
Read More
Next Story