కశ్మీర్‌లో ఉగ్ర దాడి ఆంధ్రప్రదేశ్‌ను శోక సముద్రంలోకి నెట్టింది. మంగళవారం జరిగిన పహల్గామ్‌లో ఉగ్ర మూకలు జరిపిన పాశవిక దాడిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు అనామకులు బలయ్యారు. వీరిలో చంద్రమౌళి విశాఖకు చెందిన వారు కాగా సోమిశెట్టి మధుసూదన్ కావలికి చెందిన వారు. విశాఖకు చెందిన చంద్రమౌళి భౌతికకాయం బుధవారం రాత్రి విశాఖపట్నంకు చేరుకోగా, మధుసూదన్ భౌతికకాయం గురువారం ఉదయం కావలికి చేరుకుంది. గురువారం తెల్లవారు జామున మూడు గంటల ప్రాంతంలో ఘటన స్థలం నుంచి చెన్నై ఎయిర్‌పోర్టుకు చేరుకున్న మధుసూదన్ పార్దివ మృతదేహాన్ని కావలికి తరలించారు.
మధుసూదన్ మృతదేహం కావలికి తరలించారనే సమాచారం తెలుసుకున్న బంధుమిత్రులు, స్థానికులు మధుసూదన్‌కు నివాళులు అర్పించేందుకు భారీగా తరలి వస్తున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేసేందుకు ఏర్పాట్లు చేపట్టారు. మంగళవారం ఉగ్ర దాడిలో మధుసూదన్ మృతి చెందారనే వార్తతో కావలిలో విషాదం అలుముకుంది. విషయం తెలుసుకున్న మధుసూదన్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
కావలికి చెందిన మధుసూదన్ బెంగుళూరులో స్థిరపడ్డారు. తన కుటుంబ సభ్యులతో కలిసి కశ్మీర్ విహార యాత్రకు వెళ్లారు. అక్కడ ఉగ్ర దాడికి ఆయన బలయ్యారు. మరో వైపు మధుసూదన్ తల్లిదండ్రుల పరిస్థితి దయనీయంగా ఉంది. మధుసూదన్ తండ్రి తిరుపాల్, తల్లి పద్మావతి కావలి పట్టణంలో పెదపవని బస్టాండ్‌లో అరటిపళ్లు, టెంకాయల వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు. ఇద్దరు ఆడపిల్లల తర్వాత మధుసూదన్ జన్మించాడు. ఆర్థిక స్థోమత లేక పోయినా ఎంతో కష్టపడి మధుసూదన్‌ను ఉన్నత చదువులు చదివించారు. దానికి తోడు మధుసూదన్ చిన్న నాటి నుంచి తెలివైన విద్యార్థి. చిన్న నాటి నుంచి చదువులో మెరుగ్గానే రాణించారు.
మంచి మార్కులు తెచ్చుకుంటున్న మధుసూదన్‌ను ఆర్థిక భారమైనప్పటికీ అన్నీ భరించి ఇంజనీరింగ్ చదివించారు. చదువు పూర్తి అయిన తర్వాత ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ ఐబీఎంలో కొలువు సంపాదించి, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తూ బెంగుళూరులో స్థిరపడ్డారు. అక్కడ ఓ ఇల్లును కూడా సమకూర్చుకున్నారు. భార్య కామాక్షి, కుమార్తె మేధు, కుమారుడు దత్తుతో కలిసి అక్కడే ఉంటున్నారు. వీరిందరితో కలిసి కశ్మీర్ విహార యాత్రకు వెళ్లారు. అక్కడ ఉగ్రవాదులు మధుసూదన్‌ను పొట్టన పెట్టుకున్నారు. దీంతో ఒక్క సారిగా ఆయన కుటుంబం కుప్పకూలి పోయింది. తల్లిదండ్రులు శోక సముద్రంలో మునిగి పోయారు. ఒక్క గాని ఒక్క కుమారుడు అన్యాయంగా ఉగ్రవాదుల దాడిలో బలి కావడంతో, తమకు దిక్కెవరని గుండెలు బాదుకుంటూ విలపిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.