Sailaja|శైలజ మృతితో పెరిగిపోతున్న టెన్షన్
x

Sailaja|శైలజ మృతితో పెరిగిపోతున్న టెన్షన్

కిడ్నీలు, ఊపిరితిత్తులు దెబ్బతినటంతో వైద్యులు చేసిన అన్నీ ప్రయత్నాలు ఫెయిలై చివరకు సోమవారం రాత్రి చనిపోయింది.


చనిపొయిన గిరిజన విద్యార్ధిని చౌదరి శైలజ గ్రామం సవతిదాబాలో టెన్షన్ వాతావరణం పెరిగిపోతోంది. అక్టోబర్ 30వ తేదీన కుమరంభీం అసిఫాబాద్ జిల్లాలో(komuram Bheem Asifabad District)ని వాంకిడి(Vankidi) గిరిజన ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిన్న విద్యార్ధినుల్లో 64 మంది అస్వస్ధతకు గురైన విషయం తెలిసిందే. వీరిలో 9వ తరగతి చదువుతున్న ముగ్గురు మహాలక్ష్మి, జ్యోతి, శైలజ పరిస్ధితి విషమించటంతో హైదరబాదుకు తరలించారు. వీరిలో కూడా జ్యోతి, మహాలక్ష్మి కోలుకున్నారు. శైలజ(Chaudary Sailaja) పరిస్ధితి మాత్రం బాగా విషమించింది. కిడ్నీలు, ఊపిరితిత్తులు దెబ్బతినటంతో వైద్యులు చేసిన అన్నీ ప్రయత్నాలు ఫెయిలై చివరకు సోమవారం రాత్రి చనిపోయింది. దాంతో ఆశ్రమ పాఠశాలలోనే కాకుండా శైలజ సొతూరు సవతిదాబా(Savati Daba)లో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఎప్పుడైతే శైలజ చనిపోయిందని తెలుసుకున్నారో మంగళవారం ఉదయం నుండి గిరిజన సంఘాల నేతలు, ఆదివాసీ సంఘాల నేతలు, బీఆర్ఎస్ నేతలు గ్రామానికి క్యూ కట్టారు. దాంతో గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పెద్దఎత్తున మోహరించారు. హక్కుల సంఘాల నేతలు, బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరూ గ్రామంలోకి అడుగుపెట్టనీయకుండా పోలీసులు దూరంగానే అడ్డుకుంటున్నారు. దీంతో పోలీసులకు, హక్కులసంఘాల నేతలు, కారుపార్టీ నేతలకు పెద్దఎత్తున వాగ్వాదం జరుగుతోంది. బీఆర్ఎస్ అసిఫాబాద్ నియోజకవర్గం ఎంఎల్ఏ కోవాలక్ష్మీ(BRS MLA Kova Lakshmi)ని కూడా శైలజ గ్రామంలోకి అడుగుపెట్టేందుకు వీల్లేదని పోలీసులు ఆంక్షలు విధించారు. తమ గిరిజన బిడ్డ చనిపోతే తాను ఎందుకు చూడకూడదని కోవాలక్ష్మీ పోలీసులతో ఎంత వాధించినా ఉపయోగంలేకపోయింది. చివరకు ఎంఎల్ఏను పోలీసులు ఇంటినుండి కదలనీయకుండా హౌస్ అరెస్టు చేయటం మరింత ఉద్రిక్తతకు దారితీసింది.



శైలజ మృతదేహాన్ని పోలీసులు హైదరాబాద్(Hyderabad) నుండి గట్టి బందోబస్తు మధ్య సొంతూరు సవతిదాబాకు తీసుకొచ్చారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో చనిపోయిన తమ కూతురు మృతికి న్యాయం జరిగేంతవరకు అంత్యక్రియలు జరిపేదిలేదని విద్యార్ధిని తల్లిదండ్రులు, బంధువులు తెగేసి చెప్పారు. దాంతో గ్రామంలో ఎప్పుడేమి జరగుతుందో తెలీక టెన్షన్ పెరిగిపోతోంది. గ్రామం చుట్టూ పోలీసులు బందోబస్తు పెంచేశారు. శైలజ అంత్యక్రియలు అయ్యేంతవరకు బయటవాళ్ళని ఎవరినీ గ్రామంలోకి అడుగుపెట్టనిచ్చేదిలేదని పోలీసులు స్పష్టంచేస్తున్నారు. దాంతో ఏమైందంటే గ్రామంలోకి వెళ్ళాలని బయటవాళ్ళు, గ్రామంలోకి అడుగుపెట్టనిచ్చేదిలేదని పోలీసులు గ్రామం చుట్టూ మోహరించారు. దాంతో గ్రామానికి చుట్టూతా తీవ్ర ఉద్రిక్త వాతావరణం పెరిగిపోతోంది.

స్కూలు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే శైలజ చనిపోయినట్లు తల్లి, దండ్రులు ఆరోపిస్తున్నారు. కలుషిత ఆహారం తిన్న విద్యార్ధులు వాంతులు, విరేచనాలతో అస్వస్ధతకు గురై 27 రోజుల క్రితం ఆసుపత్రిలో చేరితే ఇప్పటివరకు కారణం చెప్పకపోవటం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్టగా విద్యార్ధుల తల్లి, దండ్రులు మండిపోతున్నారు. అందుకనే తమ కూతురు శైలజ మృతికి కారకులు ఎవరు, కారణాలు ఏమిటని తల్లి, దండ్రులు అడుగుతున్నా ప్రభుత్వం ఇప్పటివరకు ప్రకటన చేయలేదు. ఈ నేపధ్యంలోనే ఘటనను అడ్వాంటేజ్ తీసుకున్న బీఆర్ఎస్ ఎంఎల్ఏ హరీష్ రావు(HarishRao) మాట్లాడుతు శైలజ మృతి ప్రభుత్వం చేసిన హత్యగా ఆరోపించారు. మృతురాలి కుటుంబానికి రు. 50 లక్షలు పరిహారం అందించాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఇల్లు ఇవ్వాల్సిందే అని డిమండ్ చేశారు. గురుకులాల్లో నాణ్యతలేని భోజనం, కలుషితాహారం అందిస్తుండటంతోనే విద్యార్ధులు అనారోగ్యానికి గురవుతున్నట్లు బీఆర్ఎస్ నేతలు మండిపోతున్నారు. చివరకు సవతిదాబాలో పరిస్ధితి ఎప్పుడు చక్కబడుతుందో చూడాలి.

Read More
Next Story