లోన టెన్షన్‌.. పైకి గాంభీర్యం!
x

లోన టెన్షన్‌.. పైకి గాంభీర్యం!

ఎన్నికల తంతు ముగిసింది. ఇప్పుడు గెలుపెవరిది? ప్రధాన పార్టీలను వెంటాడుతోంది. అభ్యర్థుల్లో లోలోన టెన్షన్‌.. లేదు గెలుపు మనదేనని పైకి గాంభీర్యం.


సార్వత్రిక ఎన్నికల కోలహలం ముగియడంతో సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు లెక్కలు కట్టుకోవడంలో బిజీ అయ్యారు. జూన్‌ 4న ఓట్ల లెక్కింపు (కౌంటింగ్‌) గడువు ఉండటంతో టెన్షన్‌తో అభ్యర్థులు సతమతమవుతున్నారు. అధికారికంగా విజేతలెవరో లెక్క తేల్చడానికి ఇంకా 20 రోజులు సమయం ఉండటంతో అందరిలోను ఒక్కటే ఉత్కంఠ నెలకొంది. ఏ ఇద్దరు కలిసినా.. ఏ ఇద్దరు ఫోన్‌లో మాట్లాడుకున్నా.. ఎవరు గెలుస్తారంటారు? ప్రభుత్వం ఏది వస్తుందంటారు? అనే ప్రశ్నలు సంధిస్తుండటం గమనార్హం. ఎవరికీ చాన్స్‌ ఉందంటారు? అంటూ మీడియా ప్రతినిథులను సైతం ఫోన్‌ల ద్వారా, ప్రతక్ష్యంగాను ఆరా తీస్తున్నవారి సంఖ్య అధికంగా ఉంది. బెట్టింగ్‌రాయుళ్లు సైతం రంగంలోకి దిగి సీట్లు, మెజార్టీలు, ప్రభుత్వ ఏర్పాటు వంటి అన్ని అంశాలపైన పెద్ద ఎత్తున పందాలు కట్టేవారు సైతం ఆరాలు తీస్తున్నారు.

లెక్కల్లో నేతల బిజీ బిజీ...

ఓటరు దేవుళ్లు ఎవరిని కరిణించారో స్పష్టతలేకపోవడంతో రాజకీయ పార్టీల అభ్యర్థుల నుంచి అధినాయకుల వరకు తీవ్ర వత్తిడికి గురౌతున్నారు. దీంతో ఎక్కడ ఎవరికి ఎన్ని ఓట్లు పడుతాయనే దానిపై లెక్కలు తేల్చే పనిలో తలమునకలయ్యారు. క్షేత్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎవరికెన్ని ఓట్లు అనే దానిపై బీజీ అయ్యారు. గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాలు వారీగా ఎవరికెన్ని ఓట్లు పడ్డాయన్న దానిపై వివరాలు సేకరించే పనిలో పడ్డారు. తద్వారా గెలుపుపై ఒక అంచనాకు వచ్చేందుకు సిద్దమయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రాబునాయుడు సైతం వార్‌ రూమ్‌లో కూర్చొని కీలక నేతలతో జిల్లాల వారీగా గెలుపోటములపై లెక్కలు తేల్చి ప్రాథమికంగా ఎవరికి వారే ఒక అంచనాకు వచ్చినట్టు సమాచారం.

జగన్‌కు అనుకూల.. వ్యతిరేక గాలి..

రాష్ట్రంలో ఈసారి ఎన్నికల్లో సీఎం జగన్‌కు ఎంత అనుకూల పరిస్థితి ఉందో ఫలితాలను కూడా ప్రభావింత చేసే స్థాయిలో వ్యతిరేక గాలి సైతం వీచింది. దేశంలో ఏ రాష్ట్రంలోను అమలు చేయని విధంగా నేరుగా ఆర్థిక లబ్ది (డీబీటీ) ద్వారా నగదు జమ చేసే నవరత్నాల పథకాలను అమలు చేయడం సీఎం జగన్‌కు అత్యంత అనుకూల అంశం. వార్డు, గ్రామ సచివాలయాలతో ఇంటి వద్దకే ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలను అందించారు. విద్య, వైద్యం వంటి రంగాల్లోను చేపట్టిన విప్లవాత్మక చర్యల వల్ల మంచి ఫలితాలు వచ్చాయి. సామాజిక న్యాయం అమలుతో అట్టడుగు వర్గాలను ఆకట్టుకున్నారు. మెడికల్‌ కాలేజీలు, పోర్టులు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు సైతం జగన్‌కు సానుకూల అంశాలు.

ఇదే సమయంలో ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు, ప్రజలతో నేరుగా సంబంధాలు లేకపోవడం వ్యతిరేక ప్రచారానికి దోహదం చేశాయి. ఇసుక, మద్యం పాలసీలు, రాజధానిపై భిన్నవైఖరి కొంత ఇబ్బందికరంగా మారింది. ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, మద్యపాన ప్రియులు తీవ్ర వ్యతిరేకంగా పనిచేశారు. ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం అమలును ప్రతిపక్షం ఆయుధంగా వాడుకుంది. గత ఎన్నికల్లో వెన్నుదన్నుగా నిలిచిన సొంత చెల్లి నుంచి ప్రశాంత్‌ కిషోర్‌ వరకు ఈసారి జగన్‌ ఓటమికి కలిసికట్టుగా కృషి చేయడం ఇబ్బందికరమే.

చంద్రబాబుకు అనుకూల.. వ్యతిరేక పవనాలు

సీనియర్‌ రాజకీయ నాయకుడిగా చంద్రబాబుకు బీజేపీ, జనసేన శ్రేణులతోపాటు సొంత సామాజికవర్గంలోని పెట్టుబడిదారులతో పాటు కొన్ని వర్గాలు బాగా అనుకూలంగా కలిసి వచ్చాయి. చంద్రబాబు గెలుపు కోసం సొంత సమాజికవర్గానికి చెందిన ఎన్‌ఆర్‌ఐలతోపాటు బడా పారిశ్రామిక వేత్తలు సైతం ఆర్థిక బలాన్ని చేకూర్చడంతో పాటు అనుకూల ఓటింగ్‌ కోసం గట్టి ప్రయత్నం చేశారు. ఈ ఎన్నికల్లో జగన్‌పై వ్యతిరేకతను పెంచడానికి అవసరమైన వ్యూహాలు, సమీకరణలు చేయడంతో సక్సెస్‌ అయ్యారు. ఇదే సమయంలో చంద్రబాబు మాటను జనం అంతగా విశ్వసించలేదనే ప్రచారం ఉంది. బడా బాబులకే సీట్లు ఇచ్చారన్న ప్రచారం ఇబ్బందికరంగా మారింది. సీఎం జగన్‌ మాదిరిగా గత ఐదేళ్లలో తానేమి చేశాడో ప్రజలకు చెప్పి ఓట్లు అడిగే పరిస్థితిలో ఎన్నికల ప్రచారాన్ని చేసుకోలేకపోయారు. తన సొంత సామాజికవర్గానికి మాత్రమే మేలు తప్ప, పేదల సంక్షేమాన్ని పట్టించుకోని మనస్తత్వం చంద్రబాబు నాయుడిది అని ప్రచారం సాగింది.

జగన్‌ కావాలా?.. జగన్‌ వద్దా?

ఏ ఎన్నికలైనా రాజకీయ పార్టీలు అనుకూల, వ్యతిరేక అంశాలపై ఓటింగ్‌ జరగడం మనం చూస్తుంటాం. కానీ, ఈసారి ఎన్నికలు భిన్నంగా జరిగాయి. 2014 ఎన్నికల్లో విభజిత ఆంధ్రప్రదేశ్‌కు అనుభవజ్ఞుడైన చంద్రబాబు ఈ రాష్ట్రానికి అవసరమని భావించిన ప్రజలు ఆయనకు అవకాశం ఇచ్చారు. అదే 2019 ఎన్నికల్లో మాత్రం చంద్రబాబుపై తీవ్ర వ్యతిరేకత పెరగడంతోపాటు జగన్‌కు ఈసారి ఒక్క అవకాశం ఇద్దామని భావించి గెలిపించారు. ప్రస్తుత(2024) ఎన్నికల్లో జగన్‌కు వ్యతిరేకం, చంద్రబాబుకు అనుకూలం అని కాకుండా.. జగన్‌ కావాలా? జగన్‌ వద్దా? అనే ఒక్క అంశంపైనే ఓటింగ్‌ జరిగింది.

ఉదయం జరిగిన ఓటింగ్‌ టిడిపికి అనుకూలం

ఉదయం 12 గంటల వరకు జరిగిన పోలింగ్‌ చంద్రబాబునాయుడుకు అనుకూలంగా ఉన్నట్లు ఎగ్జిట్‌ పోల్స్‌ నిర్వహించిన వారు చెబుతున్నారు. ఎక్కువ మంది ముందుగా వచ్చి బాబుకు ఓటు వేయాలనే ఆలోచనలోనే ఉన్నారని, ఉదయం ఓటింగ్‌ భారీగానే జరిగిందని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కొన్ని జిల్లాల్లో 82, నుంచి 83 శాతం వరకు పోలింగ్‌ జరిగింది. ఈ పోలింగ్‌ పెరగటం అనేది టిడిపికి అనుకూలంగా ఉంటుందని పలువురు అంచనా వేస్తున్నారు. స్థానికులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు.

జనసేన, బిజెపి బాబుకు కలిసొచ్చాయా?

జనసేన, బిజెపి పొత్తుతో చంద్రబాబుకు కలిసొచ్చిందా? లేదా? అనే చర్చ సాగుతోంది. చాలా వరకు కలిసి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కొన్ని చోట్ల బిజెపి ఎంపీకి ఓటు వేయకుండా టిడిపికి మైనార్టీ వర్గాల వారు ఓట్లు వేసినట్లు సమాచారం. పవన్‌కళ్యాణ్‌పై అభిమానం ఉన్న వారు టిడిపికి క్రమం తప్పకుండా ఓట్లు వేశారు. గోదావరి జిల్లాల్లో జరిగిన పోలింగ్‌ కూటమికి అనుకూలంగా ఉన్నట్లు సమాచారం.

Read More
Next Story