టెన్షన్ : అందరి దృష్టి హైకోర్టు తీర్పుపైనే
x

టెన్షన్ : అందరి దృష్టి హైకోర్టు తీర్పుపైనే

కొడంగల్ మాజీ ఎంఎల్ఏ పట్నం నరేందర్ రెడ్డి(Patnam Narendar Reddy) విడుదలపై బుధవారం హైకోర్టులో తీవ్రస్ధాయిలో లాయర్ల మధ్య వాగ్వాదాలు జరిగాయి.


తెలంగాణా హైకోర్టు తీర్పుపైనే రేవంత్ రెడ్డి, కేటీఆర్ వ్యూహాలు ఆధారపడున్నాయి.

హైకోర్టు తీర్పుమీదే లగచర్ల భూసేకరణ ఆధారపడుంది.

హైకోర్టు తీర్పుపైనే ప్రభుత్వం ప్రిస్టేజి ఆధారపడుంది.

ఇన్ని విషయాలు హైకోర్టు తీర్పుమీదే ఆధారపడుంది అన్నపుడు ప్రభుత్వం, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతల్లో టెన్షన్ ఎంతుండాలి ? ఇంతకీ విషయం ఏమిటంటే లగచర్ల(Lagacharla village) గ్రామసభలో కలెక్టర్ ప్రతీక్ జైన్(Collector Prateek Jain) మీద జరిగిన దాడికి బీఆర్ఎస్ సీనియర్ నేత, కొడంగల్ మాజీ ఎంఎల్ఏ పట్నం నరేందర్ రెడ్డి(Patnam Narendar Reddy) విడుదలపై బుధవారం హైకోర్టులో తీవ్రస్ధాయిలో లాయర్ల మధ్య వాగ్వాదాలు జరిగాయి. రెండువైపుల లాయర్ల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వుచేసింది. తీర్పు ఎప్పుడిస్తుందో తెలీదుకాబట్టి అందరిలోను టెన్షన్ పెరిగిపోతోంది. తన అరెస్టు అక్రమం అంటు పట్నం కోర్టులో దాఖలుచేసిన క్వాష్ పిటీషన్ పైనే ఈరోజు వాదనలు జరిగాయి.

పట్నం తరపు లాయర్ గండ్ర మోహన్ రావు వాదనలు వినిపిస్తు పట్నం అరెస్టు పూర్తిగా అక్రమం అన్నారు. పట్నంను అరెస్టు చేసేముందు సుప్రింకోర్టు తీర్పును పోలీసులు ఫాలో అవలేదన్నారు. అరెస్టు సమయంలో పోలీసులు ఏ దశలో కూడా లీగల్ ప్రొసీడింగ్స్ ఫాలో అవలేదని లాయర్ ఆరోపించారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే పట్నంను అరెస్టుచేయటం అక్రమం అన్నారు. పార్కులో ఉదయం వాకింగ్ చేస్తున్న మాజీ ఎంఎల్ఏని పోలీసులు అరెస్టుచేసిన విధానంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. లగచర్లలో ఘటన జరిగిన 11వ తేదీన నరేందరరెడ్డి అసలు అక్కడ లేనేలేడని వాదించారు. పట్నం అరెస్టుకు ఆధారం దాడి ఘటన నిందితుడు బోగమోని సురేష్ తో ఫోన్లో మాట్లాడటమే అని పోలీసులు చెప్పటం చాలా సిల్లీగా ఉందన్నారు. ఎందుకు అరెస్టుచేస్తున్నారో చెప్పకుండానే పోలీసులు పట్నంను అరెస్టుచేసినట్లు లాయర్ వివరించారు.

పట్నంను అరెస్టుచేసిన తర్వాత పోలీసులు తమిష్టమొచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ రాసుకుని అది పట్నం ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ అని కోర్టును తప్పుదోవపట్టించినట్లుగా ఆరోపించారు. పోలీసులు కోర్టులో సబ్మిట్ చేసిన కన్ఫెషన్ రిపోర్టుకు పట్నంకు సంబంధంలేదన్నారు. తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదన వినిపిస్తు లగచర్లలో కలెక్టర్ మీద దాడిచేయటం ద్వారా పట్నం ప్రభుత్వాన్ని అస్ధిరపరిచేందుకు కుట్రచేసినట్లు ఆరోపించారు. కలెక్టర్ తో పాటు ఇతర అధికారుల మీద పథకం ప్రకారమే పట్నం దాడిచేయించినట్లు ఆరోపించారు. దాడి ఘటనకు పట్నమే కీలక సూత్రదారుడిగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివరించారు.

ప్రాసిక్యూటర్ వాదనలు వినిపిస్తుండగానే జడ్జి జోక్యం చేసుకుని పట్నం కుట్రచేశాడు అనటానికి ఉన్న ఆధారాలు ఏమిటో చూపించమని అడిగారు. పట్నం అనుచరులంటే ఎవరని జడ్జి ప్రశ్నించారు. అరెస్టు సందర్భంగా పోలీసులు ఫాలో అయిన నియమ, నిబంధనలు ఏమిటని అడిగారు. పట్నం తన అనచరుడు సురేష్ తో మాట్లాడితే కుట్ర చేసినట్లు ఎలాగ అవుతుందని ప్రశ్నించారు. పార్కులో వాకింగ్ చేస్తున్న మాజీ ఎంఎల్ఏని పోలీసులు ఎలాగ అరెస్టు చేస్తారని జడ్జి తీవ్రంగానే నిలదీశారు. కలెక్టర్, అధికారులపైన జరిగిన దాడికి పట్నమే కారకుడనేందుకు ఉన్న ఆధారాలను చూపించమని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను జడ్జి అడిగారు. రెండువైపుల లాయర్ల వాదనలు విన్న జడ్జి తీర్పు ఎప్పుడిచ్చేది చెప్పకుండానే రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించారు.

పట్నం లాయర్ వాదనతో జడ్జి ఏకీభవిస్తే పట్నంకు బెయిల్ గ్యారెంటీ అని అర్ధమవుతోంది. కేసును కొట్టేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు. అదే జరిగితే పోలీసుల వాదన వీగిపోయినట్లే. అప్పుడు రేవంత్ తో పాటు ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నేతలు చెడుగుడు ఆడుకోవటం ఖాయం. ఫార్మాఇండస్ట్రీకి భూసేకరణలో కూడా ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవు. లగచర్ల రైతులు, గ్రామస్తుల స్పూర్తిగా మిగిలిన గ్రామాల్లోని రైతులు, గ్రామస్తులు కూడా భూములు ఇచ్చే విషయంలో ప్రభుత్వానికి ఎదురుతిరుగుతారు. ఫార్మా పరిశ్రమల కోసం భూసేకరణ ప్రభావం మూసీనది పునరుజ్జీవనం, ఫోర్త్ సిటీ భూసేకరణపైన కూడా పడే అవకాశముంది.

ఇదే సమయంలో పోలీసుల వాదనతో కోర్టు ఏకీభవించి పట్నం అరెస్టు సక్రమమే అని నిర్ధారిస్తే రేవంత్ కు వ్యక్తిగతంగా పెద్ద రిలీఫ్. నియోజకవర్గంలోనే కాదు ఇతర ప్రాంతాల్లో కూడా భూసేకరణకు వ్యతిరేకంగా గొంతు ఎత్తేందుకు జనాలు వెనకాడుతారు. కొడంగల్ నియోజకవర్గంలో భూసేకరణ ప్రక్రియ జోరందుకుంటుంది. లగచర్ల ఘటనలో రేవంత్ ను తప్పుపడుతు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) చేస్తున్న ఆరోపణలు వీగిపోతాయి. భవిష్యత్తులో ఈ విషయమై మాట్లాడటానికి కేటీఆర్ కు పెద్దగా ఏమీ ఉండదు. పనిలోపనిగా బీజేపీ ఎంపీ డీకే అరుణ(BJP MP DK Aruna) తదితరులకు కూడా రేవంత్(Revanth) కు వ్యతిరేకంగా మాట్లాడేందుకు ఏమీ ఉండదు. అందుకనే పట్నం అరెస్టుపై హైకోర్టు తీర్పుపైనే అందరిలోను టెన్షన్ పెరిగిపోతోంది.

Read More
Next Story