కేంద్ర బడ్జెట్ పై కుడితిలో పడ్డ ఎలుకల్లో తెలుగు రాష్ట్రాల పరిస్థితి
x

కేంద్ర బడ్జెట్ పై 'కుడితిలో పడ్డ ఎలుకల్లో' తెలుగు రాష్ట్రాల పరిస్థితి

మోదీని పల్లెత్తు మాట అనలేని విపత్కర పరిస్థితిలో ఏపీ అధికార, ప్రతిపక్ష పార్టీలుంటే తెలంగాణలో అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ ఒకర్నొకరు విమర్శించుకుంటున్నాయి.


'కొడదామంటే అక్క కూతురు, తిడదామంటే కట్టుకున్న భార్య' అనే తెలుగు సామెత ఒకటుంది. ఈవేళ్టి కేంద్ర బడ్జెట్ చూసిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలలోని నేతల పరిస్థితి అచ్చంగా ఇలాగే ఉంది. మరికొన్ని రాజకీయ పార్టీల పరిస్థితైతే కుడిలో పడ్డ ఎలుక మాదిరిగా తయారైంది.

ఆంధ్రప్రదేశ్ రాజధానికి మట్టి తప్ప మరేమీ ఇవ్వని నరేంద్ర మోదీ 2025-2026 ఆర్ధిక సంవత్సరపు బడ్జెట్ ప్రతిపాదనల్లో అమరావతికి నయాపైసా కేటాయింపులు లేకపోయినా ఇది సుసంపన్నమైన భవిష్యత్ కి బ్లూప్రింట్ అని కీర్తించక తప్పలేదు చంద్రబాబుకి.

ఇలాగే తెలంగాణలోనూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ మంత్రులు మామూలుగా మోదీకి జేజేలు పలికి తెలంగాణ విషయం వచ్చేసరికి అశ్వత్థామ హతః కుంజరః అన్నట్టుగా సన్నాయి నొక్కులు నొక్కుతుంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ మాత్రం నేరుగా కేంద్ర ప్రభుత్వంపై బాణాలు ఎక్కుపెట్టింది.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా కేటాయింపులపై ఇంకా స్పష్టత రాలేదు. చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదని కాంగ్రెస్ ఆరోపణలకు దిగితే అదేం కాదు.. కేంద్ర ప్రభుత్వం ఏ సంస్కరణలు తీసుకొచ్చినా.. దాని లబ్ధి తెలంగాణ రాష్ట్రానికి, ప్రజలకు ఉంటుందని బీజేపీ నేతలు చెబుతున్నారు.

ఇప్పటికి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, కేంద్రం నుంచి రాష్ట్రానికి ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత దక్కలేదని భావిస్తున్నారు.

ఎప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టినా...

కేంద్ర బడ్జెట్ ఎప్పుడు ప్రవేశ పెట్టినా తెలుగు రాష్ట్రాల్లో ఓ రకమైన అలజడి ఉంటుంది. డబుల్ ఇంజిన్ సర్కార్లైతే ప్రశంసలు, పొగడ్తలు అక్కడొకటి, ఇక్కడొకటైతే తెగడ్తలు చాలా కామన్. చిత్రమేమిటంటే ఈసారి నిర్మలా సీతారామన్ అసలు తెలుగు రాష్ట్రాల పేర్లను కూడా కనీసం ప్రస్తావించలేదని రెండు రాష్ట్రాలకు చెందిన నేతలు నిష్ఠూరమాడారు. తమకు చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదని తెలంగాణ నేతలు చెబుతుంటే మోదీ ప్రభుత్వానికి నేరుగా మద్దతు ఇస్తున్న తెలుగుదేశం సారథ్యంలోని ఏపీ కూటమి నేతలు పెద్దగా ఎలాంటి విమర్శలు లేవు. టీడీపీ ఎన్డీఏ కూటమిలో ఉండటం వల్ల చిక్కు ఇది. దీంతో దక్కిందే మహా ప్రసాదం అనుకుని సూపర్, డూపర్, బ్లూప్రింట్, భవిష్యత్ కు బాటలు అంటున్నారు.

గమ్మత్తయిన విషయమేమిటంటే చంద్రబాబు మీద ఒంటి కాలి మీద లేచే వైసీపీ ఇంతవరకు నోరే తెరవలేదు. అటు కీర్తించడం గాని ఇటు విమర్శించడం గానీ చేయకుండా కిమ్మన్నాస్తి అంటూ నోటి మీద వేలేసుకుని కూర్చుని ఉంది.

అయితే తెలంగాణలో మాత్రం అటు పాలక పార్టీ.. ఇటు ప్రతిపక్ష పార్టీ కూడా భలే గమ్మత్తయిన విమర్శలు చేసుకుంటున్నాయి. పాలకపార్టీ నేరుగా బీజేపీని విమర్శిస్తే ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్.. కాంగ్రెస్ ను విమర్శిస్తుంది. ఏమీ తేలేకపోయారని అంటోంది. నేరుగా బీజేపీని విమర్శించకుండా తన దాడిని కాంగ్రెస్ పై చేస్తోంది. ఈ రెండు పార్టీల వాదన దాదాపు ఒకటే. తెలంగాణకు ఏమీ ఇవ్వలేదనే.

నిజానికి ఒక్క బీహార్ పేరు తప్ప.. ఏ రాష్ట్రం గురించి నిర్మలా సీతారామన్ చెప్పలేదు. బీహార్ లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కొన్ని ప్రకటనలు చేశారు. మిగతా బడ్జెట్ అంతా కేంద్ర పథకాలు.. పన్నుల కేటాయింపులతో ఉంది.

తెలంగాణకు చిల్లిగవ్వ రాకపోవడం అనేది ఏమీ ఉండదు. రాజ్యాంగ పరంగా కేటాయించాల్సిన కేటాయింపులన్నీ అన్ని రాష్ట్రాలతో పాటు తెలంగాణకు కేటాయించారని కేంద్రమంత్రులుగా ఉన్న బీజేపీ నేతలు చెబుతున్నారు. కేంద్ర పథకాలను కూడా అన్ని రాష్ట్రాలతో పాటు తెలంగాణకు ఇస్తారు. అయితే కేంద్రం వద్ద ప్రత్యేకంగా ఉండే సెస్సులు.. ఇతర నిధులతో ఏమైనా అదనంగా సాయం చేయాలనుకుంటే చేస్తుంది. అలాంటివి బడ్జెట్ లో ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పని లేదు.

మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల పరిస్థితి దయనీయంగానే ఉంది. ఒకళ్లేమో మద్దతు ఇచ్చి కుయ్యో మొర్రో అంటుంటే ఇంకొకళ్లేమో నేరుగా విమర్శించి లబోదిబో మంటున్నారు.

Read More
Next Story