ట్రంప్ వీసా దెబ్బతో అమెరికా అబ్బాయిల మీద మోజు తగ్గింది
x
Trump effect on Telugu Marriages

ట్రంప్ వీసా దెబ్బతో అమెరికా అబ్బాయిల మీద మోజు తగ్గింది

ఒకపుడు అమెరికా సంబంధం అంటే మహామోజుపడిన తల్లి, దండ్రులు ఇపుడు భయపడుతున్నారు


అమెరికాలో చదువుకోవటం, సెటిల్ అవ్వటం అన్నది ప్రపంచదేశాల్లోని జనాలకు ఒక కల. ఇందులో మనదేశంలోని యువతకు కూడా మినహాయింపు ఏమీలేదు. ప్రతిఏడాది అమెరికా(America)లో చదువుకోవాలని వెళుతున్న వారిసంఖ్య ఏటికేడాది పెరుగుతునే ఉంది. చదువుకోసం అమెరికాకు వెళుతున్న వాళ్ళల్లో అత్యధికుల లక్ష్యం ఆ దేశంలో సెటిల్ అయిపోవటమే. చదువుకుని, ఉద్యోగం సంపాదించుకున్న తర్వాత ఇండియాలోని అమ్మాయిలను వివాహం చేసుకుని తమతో తీసుకుని వెళ్ళిపోయేవారు. ఇండియాకన్నా అమెరికాలో అత్యున్నత జీవనప్రమాణాలు, డాలర్లలో సంపాదన కారణంగా అమ్మాయిల తల్లి, దండ్రులు తమ కూతుర్లకు అమెరికా సంబంధాలే చూసేవారు. ఇండియాకు, అమెరికాకు పోల్చిచూసుకుంటున్న అమ్మాయిలుకూడా అమెరికా సంబంధం అయితే చేసుకుంటామని పట్టుబడుతున్న వారు వేలల్లో ఉండేవారు.

అయితే ఇపుడు సీన్ రివర్సవుతోంది. డొనాల్డ్ జే ట్రంప్(US President Trump) అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత అమెరికాలో పరిస్ధితి రోజురోజుకు ఆందోళనగా మారుతోంది. ఏరోజు అమెరికా నుండి ఎవరిని తరిమేస్తారో తెలీకపోవటంతో అందరిలోను టెన్షన్ పెరిగిపోతోంది. ఈనేపథ్యంలోనే ఒకపుడు అమెరికా సంబంధం అంటే మహామోజుపడిన తల్లి, దండ్రులు ఇపుడు భయపడుతున్నారు. అమెరికా సంబంధం అయితేనే చేసుకుంటానని పట్టుబట్టే అమ్మాయిలు కూడా పట్టును సడలిస్తున్నారు. మ్యాట్రిమోనీల్లో(Matrimony sites) అమెరికా సంబంధాలు చూపించినా వద్దు లోకల్ సంబంధాలే మంచివి ఉంటే చెప్పండని ఇపుడు ప్రత్యేకంగా అడుగుతున్నవాళ్ళ సంఖ్య పెరుగుతోంది. స్ధానికసంబంధాల గురించి వాకాబుచేసేటపుడు అబ్బాయికి ఉద్యోగం, జీతం, కుటుంబనేపధ్యం, సొంతిల్లు గురించే ఇపుడు ఎక్కువగా అడుగుతున్నారు. ఒకపుడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడని అంటే చాలు కుటుంబనేపధ్యం, ఆస్తులగురించి పెద్దగా ఆలోచించకుండా అమ్మాయిని ఇచ్చి వివాహం చేయటానికి తల్లి, దండ్రులు బాగా ఉత్సాహం చూపించేవారు.

అలాంటిది అమ్మాయిలతో పాటు వాళ్ళ తల్లి, దండ్రుల్లో ఈమార్పు ఎందుకొచ్చింది ? ఎందుకంటే ట్రంపే కారణమని చెప్పకతప్పదు. మిగిలిన దేశంలోని యువతగురించి వదిలేసినా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సంబంధాలపై ట్రంప్ ఎఫెక్ట్(Trump Effect) గట్టిగానే పడుతున్నట్లు అర్ధమవుతోంది. ఈఎఫెక్ట్ ముందుముందు మరింతగా పెరిగినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఏడాదిలోపు మ్యారేజిబ్యూరోల్లో(Marriage Bureaus) సంబంధాలగురించి రిజిస్టర్ చేసుకున్న అమ్మాయిల తల్లి, దండ్రులు ఇపుడు అమెరికా సంబంధాలు కాకుండా ఇంకేవైనా మంచివి చూడమని అడుగుతున్నారు. ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత అమ్మాయిలకు వివాహాలు చేయాలని రిజిస్టర్ చేసుకుంటున్న తల్లి, దండ్రులు ప్రతి పదిమందిలో కనీసం ముగ్గురు అమెరికా సంబంధాలు వద్దని ముందే చెప్పేస్తున్నారు. దీనికి కారణం ఏమిటంటే అమెరికాలో అబ్బాయిల పరిస్ధితులే అంతంతమాత్రంగా ఉన్నపుడు తమ అమ్మాయినిచ్చి వివాహం జరిపించి ఇబ్బందుల్లోకి నెట్టటం ఇష్టంలేక ముందే చెప్పేస్తున్నారు అమెరికా సంబంధాలు వద్దని.

ఇదే విషయమై కాకతీయ మ్యారేజిబ్యూరో(Kakatiya Marriage Bureau) ఎండీ శ్రీనివాస్ ‘తెలంగాణ ఫెడరల్’ తో మాట్లాడుతు ‘అమ్మాయిలతో పాటు అమ్మాయిల తల్లి, దండ్రులకు అమెరికా సంబంధాలపై మోజు తగ్గుతోంద’న్నారు. ‘తమదగ్గర సంబంధాల కోసం రిజిస్టర్ చేసుకుంటున్న ప్రతిపదిమందిలో ఇద్దరు అమెరికా సంబంధాలు వద్దని చెప్పేస్తున్న’ట్లు చెప్పారు. ‘ఒకపుడు అమెరికాకు వెళ్ళి చదువుకోవటం, ఉద్యోగాలు చేసి డాలర్ల(Dollar Dreams)లో జీతాలు అందుకోవటం యువతకు కలగా ఉండేద’న్నారు. ‘అయితే మంచి ఉద్యోగాలు, పెద్ద జీతాలు మనదేశంలో కూడా దొరుకుతున్నపుడు ఇక అమెరికాకు ఎందుకు వెళ్ళాలని కూడా కొందరు ఆలోచిస్తున్నార’ని శ్రీనివాస్ చెప్పారు. ‘ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత రోజుకో నిబంధన తీసుకొస్తున్న కారణంగా దాని ఎఫెక్ట్ అమ్మాయిల తల్లి, దండ్రుల మీద బాగా కనబడుతోంద’ని చెప్పారు. ‘అమెరికాలోని అబ్బాయి పరిస్ధితే సరిగాలేనపుడు ఆ సంబంధంచేసుకుని తమ అమ్మాయిని కూడా ఇబ్బందుల్లోకి నెట్టడం ఎందుకని తల్లి, దండ్రులు ఆలోచిస్తున్న’ట్లు చెప్పారు. ‘తక్కువలో తక్కువ గతంతో పోల్చినపుడు ఇపుడు 30 శాతం అమెరికా సంబంధాలు వద్దంటున్న’ట్లు ఎండీ చెప్పారు. ‘మరికొందరైతే పరిస్ధితులు మళ్ళీ మారుతాయేమోనని అమెరికా సంబంధాలను హోల్డులో పెడుతున్న వాళ్ళు కూడా ఉన్నార’ని అన్నారు. అయితే ‘అమెరికాలో పర్మినెంట్ ఉద్యోగాలున్న అబ్బాయిలకు తమ కూతుళ్ళనిచ్చి వివాహాలు చేయటానికి తల్లి, దండ్రులు వెనకాడటంలేద’న్నారు. అయితే ఇపుడు అలాంటి సబంధాలు బాగా తగ్గిపోతున్నట్లు కూడా శ్రీనివాస్ చెప్పారు.

‘ఇదం బ్రహ్మమ్’ అనే బ్రాహ్మణ వివాహ వేదికలో యాక్టివ్ గా ఉండే విజయవాడకు చెందిన దుర్గరాజు స్వాతి మాట్లాడుతు ‘ఎన్ఆర్ఐ సంబంధాలంటే ఒకపుడున్న మోజు ఇపుడు తగ్గిపోతోంద’న్నారు. ముఖ్యంగా ‘అమెరికా సంబంధం అంటేనే కొందరు తల్లి, దండ్రులు వెనకాడుతున్న’ట్లు చెప్పారు. ‘అమెరికాలో అబ్బాయిలకు మంచి ఉద్యోగాలున్నా ఏరోజు ఏమవుతుందో అన్న ఆలోచనతో అమెరికా సంబంధం కాకుండా ఇంకేదైనా మంచి సంబంధాలుంటే చెప్పండ’ని అడుతున్నట్లు స్వాతి చెప్పారు. ‘లోకల్ గా ఉద్యోగాలు చేసుకుంటున్న అబ్బాయిల ఉద్యోగం, జీతం, ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ చూసుకుని ఇక్కడి అబ్బాయిలకు అమ్మాయినిచ్చి వివాహం చేయాలని ఆలోచిస్తున్న తల్లి, దండ్రుల సంఖ్య పెరుగుతోంద’న్నారు. ‘ఒకపుడు వివాహవేదికలో అమెరికా సంబంధాలు మాత్రమే కావాలని పట్టుబట్టిన తల్లి, దండ్రుల్లో ట్రంప్ ఎఫెక్ట్ కారణంగా ఇపుడు ముగ్గురు, నలుగురు లోకల్ అబ్బాయిలనే చూడండని అడుగుతున్నార’ని చెప్పారు. ‘తమ అమ్మాయిల వివరాలను నమోదుచేసే సమయంలోనే ఎన్ఆర్ఐ సంబంధాలు వద్దని స్పష్టంగా చెబుతున్న వారిసంఖ్య మెల్లిగా పెరుగుతోంద’ని కూడా స్వాతి చెప్పారు.

తమ్ముడి వివాహానికి రాలేకపోతున్న అన్న

విజయవాడకు చెందిన బందా మల్లిక మాట్లాడుతు ‘తమ చిన్నకొడుకు వివాహానికి అమెరికాలో ఉన్న పెద్ద కొడుకు వచ్చేందుకు వీల్లేకుండా పోయింద’ని ఆవేధన వ్యక్తంచేశారు. ‘ఒకవేళ తమ్ముడి వివాహానికి విజయవాడకు వచ్చి తిరిగి వెళ్ళేంతలోపు ట్రంప్ నిబంధనలు మార్చేస్తే కుటుంబమంతా ఇక్కడే ఉండిపోవాల్సొస్తుందేమో అని పెద్దకొడుకు ఆందోళనపడుతున్న’ట్లు చెప్పారు. ‘అమెరికాలో రోజురోజుకు మారిపోతున్న పరిస్ధితులు, ఎప్పుడే నిర్ణయం తీసుకుంటాడో తెలీని ట్రంప్ కారణంగా ఎప్పుడేమవుతుందో అన్న ఆందోళనతో తమ్ముడి వివాహానికి రావాలని పెద్దకొడుకును గట్టిగా అడగలేకపోతున్న’ట్లు మల్లిక బాధతో చెప్పారు.

Read More
Next Story