AlluArjun and SriTej|శ్రీతేజ్ అంటే ఇండస్ట్రీ వణికిపోతోందా ?
x

AlluArjun and SriTej|శ్రీతేజ్ అంటే ఇండస్ట్రీ వణికిపోతోందా ?

రేవతి మరణించడాన్ని పక్కనపెట్టేస్తే ఆసుపత్రిలో ఉన్న శ్రీతేజ కోలుకుని ఆరోగ్యంగా డిస్చార్జి అవ్వాలని మొత్తం సినీఇండస్ట్రీ కోరుకుంటోంది.


దెబ్బకు తెలుగు సినీఇండస్ట్రీ మొత్తం వణికిపోతోందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇవే అనుమానాలు పెరిగిపోతున్నాయి. జరిగిన ఘటనతో వారికి ఎలాంటి సంబంధంలేకపోయినా ఇండస్ట్రీలోని ప్రముఖులు ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. ఈనెల 4వ తేదీన పుష్పసినిమా చూడటానికి తల్లి రేవతి, తండ్రి భాస్కర్, చెల్లెలుతో కలిసి శ్రీతేజ్ సంధ్యా థియేటర్(Sandhya Theatre) కు వెళ్ళాడు. సినీమా థియేటర్ కు హీరో అల్లుఅర్జున్(AlluArjun) రావటంతో తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో తల్లి, శ్రీతేజ్(SriTej) ఒకవైపు తండ్రి, చెల్లెలు మరోవైపుకు వెళిపోయారు. తాను, తల్లి ఉన్నచోట జరిగిన తొక్కిసలాటలో ఇద్దరు కిందపడిపోయారు. అభిమానులు వీళ్ళని తొక్కేయటంతో ఇద్దరికీ ఊపిరి ఆడక స్పృహతప్పిపడిపోయారు. వెంటనే స్పందించిన పోలీసులు ఇద్దరికీ సీపీఆర్ ద్వారా ఊపిరిపోయటానికి చేసిన ప్రయత్నాలు ఫెయిలయ్యాయి. రేవతి అక్కడే మరణించగా శ్రీతేజ్ ను పోలీసులు ఆసుపత్రిలో చేర్పించారు.



ప్రస్తుతం శ్రీతేజ్ పరిస్ధితి కొద్దిగా మెరుగైందని తండ్రి భాస్కర్ చెప్పాడు. ఇన్నిరోజులు కోమాలోనే ఉన్న కొడుకు ఇప్పుడిప్పుడే స్పృహలోకి వస్తున్నట్లు చెప్పాడు. ఇన్నిరోజులు శరీరంలో కనబడని స్పర్శ ఇపుడే మొదలైందని, కళ్ళు తెరిచి చూస్తున్నాడని, అయితే ఎవరినీ గుర్తుపట్టడంలేదని భాస్కర్ చెప్పాడు. బ్రైన్ సంబంధిత సమస్య కావటంతో ఎప్పుడేమి జరుగుతుందో చెప్పలేమని డాక్టర్లు చెప్పినట్లు తండ్రి మీడియాతో చెప్పాడు. తల్లి స్పాట్ లోనే చనిపోవటంతో గడచిన మూడువారాలుగా అల్లుఅర్జున్ కేంద్రంగా ఎంత రచ్చ అవుతోందో అందరు చూస్తున్నదే. ఘటనకు కారకుడైన అల్లుఅర్జున్ మీద పోలీసులు కేసునమోదు చేయటమే కాకుండా అరెస్టు కూడా చేయటంతో రచ్చ పీక్స్ కు చేరుకుంది. రేవతి మరణించడాన్ని పక్కనపెట్టేస్తే ఆసుపత్రిలో ఉన్న శ్రీతేజ కోలుకుని ఆరోగ్యంగా డిస్చార్జి అవ్వాలని మొత్తం సినీఇండస్ట్రీ కోరుకుంటోంది. ఎలాగూ తల్లి చనిపోయింది కొడుకు ఆరోగ్యం ఎప్పుడెలాగ ఉంటుందో అన్న టెన్షన్ సినీ ప్రముఖుల్లో పెరిగిపోతోంది. ఈ ఘటన కారణంగానే బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్లు పెంపు ఉండదని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రకటించింది. రేవంత్ నిర్ణయంవల్ల ప్యాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్న హీరోలు, నిర్మాతలు, ఎగ్జిబిటర్లు తీవ్రంగా నష్టపోవటం ఖాయం.


శ్రేతేజ్ కు జరగరానిది ఏదైనా జరిగితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంకెంత సీరియస్ గా తీసుకుంటుందో అనేటెన్షన్ సినీప్రముఖుల్లో పెరిగిపోతోంది. రేవతి చనిపోయినందుకే అల్లుఅర్జున్ మీద కేసుపెట్టి అరెస్టుచేసి చంచల్ గూడ జైలుకు పంపారు పోలీసులు. తాము డెమీగాడ్సని మన సినీహీరోల్లో చాలామంది భ్రమల్లో ఉంటారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడినా, డ్రగ్స్ వ్యవహారాల్లో దొరికినా, పబ్బుల గొడవల్లో ఇరుకున్నా తమమీద పోలీసులు కేసులుపెట్టకూడదు, ఎలాంటి యాక్షన్ తీసుకోకూడదని అనుకుంటుంటారు. అలాంటిది అల్లుఅర్జున్ లాంటి అగ్రశ్రేణి హీరో, అందులోను పుష్ప2 సినిమా(Pushpa2 Movie) ఇండియాలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంతోషాన్ని కూడా ఎంజాయ్ చేయనీయకుండా పోలీసులు కేసుపెట్టి అరెస్టు చేసి జైలుకుపంపటం అంటే మామూలు విషయంకాదు. రేవతి మరణాన్నే ప్రభుత్వం ఇంత సీరియస్ గా తీసుకుంటే ఇక ఆసుపత్రిలో చికిత్సలో ఉన్న శ్రీతేజ్ కు ఏమైనా అయితే ఇంకేమన్నా ఉందా ? అల్లుఅర్జున్ మీద కేసు మరింతగా బిగుసుకుంటుందని సినీప్రముఖుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. 9 ఏళ్ళ పిల్లాడు తొక్కిసలాట కారణంగానే చనిపోయాడంటే జనాలందరు అల్లుఅర్జున్ మీద మండిపోవటం ఖాయమని ప్రముఖులు వణికిపోతున్నారు. జనాల్లో మొదలయ్యే వ్యతిరేకత ఒకవైపు ప్రభుత్వం తీసుకోబోయే చర్యలు ఎలాగుంటాయో అర్ధంకాక మరోవైపు సినీ ప్రముఖులను వణికించేస్తోంది.


అందుకనే ఘటనతో తమకు ఎలాంటి సంబంధంలేకపోయినా పిల్లాడు చికిత్స చేయించుకుంటున్న ఆసుపత్రికి వరసబెట్టి క్యూకడుతున్నారు. పిల్లాడు ఎలాగైనా బతికి బట్టకట్టాలని దేవుడికి దణ్ణంపెట్టుకుంటున్నారు. అల్లుఅర్జున్ ఆసుపత్రికి వెళ్ళి పిల్లాడ్ని ఇప్పటివరకు చూడకపోయినా అల్లుఅరవింద్, పుష్ప సినిమా నిర్మాతలు, పుష్పసినిమా దర్శకుడు సుకుమార్(Director Sukumar), సీనియర్ నటుడు జగపతిబాబు, దిల్ రాజు, ఫిలింఛాంబర్(Film Chamber) ప్రముఖులు ఆసుపత్రికి వెళ్ళి పిల్లాడి ఆరోగ్య పరిస్ధితిగురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యంకోసం ఎంతడబ్బయినా ఖర్చుచేస్తామని ప్రకటించారు. అవసరమైతే పిల్లాడ్ని విదేశాలకు తీసుకెళ్ళి వైద్యం చేయించాలని కూడా సినీప్రముఖులు డాక్టర్లకు చెప్పారు. పుష్ప సినీనిర్మాతలు రు. 50 లక్షలు, అల్లుఅర్జున్ 10 లక్షల రూపాయలు ఇప్పటికే పిల్లాడి తండ్రికిచ్చారు. మెగాఫ్యామిలీ నుండి ఇప్పటికైతే హీరోలెవరూ ఆసుపత్రికి నేరుగా వెళ్ళకపోయినా పిల్లాడి తండ్రి భాస్కర్ తో రెగ్యులర్ టచ్ లో ఉన్నారు. డబ్బులగురించి ఆలోచించవద్దని ఎంత ఖర్చయినా తాము భరిస్తామని ధైర్యం చెబుతున్నారు.


కొందరు ఆసుపత్రికి వెళ్ళి, మరికొందరు పిల్లాడి తండ్రితో మాట్లాడుతు, ఇంకొందరు నేరుగా డాక్టర్లతోనే పిల్లాడి గురించి మాట్లాడుతున్నారంటేనే ఇండస్ట్రీ మొత్తం ఎంతలా టెన్షన్ పడుతోందో అర్ధమైపోతోంది. పిల్లాడు క్షేమంగా బయటపడాలని దణ్ణంపెట్టుకుంటున్నట్లు జగపతిబాబు మీడియాతో చెప్పారు. ఇంతమంది ప్రముఖులు ఇంతగా పిల్లాడి ఆరోగ్యంగురించి ఎందుకు టెన్షన్ పడుతున్నారంటే కేసుల భయంతోనే అన్నది వాస్తవం. తొక్కిసలాట ఘటనకు కారకుడని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అల్లుఅర్జున్ మీదే కేసుపెట్టి అరెస్టుచేసి జైలుకు పంపిందంటే ఇక తమ సంగతి ఏమిటనే చర్చ సినీప్రముఖుల్లో పెరిగిపోతోందని సమాచారం. సినీమా షూటింగులన్నాక ఏవో చిన్నాచితక సంఘటనలు జరుగుతునే ఉంటాయి. అలాంటి ఘటనలను గనుక ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటే ఇకఎవరూ షూటింగులు చేయలేరనే చర్చ ప్రముఖుల్లో పెరిగిపోతోంది. తాము ఏమిచేసినా చెల్లిపోతుందనే భ్రమల్లో ఉన్న సినీ సెలబ్రిటీలు అల్లుఅర్జున్ అరెస్టు దెబ్బకు వాస్తవస్ధితిలోకి వస్తున్నారని తెలుస్తోంది.


హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ రద్దుకోసం పోలీసులు సుప్రింకోర్టులో పిటీషన్ వేస్తారనే ప్రచారం అందరికీ తెలిసిందే. మధ్యంతర బెయిల్ రాగానే అల్లుఅర్జున్ మీడియా సమావేశంపెట్టి ప్రభుత్వం, పోలీసుల మీద ఆరోపణలు చేయటంతో విషయం చాలా సీరియస్ అయ్యింది. చిక్కడపల్లి పోలీసుల(Chikkadapalli Police) విచారణలో తొక్కిసలాట దృశ్యాలు, అంతకుముందు రోడ్డుషో చేసిన దృశ్యాలను, థియేటర్లోకి అల్లుఅర్జున్ రాకముందు, వచ్చినపుడు, థియేటర్లోని అప్పర్ బాల్కనీలోకి వెళ్ళేటపుడు జరిగిన తొక్కిసలాట వీడియోలను పోలీసులు అల్లుఅర్జున్ కే చూపించారు. పదినిముషాల వీడియోను చూపిస్తునే విచారణ చేశారు. దాంతో తొక్కిసలాటతో తనకు సంబంధంలేదని, మహిళ మృతికి తాను కారణంకాదని, తాను రోడ్డుషో చేయలేదని చెప్పినవన్నీ బుకాయింపులే అని అల్లుఅర్జున్ విచారణలో అంగీకరించాడనే ప్రచారం పెరిగిపోతోంది. ఇవన్నీ చూసిన తర్వాత ఆసుపత్రిలోని పిల్లాడికి ఏమైనా జరిగితే ఇంకేమైనా ఉందా అనే టెన్షన్ సినీప్రముఖుల్లో పెరిగిపోతోంది. అందుకనే ఇపుడు శ్రీతేజ్ ప్రస్తుత పరిస్ధితి యావత్ ఇండస్ట్రీని వణికించేస్తోంది.

Read More
Next Story