ప్రసాదాల తయారీలో తెలంగాణ దేవాలయాలు సేఫ్
దేవాలయాల్లో ప్రసాదాల రూపంలో లడ్డూలు, అన్న ప్రసాదాల్లో వాడే నెయ్యి, ముడి దినుసులపైన కూడా పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.
తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూతో పాటు అన్న ప్రసాదాల్లో కల్తీ నెయ్యితో పాటు నాసిరకం దినుసులు, ఆవుకొవ్వు ఉపయోగించారనే వివాదం నేపధ్యంలో చాలామంది దృష్టి తెలంగాణాలోని దేవాలయాల మీద పడింది. తెలంగాణాలో చాలా దేవాలయాలున్నా భద్రాచలంలో రాములవారి ఆలయం, యాదాద్రి, బాసర వంటి కొన్ని ప్రముఖమైనవి. ఈ దేవాలయాల్లో కూడా ప్రతిరోజు దేవదేవుళ్ళకు నైవేద్యాలు పెడతారు, భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేస్తుంటారు. పై దేవాలయాలకు ప్రతిరోజు వేలాదిమంది భక్తులు ఎక్కడెక్కడి నుండో వచ్చి భక్తితో పూజలు చేస్తుంటారు. కాబట్టి పై దేవాలయాల్లో ప్రసాదాల రూపంలో లడ్డూలు, అన్న ప్రసాదాల్లో వాడే నెయ్యి, ముడి దినుసులపైన కూడా పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.
ఈ నేపధ్యంలోనే బాసర దేవాలయం ఈవో వావిలకొలను విజయరామారావుతో ‘తెలంగాణా ఫెడరల్’ మాట్లాడినపుడు బాసరలో అలాంటి సమస్యలు లేవన్నారు. బాసరకు ప్రతిరోజు సుమారు 10 వేలమంది భక్తులు వస్తుంటారని చెప్పారు. బాసరలో చేసే ప్రసాదాలన్నింటినీ విజయా డైరీ సరఫరా చేసే నెయ్యినే వాడుతున్నట్లు చెప్పారు. ప్రైవేటు కంపెనీలను అసలు ఏ రూపంలో కూడా దగ్గర చేర్చేది లేదన్నారు. విజయా డైరీ ప్రభుత్వానిదే కాబట్టి అందులో నెయ్యిలో కల్తీ అనే అవకాశమే లేదన్నారు.
భద్రాచలం రాములవారి ఆలయం అసిస్టెంట్ ఈవో భవానీ ఆర్ కే రావు మాట్లాడుతు భద్రాచలం ఆలయంకు రోజు వేలాదిమంది భక్తులు వస్తుంటారని చెప్పారు. దేవాలయంలో తయారయ్యే ప్రసాదాలన్నింటినీ చాలా సంవత్సరాలు కరీంనగర్ డైరీ నుండే కొనుగోలు చేసినట్లు చెప్పారు. కరీంనగర్ డైరీ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వ డైరీ అని చెప్పారు. ఈమధ్యనే నెయ్యి కొనుగోలును జంగారెడ్డి గూడెంలోని రైతు డైరీకి మార్చినట్లు చెప్పారు. ఈ డైరీ కూడా సొసైటీ ఆధ్వర్యంలోనే నడుస్తోందన్నారు. ప్రతి రెండునెలలకు ఒకసారి క్రమం తప్పకుండా క్వాలిటి చెక్ చేస్తుంటామన్నారు. కాబట్టి తమ దేవాలయం ప్రసాదాల్లో కల్తీ నెయ్యి అన్న ప్రస్తావనే రాదని భవానీ ఆర్ కే రావు చెప్పారు.
యాదాద్రి దేవాలయంలో తయారయ్యే ప్రసాదాల గురించి దేవాదాయ శాఖ అధికారి సుమంత్ మాట్లాడుతు మదర్ డైరీ నుండి నెయ్యిని కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. సంవత్సరాల తరబడి దేవాలయంలో తయారయ్యే ప్రసాదాలన్నీ మదర్ డైరీ సరఫరా చేసే నెయ్యితోనే తయారవుతున్నాయన్నారు. నార్ముల్ సొసైటీ ఆధ్వర్యంలోనే మదర్ డైరీ నడుస్తోందన్నారు. అంతేకాకుండా దేవాదాయ శాఖ ఈమధ్యనే ఒక జీవో జారీచేసినట్లు చెప్పారు. దేవాలయాలు కొనుగోలు చేసే నెయ్యిని విజయాడైరీ లేదా సొసైటీల నుండి మాత్రమే కొనాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినట్లు చెప్పారు. ఎట్టి పరిస్ధితుల్లోను ప్రైవేటు సంస్ధల నుండి కొనుగోలు చేయకూడదని ప్రభుత్వం స్పష్టంగా చెప్పిందన్నారు. అలాగే ప్రతి రెండు, మూడునెలలకు దేవాలయాల్లో నెయ్యి, ముడి దినుసుల క్వాలిటీ చెక్ కూడా చేయాలని ఆదేశించినట్లు సుమంత్ చెప్పారు. కాబట్టి తిరుమల శ్రీవారి దేవాలయం ప్రసాదాల తయారీ వివాదం తెలంగాణా దేవాలయల్లో ఉండదన్నారు. కాబట్టి దేవాలయాల ఈవోలు, దేవాదాయశాఖ ఉన్నతాధికారులు చెప్పిన ప్రకారం తెలంగాణా దేవాలయాలు సేఫ్ అనే అనుకోవాలి.