ఏపీ ఎన్నికలపై చేతులెత్తేసిన తెలంగాణ ఎమ్మెల్యే
x

ఏపీ ఎన్నికలపై చేతులెత్తేసిన తెలంగాణ ఎమ్మెల్యే

ఆంధ్ర ఎన్నికలు ఎన్నడూ లేనంత ఉత్కంఠగా సాగుతున్నాయి. ఎవరు గెలుస్తారు, ప్రజల నాడి ఎలా ఉన్నది ఏ సంస్థ, ఏ నేత అంచనా కూడా వేయలేకున్నారు..


ఆంధ్ర ఎన్నికలు ఎన్నడూ లేనంత ఉత్కంఠగా సాగుతున్నాయి. ఎవరు గెలుస్తారు, ప్రజల నాడి ఎలా ఉన్నది ఏ సంస్థ, ఏ నేత అంచనా కూడా వేయలేకున్నారు. ప్రజలు ఏ పార్టీవైపు మొగ్గు చూపుతున్నారు అన్న అంశం ఇప్పటికి కూడా అంతుపట్టడంలేదు. ఈ క్రమంలోనే తెలంగాణ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఆంధ్ర ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన పుట్టినరోజు సందర్భంగా ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఆంధ్ర ఎన్నికలపై ఆయన స్పందించారు. ఆంధ్ర ఎవరు గెలుస్తారు? ఎన్ని సీట్లు వస్తాయి? వచ్చే ప్రభుత్వంతో తమ ప్రభుత్వ సంబంధాలు ఎలా ఉంటాయి? ఇలా మరిన్ని ప్రశ్నలకు కూడా ఆయన ఒకటే సమాధానం ఇచ్చారు.

అర్థం కావట్లేదు

శ్రీవారి దర్శనం అనంతరం ఏపీ ఎన్నికలపై స్పందించిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. ఆంధ్ర పరిస్థితి తనకు ఏమీ అర్థం కావట్లేదున్నారు. ఈసారి ఆంధ్ర ప్రజల నాడీని అంచనా వేయడం ఎవరికీ సాధ్యం కావట్లేదని చెప్పారు. ‘‘ఆంధ్ర ఎన్నికల విజేతపై భారీ ఉత్కంఠ కొనసాగుతోంది. ఏ సర్వేలో కూడా ప్రజలు ఎటువైపు ఉన్నారు అన్నది స్పష్టం కాలేదు. ఎన్నికల విషయంలో ప్రజలు ఇంత స్తబ్దుగా ఉండటం ఇదే తొలిసారి చూస్తున్నా. ఈ పరిస్థితుల వల్లే ఆంధ్ర ఎన్నికల్లో విజేత ఎవరు అన్నది నేను కూడా అంచనా వేయలేకపోతున్నా’’ అని మనసులో అనుకున్నది బయటపెట్టారు.

మా మధ్యే పోటీ

తెలంగాణలో కూడా ఎన్నికల వేడి బాగానే ఉందని ఆయన చెప్పారు. ‘‘తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే అసలు పోటీ జరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీ అధఃపాతాళానికి పడిపోయింది. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు సమాన సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి కిరణ్ ఘన విజయం సాధించారు. రాష్ట్ర భవిష్యత్‌ని నిర్ణయించే ఎన్నికలు కాబట్టి ప్రజలు సరైన నిర్ణయమే తీసుకుంటారని భావిస్తున్నా. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే దిశగా చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలో అత్యధిక ఎంపీ సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంటుంది. దేశవ్యాప్తంగా ఇండియా కూటమి పుంజుకుంటుంది. ఈసారి గెలవడం బీజేపీకి అంత ఈజీగా లేదు’’ అని జోస్యం చెప్పారు రాజగోపాల్‌రెడ్డి.

రేవంత్ రెడ్డి ఇలా..

అయితే ఇటీవల మనవడి పుట్టెంటుకలు తీయించడానికి తిరుపతి వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆంధ్ర రాజకీయాలపై స్పందించారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వస్తుందని ఆయన అంచనా వేశారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వచ్చే కొత్త ప్రభుత్వంతో సత్సంబంధాలు కలిగి ఉంటామని, ఆ దిశగా ఇక్కడి ప్రభుత్వం కూడా కృషి చేస్తుందని భావిస్తున్నాం’’ అని చెప్పారు. దాంతో ఏపీలో ప్రభుత్వం మారుతుందని రేవంత్ జోస్యం చెప్పారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

అర్థంకాని ఆంధ్ర పరిస్థితి

ఆంధ్ర ఎన్నికలపై పక్క రాష్ట్రాల్లో కూడా వాడివేడి చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో కూడా భారీగా బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. కౌంటింగ్ దగ్గర పడుతుండటంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అన్ని పార్టీల నేతలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ.. కౌంటింగ్ సమయంలో అల్లర్లు చేయొద్దని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవంటూ ఎన్నికల సంఘం కూడా వార్నింగ్‌లు ఇస్తోంది. అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు ఇంకా రెండు రోజులే సమయం ఉంది. అంతేకాకుండా ఆంధ్ర ఎన్నికలు అత్యంత రసవత్తరంగా ఉన్నాయని ఈసీ కూడా అంటోంది. ఈ క్రమంలో అత్యధికంగా పోలింగ్ నమోదు కావడం అధికార పార్టీకి కలవరపెడుతోంది.

Read More
Next Story