గిరిజనుల పల్లె బతుకును స్పృశిస్తూ భిన్నత్వంలో ఏకత్వాన్ని ఉద్భవ్ వేడుకలు. ప్రపంచానికి చాటింది. గిరిపుత్రుల జీవన వైవిధ్యం ప్రతీ గుండెను తాకింది. తొలిసారి ఆంధ్రప్రదేశ్ ఆతిథ్యమిస్తోన్న ఉద్భవ్-2025 వేడుకల సంబరాలతో మూడు రోజుల పండుగ విజయవంతంగా ముగిసింది. గిరిజన చిన్నారులకు జాతీయ స్థాయిలో నిర్వహించిన ఉద్భవ్-2025 సాంస్కృతిక పోటీలలో బాలబాలికలు మెరిశారు. మొత్తం 1558 మంది ఈ పోటీలలో పాల్గొనగా..వారిలో 300 మంది చిన్నారులు మెరుగ్గా రాణించి పసిడి, వెండి, కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు. తెలంగాణ 11 బంగారు పతకాలు సహా 10 రజతాలు, 7 కాంస్యాలను సాధించి అగ్రస్థానంలో నిలిచింది. ఆతిథ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మూడు పసిడి, ఐదు వెండి, నాలుగు కాంస్యాలతో ఏడో స్థానంలో నిలిచింది.
రెండు, మూడు స్థానాల్లో నిలిచిన ఝార్ఖండ్, ఒడిశా
ఉద్భవ్-2025లో నిర్వహించిన సాంస్కృతిక పోటీలలో ఐదు పసిడి పతకాలతో ఝార్ఖండ్ రెండో స్థానం కైవసం చేసుకుంది. నాలుగు బంగారు పతకాలను సాధించి ఒడిశా రాష్ట్రం మూడో స్థానం దక్కించుకుంది. అయితే మొత్తం పతకాలు లెక్కేస్తే ఝార్ఖండ్ కన్నా ఒడిశా ఎక్కువ మెడల్స్ సాధించింది. ఝార్ఖండ్ కు మొత్తం 14 మెడల్స్ రాగా.. ఒడిశాను 19 మెడల్స్ వరించాయి. ఇక హిమాచల్ ప్రదేశ్ (14), సిక్కిం (10), గుజరాత్ (15) పతకాలను సాధించి తర్వాత స్థానాల్లో నిలిచాయి.
పాల్గొన్న ప్రతి గిరిజన బిడ్డ విజేతే
గుజరాత్ లో ప్రజాదరణ పొందిన గర్భా డాన్స్, హిమాచల్ ప్రదేశ్ సాంస్కృతిక వారసత్వంలో ముఖ్యమైన కినారి నృత్యం, అరుణాచల్ ప్రదేశ్ లో ఆది తెగలు ప్రదర్శించే పోనుంగ్ డాన్స్ , ఆంగ్లంలో, హిందీలో వక్తృత్వ పోటీలు, బహిరంగ చర్చ, స్పెల్ బీ పోటీలు , జానపద గేయాల గాత్ర పోటీలు, సంగీత వాయిద్యాల కచేరి పోటీలు, నృత్యం, సంగీత, దృశ్య కళల ద్వారా సాంప్రదాయ కథనాల వక్త పోటీలు, థియేటర్ మిమిక్రీ, క్లాసికల్-సెమి క్లాసికల్ సంగీత గాత్ర కచేరి , ఆశు కవిత్వం, హార్మోనియం, డోలక్, తబలా వాయిద్యాలు, స్తోత్రాలు, భజనలు, స్తుతుల వంటి పోటీలలో ఇలా అనేక విభాగాల్లో వస్త్రధారణ సహా ప్రతిభ చూపించి ఈఎంఆర్ఎస్ విద్యార్థులు అందరి మనసులు గెలిచారు. మనసులు కదిలించే నాటికలు..మమతానుబంధాలను పంచే ప్రదర్శనలు..భాషలు వేరైనా భావం ఒక్కటే అని చాటే విధంగా పోటీలలో పాల్గొన్న ప్రతి చిన్నారి విజేతే వక్తలు పేర్కొన్నారు.