టీచర్ల చేతుల్లోనే తెలంగాణా భవిష్యత్
x

టీచర్ల చేతుల్లోనే తెలంగాణా భవిష్యత్

రేవంత్ మాట్లాడుతు తెలంగాణా భవిష్యత్తు తమ చేతుల్లో లేదని టీచర్ల చేతుల్లోనే ఉందని చెప్పటానికే ఆత్మీయ సమావేశం నిర్వహించినట్లు చెప్పారు.


తెలంగాణా భవిష్యత్తు రాజకీయనేతల చేతుల్లో కాదని టీచర్ల చేతుల్లోనే ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ టీచర్లతో శుక్రవారం ఎల్బీ స్టేడియంలో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న రేవంత్ మాట్లాడుతు తెలంగాణా భవిష్యత్తు తమ చేతుల్లో లేదని టీచర్ల చేతుల్లోనే ఉందని చెప్పటానికే ఆత్మీయ సమావేశం నిర్వహించినట్లు చెప్పారు. ఈ సమావేశానికి సుమారు 30 వేల మంది టీచర్లు హాజరయ్యారు. తెలంగాణాను బలోపేతం చేయటంలో టీచర్లు కీలక పాత్ర పోషించాలన్నారు. తెలంగాణా భవిష్యత్తు టీచర్ల రూపంలో ఎల్బీ స్టేడియంలోనే ఉందని తనకు అనిపిస్తోందని చమత్కరించారు.

30 వేల ప్రభుత్వ స్కూళ్ళల్లో 26 లక్షల మంది విద్యార్ధుల భవిష్యత్తును వాళ్ళ తల్లి, దండ్రులు టీచర్ల చేతిలో పెట్టిన విషయాన్ని మరచిపోవద్దని హెచ్చరించారు. తెలంగాణా సాధనలో టీచర్ల పాత్ర ఎంత కీలకమో తనకు తెలుసన్నారు. 30 వేల ప్రభుత్వ స్కూళ్ళల్లో 26 లక్షలమంది విద్యార్ధులు చదువుతుంటే 10 వేల ప్రైవేటు స్కూళ్ళల్లో 33 లక్షల మంది విద్యార్ధులు చదువుతున్నట్లు రేవంత్ చెప్పారు. ప్రైవేటు స్కూళ్ళల్లో చదువుచెప్పే టీచర్లు ప్రభుత్వ టీచర్ల కన్నా గొప్పగా చదువులు చెప్పగలరా ? అని రేవంత్ ప్రశ్నించారు. ప్రభుత్వ స్కూళ్ళల్లో మౌళికసదుపాయాలు సరిగా లేకపోవటమే విద్యార్ధులు తగ్గిపోవటానికి కారణం అయ్యుండచ్చని రేవంత్ అభిప్రాయపడ్డారు.

తెలంగాణాలో ఉద్యోగుల పరిస్ధితి ఉమ్మడి రాష్ట్రంలో కన్నా ఇపుడు మరింత అన్యాయంగా ఉందన్నది వాస్తవమని రేవంత్ అన్నారు. తెలంగాణా సాధించుకుంటే ఉపాధ్యాయ, ఉద్యోగుల పరిస్ధితి బాగుపడుతుందని అనుకుంటే అలా జరగలేదన్నారు. అందుకు కారణాలు ఏమిటో కూడా అందరికీ తెలుసన్నారు. ప్రభుత్వంపై ఉద్యోగులకు నమ్మకం కలిగించేందుకే ప్రతినెలా 1వ తేదీనే జీతాలు చెల్లిస్తున్నట్లు సీఎం చెప్పారు. 15 ఏళ్ళుగా పెండింగులో ఉన్న టీచర్ల ప్రమోషన్ల సమస్యను పరిష్కరించిన విషయాన్ని గుర్తుచేశారు. టీచర్లంతా నిబద్ధతతో పనిచేయాలని రేవంత్ కోరారు. ఉపాధ్యాయులకు ఏ సమస్యొచ్చినా పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

పోయిన విద్యా సంవత్సరంతో పోల్చితే ఇపుడు 2 లక్షల అడ్మిషన్లు తగ్గిన విషయాన్ని ప్రస్తావిస్తూనే విద్యారంగాన్ని బలోపేతం చేయటంకోసం ప్రభుత్వం రు. 21 వేల కోట్లు కేటాయించిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రభుత్వ స్కూళ్ళకు ఉచిత విద్యుత్ అందించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో మహిళలకు బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. తెలంగాణా బలపడాలంటే టీచర్లు, ప్రభుత్వం కార్యదీక్షతో పనిచేయాల్సిన అవసరం ఉందని రేవంత్ గట్టిగా చెప్పారు.

Read More
Next Story