
ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ గవర్నర్ ఆమోదం
30 సంవత్సరా మాదిగ దండోరా చారిత్రక పోరాటం విజయం
తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల (ఎస్ సి) వర్గీ కరణ పూర్తయింది. ఎస్ సికులాలకు వర్గీకరించి, అందులో వెనకబడిన కులాల రిజర్వేషన్ ఫలాలు దక్కేలా చూడాలని మాదిగ కులం వారు జరిపిన చారిత్రక పోరాటానికి ఫలితం దక్కింది. ఈ పోరాటం తెలుగు రాష్ట్రాల రాజకీయాలను ఒక మలుపు తప్పింది. ఈ పోరాటానికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS)నాయకత్వం వహించింది. మాదిగల ఆత్మగౌరవ పోరాటంగా ఇది చరిత్రకెక్కింది.
ఇక నుంచి ఈ వర్గీకరణ ప్రకారం ఎస్ సి కులాలకు రిజర్వేషన్లు అమలుఅవుతాయి. అసెంబ్లీ ఆమోదించిన ఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆమోద ముద్ర వేశారు. ఎస్సీల్లో ఉపకులాలను మూడు గ్రూపులుగా విభజించి వాటికి 15 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దశించి బిల్లు రూపొందించారు.దీనితో గత ఏడాది వచ్చిన సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణకు కీర్తి దక్కింది.
ఈ బిల్లును మార్చి 18న అసెంబ్లీ ఆమోదించింది. ఈ బిల్లుకు చట్టబద్ధత కల్పించేందుకు జిష్ణుదేవ వర్మ మంగళవారం బిల్లుకు ఆమోదం తెలిపడంతో వర్గీకరణ అమలయ్యేలా ప్రభుత్వం త్వరలో ఉత్త ర్వులు జారీ చేయనుంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన ఎనిమిది నెలల్లోనే ప్రభుత్వం ఒక్కో అడుగు ముందుకు వేస్తూ.30 ఏళ్లుగా నానుతూ వస్తున్న ఈ సమస్య ఇపుడు పరిష్కారం అయింది.
బిల్లుకు గవర్నర్ ఆమోదం లభించడంతో ముందుముందు వెలువడే ప్రభుత్వ ఉద్యోగ నియామక ప్రకటనలు, విద్యా సంస్థల ప్రవేశాల్లో ఎస్సీ వర్గీకరణ ప్రకారం రిజర్వేషన్లు అమలు చేస్తారు.
ఉపసంఘం.. ఏకసభ్య కమిషన్
2024 ఆగస్టు 1న వర్గీకరణకు అనుకూ లంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. తీర్పు వచ్చిన గంటలోపే వర్గీ కరణ అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శాసనసభలో ప్రక టించారు. 2024 సెప్టెంబరు 12న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేశారు. అనంత రం కమిటీ సూచనల మేరకు వర్గీకరణపై అధ్యయనానికి ఏకసభ్య కమిషన్ ను నియమించారు. 2024 అక్టోబరు 11న ప్రభుత్వం జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ను నియమిం చింది. ఆ కమిషన్ ఈ ఏడాది ఫిబ్రవరి 3న ఉపసంఘానికి నివేదిక ఇచ్చింది. దానికి రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలపింది. అనంతరం మార్చి 18న ప్రభుత్వం సంబంధిత బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టింది. దానికి అన్ని రాజ కీయపార్టీలు మద్దతు తెలిపాయి.
గ్రూపుల వారీగా ఎస్సీలు
గ్రూప్-1 (15కులాలు)
1. బావురి 2. బేడా (బుడగ జంగం 3. చాచటి, 4. డక్కల్-డొక్కల్వార్ 5. జగ్గలి 6. కొలుపుల్వాండ్లు- పంబడ పంబండ పంబాలా 7. మాంగ్ 8. మాంగ్ గరోడి 9. మన్నే 10. మస్తీ 11. మాతంగి 12. మెహతర్ 13. ముండాల 14.సంబన్ 15.సప్ర
గ్రూప్ 2 (18కులాలు)
1. అరుంధతీయ 2. బైండ్ల 3. చమర్, మోచి, ముచి, చమర్-రవిదాస్, చమర్-రోహిదాస్ 4. చంబర్ 5. చండాల 6. దందాసి 7. డోమ్, డోంబరా, పైడి, పానో 8. ఎల్లమ్మల్వార్, ఎల్లమ్మ లవాండ్లు 9. గోడారి 10. జాంబువులు 11. మాదిగ 12. మాదిగదాసు, మస్తీన్ 13. పామిడి 14. పంచమ, పరియ 15. సమగర 16. సింధొల్లు (చిందోల్లు) 17. యాటలు 18. వల్లువన్.
గ్రూప్-3 (26 కులాలు)
1. ఆది ఆంధ్ర 2. ఆది ద్రావిడ 3. అనాముక్ 4. అరేమాల 5. అర్వమాల 6. బారికి 7. బ్యాగర, బ్యాగరి 8. చలవాడి 9.డోర్ 10. ఘాసి, హడ్డి, 11. గోసంగి, 12. హోలేయా 13. హోలేయ దాసరి 14. మాదాసి కురువ, మాదారి కురువ 15. మహర్ 16. మాల, మాలఅయ్యవార్ 17. మాలదాసరి 18. మాలదాసు 19. మాలహ న్నాయ్ 20. మాలజంగం 21. మాలమస్తీ 22. మాలసాలే, నేతకాని 23. మాలసన్యాసి 24. మిత అయ్యల్వార్ 25. పాకీ, మోటీ, తోటి 26. రెల్లి.