
జనసేన పార్టీకి అనుబంధంగా టీచర్స్ యూనియన్
ఏపీలో జనసేన పార్టీకి అనుబంధంగా ఉపాధ్యాయ సంఘాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ఈ మేరకు పలువురు ఉపాధ్యాయులు పార్టీ నేతలను కలిసారు.
ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీకి అనుబంధంగా ఉపాధ్యాయ సంఘం ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మేరకు పలువురు ఉపాధ్యాయ నాయకులు పార్టీలోని ముఖ్య నాయకులను కలిసి సంఘం ఏర్పాటు గురించి చర్చించారు. ఇప్పటికే అన్ని పార్టీలకు అనుబంధంగా ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి. సీపీఐ, సీపీఎం, తెలుగుదేశం, వైఎస్సార్సీపీ వంటి పార్టీలకు నేరుగా ఆయా పార్టీలతో సంబంధాలు ఉన్న నాయకులే సంఘం నాయకులుగా ఉంటున్నారు. కూటమి ప్రభుత్వంలో కీలకంగా మారిన జనసేన పార్టీకి అనుబంధంగా ఉపాధ్యాయ సంఘాన్ని స్థాపించేందుకు కొందరు ఉపాధ్యాయులు ముందుకు వచ్చారు.
జిల్లాకు ఇద్దరు నాయకుల చొప్పున ఇటీవల జనసేన పార్టీ పెద్దలను కలిసారు. ఎమ్మెల్సీ పి హరిప్రసాద్ ను కలిసి పార్టీకి అనుబంధంగా సంఘం పెట్టాలని నిర్ణయించినట్లు ఉపాధ్యాయులు పలువురు వారికి తెలిపారు. మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు బాలశౌరిని కూడా సంఘం నాయకులు కలిసారు. జనసేన రాష్ట్ర కార్యాలయంలో మూడు రోజుల క్రితం పార్టీ ముఖ్య నాయకులను కలిసి సంఘం పెట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
త్వరలోనే పవన్ కల్యాన్ ను కలిసేలా చేస్తా: కెకె
జనసేన పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్ కల్యాణం శ్రీనివాస్ (కెకె)ను కలిసారు. పవన్ కల్యాన్ తో మాట్లాడి త్వరలోనే ఆయనతో కలిసే ఏర్పాటు చేస్తామని ఉపాధ్యాయులకు హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ హరిప్రసాద్ కూడా ఇదే విషయం వారికి తెలిపారు. పార్టీకి అనుబంధ ఉపాధ్యాయ సంఘం ఏర్పడితే ఉపాధ్యాయ వర్గంలో ఒక వింగ్ పార్టీకి తోడవుతుంది. సంఘానికి రూపకల్పన చేస్తున్న అప్పినేడి వెంకట రామాంజనేయులు (రాము) ప్రత్యేకించి పార్టీ ప్రధాన కార్యదర్శి, మంత్రి నాదెండ్ల మనోహర్ ను కలిసి పార్టీకి అనుబంధంగా ఉపాధ్యాయ సంఘం పెట్టేందుకు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఆయన నుంచి కూడా సానుకూల స్పందన వచ్చింది. దీంతో జనసేన బలం ఉపాధ్యాయ వర్గంలో కూడా పెరిగే అవకాశం ఉంది.
సంఘానికి ఏమి పేరు పెట్టాలనుకుంటున్నారు...
జనసేన పార్టీకి అనుబంధంగా ఏర్పాటు చేయాలనుకుంటున్న ఉపాధ్యాయ సంఘానికి ‘జనసేన టీచర్స్ యూనియన్’ పేరు పెట్టాలని నిర్ణయించినట్లు ఉపాధ్యాయ నాయకుడు అప్పినేడి వెంకట రామాంజనేయులు (రాము) ‘ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ కు తెలిపారు.
రాష్ట్ర కమిటీలో ముఖ్య నాయకులుగా అప్పినేడి వెంకట రామాంజనేయులు (రాము) నాగమణి, అరుణ శ్రీనివాసరావు, విజయలక్ష్మి, దాసు, నాగరాజు, ఈబాధతుల్లా, శ్రీమన్నారాయణ, యోహాన్ ఉంటారు. వీరితో పాటు ఆయా జిల్లాల నుంచి పలువురు నాయకత్వం వహించేందుకు రెడీగా ఉన్నారు. వారిలో కాకినాడ జిల్లా నుంచి రాజకుమార్, చిరంజీవి. గుంటూరు జిల్లా నుంచి వాసు, అరుణ. పల్నాడు నుంచి నాగమణి, ఏలూరు నుంచి రాజగోపాల్, లక్ష్మణకుమార్, కర్నూలు నుంచి రాంబాబు, శంకర్, రాముడు, స్వాములు. ఉమ్మడి చిత్తూరు నుంచి పాపయ్య, గురవయ్య, నరసింహులు, మునిస్వామి, కృష్ణా జిల్లా నుంచి శ్రీనివాస్, మహాలక్ష్మి , నాగరాజు నాంచారమ్మ, విజయ శ్రీ, కాత్యాయని, ఎన్టీఆర్ నుంచి శ్రీనివాస్, ప్రభాకర్, శివ, విజయలక్ష్మి. శ్రీకాకుళం నుంచి రాజారావు, అరుణ, ప్రకాశం నుంచి రాజు, ఆంజనేయులు, సాయిరాం, వెంకటరమణయ్య. విశాఖ నుంచి సూర్యనారాయణ, ఇందిర, చక్రవర్తి. నెల్లూరు నుంచి ఏడుకొండలు. ఒంగోలు నుంచి ప్రతాప్, బ్రహ్మారెడ్డి. ఈస్ట్ గోదావరి నుంచి సత్యనారాయణ, కృష్ణ. అంబేద్కర్ కోనసీమ నుంచి రఘురాం, వీరన్న. వైఎస్ఆర్ కడప నుంచి భార్గవి. పశ్చిమగోదావరి నుంచి సతీష్, కొండలరావు. బాపట్ల నుంచి శ్రీనివాసరావు. అనంతపురం నుంచి శివానంద. విజయనగరం నుంచి నాయుడు, కృష్ణంరాజు. నంద్యాల నుంచి నాగేంద్ర. సత్య సాయి జిల్లా నుంచి ఓబులేసు ప్రస్తుతానికి నాయకత్వం వహిస్తారు.