
సెక్యులర్ భావాలకు టీడీపీ దూరం... అధికారం పోతుందనే భయం...
తెలుగుదేశం పార్టీ సెక్యులరిజాన్ని వదిలి పెట్టిందా? హిందూత్వ సిద్దాంతాలకు లోలోపల మద్దతు తెలుపుతోందా? ప్రజలు ఈ విషయంలో ఏమనుకుంటున్నారు?
తెలుగుదేశం పార్టీ సెక్యులరిజం అజెండాతో ఏర్పడిన పార్టీ. దేశంలో కులాలు, మతాలు సమాన మని భావించిన పార్టీ. ఎన్టీ రామారావు పార్టీని ఏర్పాటు చేసినప్పుడు అన్ని కులాలు, మతాలు మాకు కళ్లు, చెవులని చెప్పింది పార్టీ. గతంలో గుంటూరు, హైదరాబాద్ నగరాల్లో ముస్లిమ్ లు టీడీపీలో పలు పదవులు నిర్వహించారు. అదే స్థాయిలో క్రిష్టియన్ లకు కూడా బాగా అవకాశాలు టీడీపీ ఇచ్చింది. గుంటూరులో లాల్జాన్ బాషా మంత్రిగా, ముస్లిమ్ లకు ప్రతినిధిగా చాలా కాలం పనిచేశారు. ఏ అజెండాతో అయితే తెలుగుదేశం పార్టీ ఏర్పడిందో ఆ అజెండాను అమలు చేయడంలో కాస్త వెనుకంజ వేయాల్సిన పరిస్థితులు ప్రస్తుతం ఏర్పడ్డాయి.
బీజేపీ అజెండాను టీడీపీ బలపరుస్తోందా?
తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో, కేంద్రంలో హిందూత్వ అజెండాకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందనే విమర్శలు వస్తున్నాయి. ఏ సెక్యులర్ భావాలతో అయితే తెలుగుదేశం పార్టీ ఏర్పడిందో ఆ సెక్యులర్ భావాలు తెలుగుదేశం ఒక్కటొక్కటిగా వదిలేస్తోందనే చర్చ మొదలైంది. రాష్ట్రంలో జనసేన పార్టీని నెత్తిపై కూర్చోబెట్టుకోవడం ద్వారా పవన్ కల్యాణ్ చెప్పిన కొన్ని విషయాలు అమలు చేయక తప్పటం లేదు. ఆయన ఇటీవల పిఠాపురంలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభలో చేసిన ప్రసంగం ఎంతో బాగుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు, నారా లోకేష్ లు ట్విటర్ వేదికలుగా అభినందించారు. పవన్ ప్రసంగాన్ని అభినందించారంటే హిందూత్వ జెండాను ఆమోదించినట్లేననే చర్చ రాష్ట్రంలో మొదలైంది. పవన్ కల్యాణ్ తమిళనాడు ప్రభుత్వంపై విమర్శలు చేశారు. హిందీ భాష అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా తమిళనాడు ఉన్న విషయం తెలుసు. అది తమిళుల ఆత్మ గౌరవానికి, వారి మాతృ భాషకు సంబంధించిన అంశంగా వందరూ పరిగణిస్తున్నారు. అయితే హిందీ వ్యతిరేక రాష్ట్రంగా తమిళనాడు మిగిలిపోతే ప్రజలు క్షమించరనే ధోరణిలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేశారు. ఈ కారణంగానే ప్రాంతీయ, భాష బేధాలు వస్తాయని చెప్పటం విశేషం.
కేంద్ర ప్రభుత్వ విధానాల సమర్థన
తెలుగుదేశం పార్టీ కూటమిలో భాగస్వామి కావడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో బీజేపీ ప్రాధాన్యత పెరిగింది. ఏపీలో ఎప్పుడూ లేనంతగా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు బీజేపీకి ఉన్నారు. పార్లమెంట్ సభ్యులు, కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ బీజేపీకి మంత్రులు ఉన్నారు. అంటే బీజేపీకి కనీసం నాలుగు శాతం కూడా ఓట్లు లేని రాష్టంలో ఎంత బలం తెలుగుదేశం పార్టీ తెచ్చి పెట్టిందో అర్థమవుతోందని మేధావి వర్గం భావిస్తోంది. కేంద్రం ప్రవేశ పెట్టిన వక్ఫ్ సవరణ బిల్లుకు కూడా టీడీపీ మద్దతు పలికింది. దీనిని ముస్లిమ్ సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ముస్లిమ్ మత ఆస్తులపై హిందు మత పెద్దల పెత్తనం పెరిగేలా బిల్లు ఉందనే విమర్శలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ వక్ఫ్ బిల్లను పార్లమెంట్ లో బలపరచడం చర్చగా మారింది.
పవన్ కల్యాణ్ ను బలపరిచే క్రమంలో...
రాష్ట్రంలో కూటమిలో భాగస్వామిగా వున్న జనసేన పార్టీ కేంద్రంలోని బీజేపీతోనూ భాగస్వామిగా ఉంది. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి ముందు నుంచే బీజేపీతో పవన్ కల్యాణ్ పొత్తులో ఉన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో పవన్ కల్యాణ్ కు ప్రాధాన్యత పెరిగింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పవన్ కల్యాణ్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందుకు కారణం హిందూత్వ అజెండాను పవన్ కల్యాణ్ నెత్తిన పెట్టుకోవడం. దక్షిణ భారత దేశంలో హిందూత్వ అజెండాను అమలు చేసేందుకు పవన్ కల్యాణ్ ను బీజేపీ ఉపయోగించుకుంటోంది. సినీ నటుడు కావడం, తమిళనాడు, ఏపీ, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లో అభిమానులు ఉండటం కూడా పవన్ కల్యాణ్ కు కలిసిసొచ్చే అంశంగా చెప్పొచ్చు. తమిళం, కన్నడ, తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో మాట్లాడుతూ ఎక్కడికక్కడ ఆ ప్రజలను ఆకట్టుకునే పని పవన్ కల్యాణ్ చేస్తున్నారు. ఇటీవల జరిగిన జనసేన సభలోనూ తనను తాను దేశ నాయకులతో పోల్చుకుని నాకు ఇంతటి క్రేజ్ రావడానికి దేవుడే కారణమని చెప్పటం విశేషం. రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కల్యాణ్ ఎప్పటికప్పుడు బీజేపీ చెప్పుచేతల్లో ఉండటం, రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామి కావడంతో తెలుగుదేశం పార్టీ ఆయన నాయకత్వాన్ని బలపరచక తప్పటం లేదు. దీనిని ముస్లిమ్ సమాజం జీర్ణించుకోలేక పోతోందనే విమర్శలు ఉన్నాయి.
ఉత్తరాది రాజకీయాలు దక్షిణాదికి విస్తరిస్తున్నాయా?
ముస్లిమ్ లను వేరు చేసిన ఉత్తరాది రాజకీయాలు దక్షిణాదికి కూడా విస్తరిస్తున్నాయనే అనుమానాలు ముస్లిమ్ ల్లో పెరుగుతున్నాయి. ఏపీలో ముస్లిమ్ ల పైనే కాకుండా ఇటీవల క్రిష్టియన్ ల పై కూడా ఏపీ ప్రభుత్వం కొరఢా ఝుళిపించింది. రాష్ట్రంలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న చర్చిలు ఎన్ని ఉన్నాయో వాటి వివరాలు తెలపాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు ఒకరికి తెలియకుండా మరొకరు ఇస్తారనుకోవడం పొరపాటే అవుతుందనే చర్చ కూడా జరుగుతోంది. ఉప ముఖ్యమంత్రి నిర్వహణలో ఉన్న పంచాయతీరాజ్ శాఖ నుంచి ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో అన్ని రాజకీయ పార్టీలు, ఇతర సంఘాలు, మత సంస్థల నుంచి వ్యతిరేకత రావడంతో ప్రస్తుతానికి ఆ విషయాన్ని అలా ఆపివేశారు. అంటే చాపకింద నీరులా దక్షినాదిలోనూ ముస్లిమ్, క్రిష్టియన్ లను వేరు చేసేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని మేధావి వర్గం భావిస్తోంది. ఇందులో ఒక్క విషయం గమనించాలని కొందరు వాదిస్తున్నారు. మిషనరీల స్వభావం ఉన్న చర్చిల్లో కింది స్థాయి కులాల వారు ‘పరలోక రాజ్య భావనలో’ చైనత్య రాహిత్యంగా మారిపోతున్నారనే విమర్శలు వస్తుండగా, అగ్రకులాల అధీనంలో ఉన్న చర్చిల్లోని పాస్టర్లు కొందరు బీజేపీతో మిలాఖత్ అవుతున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఉత్తరాది తరహాలోనే దక్షిణాదిలో పోలింగ్ బూతుల వద్దకు ముస్లిమ్, క్రిష్టియన్ లు రానురాను వచ్చే పరిస్థితులు లేకుండా పోతాయనే భావనలు మేధావి వర్గం వ్యక్తం చేస్తోంది.
అధికారమే ముఖ్యం కదా..
అధికారం లేకుండా ఏమీ చేయలేము. అందువల్ల ఎంతో కొంత బీజేపీ నాయకుల కోసం టీడీపీ త్యాగం చేయక తప్పదు. అంటూ కొందరు టీడీపీ నాయకులు, కార్యకర్తలు అక్కడక్కడ వ్యాఖ్యానించడం కూడా చర్చకు దారి తీసింది. చరిత్రలో తెలుగుదేశం పార్టీకి ఉన్న లౌకిక వాద స్వభావం క్రమంగా కనుమరుగవుతోందనే చర్చ కూడా ఆంధ్ర ప్రజల్లో మొదలైంది. కేంద్రంలోని బీజేపీ ప్రవేశపెట్టే బిల్లులకు టీడీపీ మద్దతు ప్రకటించి తన సెక్యులర్ స్వభావాన్ని తానే రద్దు చేసుకుంటోందని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ రవీంద్రనాథ్ వ్యాఖ్యానించారు.
రాజ్యాంగమే రక్షా కవచం
దేశానికి భారత రాజ్యాంగమే రక్షా కవచమని ఆంధ్రా యూనివర్సిటీ రాజనీతి శాస్త్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ గోవాడ వీర్రాజు అభిప్రాయ పడ్డారు. దక్షిణాదిలో హిందూత్వ వాదాన్ని బలంగా వినిపించేందుకు పవన్ కల్యాణ్ ను బీజేపీ ఉపయోగించుకోవాలనుకుంటోంది. మిత్ర పక్షంగా ఉన్న పవన్ కల్యాణ్ ను టీడీపీ దూరంగా ఉంచలేక, లౌకిక భావాలను దూరం చేసుకుంటుందనటంతో సందేహం లేదని అన్నారు. బీజేపీ వారు తెలుగుదేశం పార్టీని హిందూత్వ ఊబిలోకి నిదానంగా దింపుతున్నారని, దిగుతారో, వడ్డున పడతారో వారి చేతుల్లోనే ఉందన్నారు.