
పిఠాపురంలో టీడీపీ vs జనసేన
శనివారం పిఠాపురంలో నాగబాబు పర్యటన ఉద్రిక్తతల మధ్య సాగింది. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు నాగబాబును అడ్డుకున్నారు.
పిఠాపురం నియోజకవర్గంలో ఇటీవలి రాజకీయ పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయాన్ని సూచిస్తున్నాయి. జనసేన నేత నాగబాబు ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత పిఠాపురంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపట్టారు. ఈ సందర్భంలో శనివారం జరిగిన ఘటనలు జనసేన, తెలుగుదేశం (టీడీపీ) మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది. ‘జై వర్మ, జై టీడీపీ’ అంటూ నినాదాలు చేస్తూ జెండాలతో ప్రదర్శన చేయడం, నాగబాబు కారును అడ్డుకోవడం వంటివి జరిగాయి. ఈ పరిణామాలు కూటమిలో వర్గపోరు మొదలైందనే అభిప్రాయాన్ని బలపరుస్తున్నాయి. నాగబాబు పర్యటన సందర్భంగా వర్మను ఆహ్వానించలేదని టీడీపీ వారు ఈ ఆందోళనకు దిగారు.
పవన్ గెలుపులో వర్మ కీలకం...
పిఠాపురం నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈ విజయంలో టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ మద్దతు కీలక పాత్ర పోషించింది. వర్మ గతంలో ఇక్కడ మాజీ ఎమ్మెల్యేగా, స్థానికంగా బలమైన పట్టు కలిగిన నాయకుడు. అయితే ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఒప్పందంలో భాగంగా ఈ సీటు జనసేనకు కేటాయించారు. దీంతో వర్మ తన అభ్యర్థిత్వాన్ని విరమించుకుని పవన్ కళ్యాణ్ విజయానికి కృషి చేశారు. ఎన్నికల తర్వాత వర్మకు ఎమ్మెల్సీ పదవి హామీ ఇచ్చినట్లు టీడీపీ వారు చెప్పుకున్నారు. అది నెరవేర లేదు. బదులుగా నాగబాబు ఎమ్మెల్సీగా నియమితులై పిఠాపురంలో చురుకైన పాత్ర పోషిస్తుండటం టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తిని రేకెత్తించింది.
వర్మను డమ్మీగా మార్చారా?
నాగబాబు ఎమ్మెల్సీగా పిఠాపురంలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం, అధికారులతో సమావేశాలు నిర్వహించడం వంటి చర్యలు టీడీపీ కార్యకర్తలకు వర్మను "డమ్మీ"గా మార్చే ప్రయత్నంగా కనిపించాయి. శనివారం గొల్లప్రోలులో నాగబాబు పర్యటన సందర్భంగా టీడీపీ కార్యకర్తలు "జై వర్మ" నినాదాలతో ఆందోళన చేపట్టారు. ఈ సంఘటనలో జనసేన కార్యకర్తలు "జై జనసేన" అంటూ ప్రతిస్పందించడంతో రెండు వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. నాగబాబు కారును కదలకుండా అడ్డుకోవడం, రెండు పార్టీల జెండాలతో హోరెత్తించడం ఈ ఘర్షణ తీవ్రతను సూచిస్తున్నాయి.
వర్మ vs నాగబాబు
వర్మ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విజయానికి తోడ్పడినప్పటికీ, ఆ తర్వాత ఆయనకు కూటమిలో తగిన ప్రాధాన్యత లభించలేదు. ఎమ్మెల్సీ పదవి ఆశించిన వర్మకు ఆ అవకాశం నాగబాబుకు దక్కడం టీడీపీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల నాగబాబు వర్మను తక్కువ చేసేలా మాట్లాడినట్లు వచ్చిన వార్తలు ఈ విభేదాలను మరింత పెంచాయి. ఈ వ్యాఖ్యలు టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టాయి. పిఠాపురంలో జనసేన ఆధిపత్యం చెలాయించాలని నాగబాబు భావిస్తుండగా, టీడీపీ తమ స్థానిక నాయకుడు వర్మ ప్రాధాన్యతను కాపాడుకోవాలని కోరుకుంటోంది. ఈ రెండు లక్ష్యాల మధ్య సంఘర్షణే ఈ ఘటనలకు దారితీసింది.
ఈ పరిణామాలు దేనికి దారితీస్తాయి?
పిఠాపురంలో ఈ ఘటనలు కూటమి రాజకీయాల్లో పెద్ద ప్రభావాన్ని చూపకపోయినా స్థానిక స్థానికంగా మార్పులకు దారితీయవచ్చు. ఈ ఘర్షణ టీడీపీ-జనసేన మధ్య సమన్వయ లోపాన్ని బహిర్గతం చేసింది. ఇది రాష్ట్రవ్యాప్తంగా కూటమి ఐక్యతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. వర్మ తన రాజకీయ బలాన్ని నిరూపించుకోవడానికి స్వతంత్రంగా వ్యవహరించే అవకాశం ఉంది. ఒకవేళ టీడీపీ నుంచి తగిన గుర్తింపు లభించకపోతే ఆయన ప్రత్యామ్నాయ ఆలోచనలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఈ వివాదాన్ని సమర్థవంతంగా పరిష్కరించాలనే ఒత్తిడి ఎదుర్కొంటారు. ఆయన నియోజకవర్గంలో జనసేన ఆధిపత్యాన్ని కాపాడుకోవాలనుకుంటే, టీడీపీతో సమన్వయంతో అడుగులు వేయాల్సి ఉంటుంది. వర్గపోరు అభివృద్ధి కార్యక్రమాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. రెండు పార్టీలు పరస్పరం పోటీపడితే ప్రజల సమస్యల పరిష్కారం ఆలస్యం కావచ్చు.