
గుడివాడలో చిందేసిన టీడీపీ
గుడివాడ పట్టణంలో శనివారం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చిందులేశారు. వైఎస్సార్సీపీ మీటింగ్ బ్యానర్ ను పీకేశారు.
ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడూ జరగని ఘట్టం గుడివాడలో శనివారం జరిగింది. పార్టీల సభలు, సమావేశాలు సాధారణంగా ఎవరికి వారు జరుపుకుంటారు. అయితే ఇక్కడ వైఎస్సార్సీపీ వారు సమావేశం జరుపుకుంటుంటే అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తొలగించడంతో పాటు సమావేశానికి ఆటంకం కల్పించేందుకు టీడీపీ వారు ప్రయత్నించి ఫ్లెక్సీ తొలగించడంలో సక్సెస్ అయ్యారు. ఇంతకూ ఆ ఫ్లెక్సీ ఏమిటనుకుంటున్నరా? ‘బాబు షూరిటీ.. మోసం గ్యారెంటీ’ ఇదండీ సంగతి. పట్టణంలో వైఎస్సార్సీపీ వారు సమావేశం పెట్టారని తెలుసుకున్న చాలా మంది టీడీపీ వారు డప్పులు కొడుతూ.. నృత్యాలు చేస్తూ.. ఈలలు వేస్తూ సమావేశం జరిగే కల్యాణ మండపం దగ్గరకు వచ్చి నానా రభసా సృష్టించారు.
పోలీసుల ప్రేక్షక పాత్ర
ప్రత్యేక పోలీసు దళాలు అక్కడికి చేరుకున్న దాడులకు పాల్పడే వారిని ఆపలేక పోయారు. సమావేశం జరుగుతున్న కేకే కన్వెన్షన్ హాలు ముందు పోలీసులు మొహరించినా వారిని నెట్టుకుంటూ మహిళలు, పురుషులు బ్యానర్ ను పీకేశారు. పోలీసులు చూస్తుండగానే వారిని నెట్టుకుంటూ వెళ్లి బ్యానర్ ను పీకేశారంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారనేది స్పష్టమైంది.
ఇటువంటి సంఘటన ఇదే మొదటిసారి
గుడివాడ పట్టణంలో ఒక పార్టీ సమావేశం పెడితే మరో పార్టీ దానిని జరగకుండా ప్రత్యక్ష్యంగా అడ్డుపడటం ఇదే మొదటి సారని స్థానికులు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ వారి హడావుడి తప్ప ఎక్కడా వైఎస్సార్సీపీ వారి హడావుడి కనిపించలేదు.
సమావేశం పూర్తి చేసిన వైఎస్సార్సీపీ
బయట టీడీపీ వారు గోల చేస్తున్నా తమ పని తాము కానించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి వైఎస్సార్సీపీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు కేకే కన్వెన్షన్ హాలుకు చేరుకుని సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో దుప్పిపాటి శశిభూషణ్, జి. శ్రీను, ఎన్ జాన్ విక్టర్, మెరుగుమాళ్ల ఖాళీ, జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాళ్ల హారిక పాల్గొన్నారు.
హారికను అడ్డుకున్న టీడీపీ శ్రేణులు
హారిక సమావేశం నుంచి బయటకు వస్తున్నప్పుడు కారును అడ్డుకుని దాడికి యత్నించారు. చాలా సేపు కారు టీడీపీ కార్యకర్తలు, నాయకుల మధ్యలో ఆగిపోయింది. పోలీసులు జోక్యం చేసుకుని చిన్నగా కారును బయటకు పంపిచేశారు.
సమావేశానికి హాజరు కాని నాని
మాజీ మంత్రి, నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ చార్జి కొడాలి నానీ సమావేశానికి హాజరు కాలేదు. మచిలీపట్నం నుంచి సమావేశానికి వచ్చేందుకు ప్రయత్నించిన పేర్ని నానిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
ఎమ్మెల్యే రాము ఎక్కడ...
ఎమ్మెల్యే వెనిగండ్ల రాము టీడీపీ వర్గీయులను రెచ్చగొట్టి గొడవ చేయించాడని వైఎస్సార్సీపీ వారు ఆరోపిస్తున్నారు. ఆయన మాత్రం కనిపించ లేదు. టీడీపీ నుంచి రోడ్లపైకి వచ్చి గోల చేసిన వారిలో పార్టీ ముఖ్యులు కనపడకుండా జాగ్రత్త పడ్డారు.
నానీ బూట్లు తుడిచే ఫొటో ఒక రోజంతా ఉంచారు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాళ్ల వద్ద కూర్చుని చంద్రబాబు బూట్లు మాజీ మంత్రి కొడాలి నానీ తుడుస్తున్నట్లు టీడీపీ వారు వేయించిన ఫ్లెక్సీని శనివారం సాయంత్రం వరకు నెహ్రూ చౌక్ సెంటర్ లో ఉంచారు. దీంతో వైఎస్సార్సీపీ శ్రేణులు ఆగ్రహించి బ్యానర్ తొలగించేందుకు ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు కావాలనే కొడాలి నానీని అవమానించేందుకు ఆ ఫ్లెక్సీని సాయంత్రం వరకు అలాగే ఉంచేలా చేశారనే విమర్శలు వచ్చాయి.