‘మీది విజయం.. మాది మోసమా’.. జగన్‌కు టీడీపీ నేతల సవాల్
x

‘మీది విజయం.. మాది మోసమా’.. జగన్‌కు టీడీపీ నేతల సవాల్

ఈవీఎంలపై జగన్ చేసిన వ్యాఖ్యలు అసంబద్దంగా ఉన్నాయంటూ టీడీపీ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. పులివెందులకు జగన్ రాజీనామా చేస్తే ఉప ఎన్నిక కోరదామంటూ ఛాలెంజ్ చేస్తున్నారు.


ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈవీఎం మంటలు చెలరేగాయి. దీంతో ఎన్నికల తర్వాత కూడా ఆంధ్ర రాజీకాయలు ఏమాత్రం తగ్గకుండా రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా ఈవీఎంల పనితీరుపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేసిన ఎక్స్(పోస్ట్) తీవ్ర దుమారం రేపింది. మీరు గెలిస్తే అద్భుతం.. అవతలి వారు గెలిస్తే మోసమా అంటూ సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. తాజాగా జగన్ చేసిన పోస్ట్‌కు టీడీపీ కౌంటర్ ఎటాక్‌కు దిగింది. ఈ విషయంపై టీడీపీ నేతలు మాటల తూటాలు పేలుస్తున్నారు. ఏమాత్రం తగ్గేదే లేదంటూ టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. ప్రజల తీర్పు దెబ్బకు జగన్‌కు మతిస్తిమితం కోల్పోయి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటూ టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.

‘ఇంకా షాక్ నుంచి తేకోలేదా జగన్’

ఈ విషయంపై మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. జగన్‌కు ఘాటు బదులిచ్చారు. ప్రజలు ఇచ్చిన షాక్ నుంచి ఇంకా కోలుకోలేదా జగన్ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘జగన్.. ఏపీ ఎలాన్ మస్క్‌లా మాట్లాడుతున్నారు. గెలిస్తే తన గొప్ప.. ఓడితే ఈవీఎంల తప్పా..? 2019లో 151 సీట్లు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఈవీఎంల గురించి తానేం మాట్లాడారో జగన్ ఒకసారి గుర్తు చేసుకోవాలి. జగన్ ఇకనైనా పరనింద, ఆత్మ స్తుతి మాని ఆత్మ విమర్శ చేసుకోవాలి’’ అని సూచించారు చంద్రమోహన్‌రెడ్డి.

ఉప ఎన్నిక కోరదాం: బుద్దా వెంకన్న

ఇదే విషయమై టీడీపీ నేత బుద్దా వెంకన్న కూడా ఘాటుగానే నిలదీశారు. ‘‘2019లో వైసీపీకి 151 సీట్లు వస్తే అది చారిత్రామక విజయమే తప్ప మరేమ కాదా. అదే ఇప్పుడు 2024లో టీడీపీ కూటమికి 164 సీట్లు వస్తే మాత్రం అదంతా ఈవీఎంల ట్యాంపరింగ్, మోసమంటూ మాట్లాడతావా?’’ అంటూ ఎక్స్(ట్విట్టర్) వేదికగా ఫైరయ్యారు. ‘‘అంతేకాకుండా పులివెందుల ఎమ్మెల్యే స్థానానికి జగన్ రాజీనామా చేస్తే అందరిమీ కలిసి బ్యాలెట్ పేపర్ విధానంలో ఉప ఎన్నిక పెట్టమని ఎన్నికల సంఘాన్ని కోరదాం. అప్పుడు నువ్వు అసలు గెలుస్తావో లేదో ? మొన్న వచ్చిన మెజారిటీ వస్తుందో రాదో? చూద్దాం’’ అంటూ ఛాలెంజ్ చేశారు. అనంతరం ఇప్పటికైనా జగన్.. చిలక జోస్యం చెప్పడం మానుకోవాలని సూచించారు.

జగన్ ఏం ట్వీట్ చేశారంటే!

సోషల్ మీడియా వేదికగా జగన్.. ఈవీఎంల పనితీరుపై కీలక పోస్ట్ పెట్టారు. ‘‘న్యాయం జరిగినట్లు కనిపించడం కాదు. నిజంగా న్యాయం జరగాలి. అప్పుడే ప్రజాస్వామ్యం బలంగా ఉండటమే కాకుండా నిస్సందేహంగా ప్రబలంగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల పద్దతుల్లో మార్పులు వస్తున్నాయి. ప్రస్తుతం దాదాపు అభివృద్ధి చెందిన ప్రతి దేశంలో కూడా పేపర్ బ్యాలెట్లే వాడుతున్నారు. ఈవీఎంలను ఉపయోగించడం లేదు. ఈవీఎంల బదులు పోస్టల్ బ్యాలెట్లను ఉపయోగించాలి. మన ప్రజాస్వామ్య నిజమైన స్ఫూర్తిని నిలబెట్టుకోవడంలో మనం కూడా అదే దిశగా ప్రయాణించాలి’’ అని జగన్.. ఎక్స్(ట్వీట్టర్)లో పోస్ట్ పెట్టారు.

Read More
Next Story