వైఎస్ఆర్ విగ్రహానికి నిప్పు.. పెట్టిందెవరో..!
బాపట్లలో వైఎస్ఆర్ విగ్రహాన్ని దగ్దం చేయడం వెనక టీడీపీ పాత్ర ఉందని వైసీపీ ఆరోపిస్తోంది. ఓటమి భారం మోయలేకే వైసీపీ ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తోందని టీడీపీ విమర్శించింది.
టీడీపీ నేతల పనే..
బాపట్లలో వైఎస్ఆర్ విగ్రహానికి నిప్పు పెట్టడం వెనక టీడీపీ నేతల పాత్ర ఎంతైనా ఉందని వైసీసీ నేతలు ఆరోపిస్తున్నారు. అధిక మెజార్టీతో అధికారంలోకి రావడం, వారిని ప్రశ్నించడానికి ప్రతిపక్షం కూడా లేదన్న అహంకారంతోనే టీడీపీ ఇలాంటి పనులకు పాల్పడుతోందని మండిపడుతున్నాయి వైసీపీ శ్రేణులు. ఎన్నికల్లో గెలిచాం అని తెలిసినప్పటి నుంచి వారు రాష్ట్రంలో వైఎస్ఆర్ చిహ్నాలను ఒక్కొక్కటిగా తొలగిస్తూ వస్తున్నారని, గెలిచిన రోజు వైఎస్ఆర్ యూనివర్సిటీలో వైఎస్‌ఆర్ పేరును బలవంతంగా తొలగించారని గుర్తు చేశారు. అదే విధంగా మరెన్నో పథకాల పేర్లలో కూడా వైఎస్‌ఆర్‌ను తొలగిస్తూ సీఎం చంద్రబాబు అధికారికంగా నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు కూడా జారీ చేశారని, ఇప్పుడు ఆఖరికి వైఎస్ఆర్ విగ్రహాలు కూడా లేకుండా చేయడానికి టీడీపీ పూనుకుందని, అందుకు తొలి మెట్టుగా బాపట్లలోని దళితవాడలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి నిప్పంటించారని వైసీపీ శ్రేణులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి.
ఇదంతా మాపై బురదజల్లే ప్రయత్నమే
టీడీపీ పార్టీ, ప్రభుత్వంపై వైసీపీ శ్రేణులు చేస్తున్న ఆరోపణలను టీడీపీ శ్రేణులు తిప్పుకొడుతున్నాయి. తమకు అలాంటి అవసరం లేదని, ప్రజల్లో సింపతీ పొందడానికి వైసీపీ వాళ్లే వైఎస్ఆర్ విగ్రహాన్ని తగలబెట్టి ఉంటాయని, ఇప్పుడు తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని టీడీపీ వర్గాలు బదులిచ్చాయి. ప్రజల సింపతి కోసం జగన్ ఎంత దూరమైనా వెళ్తారని ఆరోపించారు. దానికి తోడు తమను ఎవరూ ఓడించలేరు అన్న అహంకారంతో ఉన్న జగన్‌కు, వైసీపీకి ప్రజలకు గట్టి బుద్ది చెప్పారని, ప్రజలకు ఇచ్చిన ఓటమి భారాన్ని తట్టుకోలేక వైసీపీ ఇలాంటి చిల్లర రాజకీయాలకు పాల్పడుతోందని టీడీపీ శ్రేణులు ఘాటుగా బదులిస్తున్నాయి.
ఇంకా తెలీలేదు: పోలీసులు
అయితే ఈ ఘటనపై తాము కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు. ఘటన ప్రాంతంలో దగ్గర్లో ఉన్న అన్ని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నామని, ఇప్పటి వరకు ఎటవంటి క్లూ దొరకలేదని వివరించారు. కానీ ఈ దురాగతానికి పాల్పడిన వారిని పట్టుకోవడానికి తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నామని, వీలైనంత త్వరగా వారిని పట్టుకుంటామని చెప్తున్నారు. అయితే ఈ పనిని కొందరు ఆకతాయిలు చేసి ఉండొచ్చన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని, ఘటనా సమయంలో అక్కడ ఉన్న మొబైల్ ఫోన్ల సిగ్నల్స్ ట్రాకింగ్ ద్వారా కూడా దర్యాప్తును ముందుకు తీసుకెళ్తున్నామని పోలీసు వర్గాలు చెప్పాయి.