చంద్రబాబు జన్మదిన వేడుకలు.. 750 టెంకాయలు కొట్టిన నేత
x

చంద్రబాబు జన్మదిన వేడుకలు.. 750 టెంకాయలు కొట్టిన నేత

చంద్రబాబు వేడులకు పార్టీ కార్యకర్తలు, నేతలు ప్రతి జిల్లాలో ఘనంగా నిర్వహిస్తున్నారు. కుప్పంలో జరిగిన ఈ వేడుకల్లో నారా భువనేశ్వరి పాల్గొన్నారు.


టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈరోజు తన 74వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు పుట్టినరోజును పురస్కరించుకుని కుప్పంలోని టీడీపీ శ్రేణులు ఘనంగా సంబరాలు చేశారు. వీటిలో భాగంగా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కుప్పంలో కేక్ కట్ చేశారు. పార్టీ నేతలకు కేక్ తినిపించారు. మీలాంటి ప్రియతమ నేతల సహకారం టీడీపీ ఎన్నటికీ ఉండాలని వారితో అన్నారు. ప్రజల కోసం టీడీపీ చేస్తున్న యుద్ధంలో మీరు కీలకంగా వ్యవహరించాలని పార్టీ కార్యకర్తలు, శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, చంద్రబాబు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

ప్రత్యేక పూజలు చేయించిన భువనేశ్వరి

చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని సామగుట్టపల్లె దగ్గర ఉన్న కదరిబంద నరసింహస్వామి ఆలయంలో నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం టీడీపీ కార్యాలయంలో మైనారిటీ మహిళలతో కలిసి చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఇదిలా ఉంటే అనంతపురం జిల్లాలోని కణేకల్‌లో విద్యార్థులు, పార్టీ నాయకుల మధ్య చంద్రబాబు కేక్ కట్ చేసి పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు.

750 టెంకాయలు కొట్టారు

చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా పార్టీ నేతలు భారీగా సంబరాలు చేసుకున్నారు. మరికొందరు నేతలు ప్రత్యేక పూజలు చేయించి కొబ్బరి కాయలు కొట్టారు. వారిలో రాయలసీమ టీడీపీ నేత శ్రీధర్.. ఏకంగా 750 కొబ్బరి కాయలు కొట్టారు. చంద్రబాబు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ దేవుడిని కోరుకున్నట్లు ఆయన చెప్పారు. అంతేకాకుండా 7.50 కిలోల కర్పూరం కూడా వెలిగించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రాష్ట్రమంతా సంబరాలు

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పుట్టినరోజు వేడుకలకు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో అక్కడి పార్టీ శ్రేణులు, నేతలు ఘనంగా నిర్వహిస్తున్నారు. చంద్రబాబు పూర్తి ఆరోగ్యంగా ఉండాలని ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారు. కొన్ని ఊర్లలో అన్నదానం చేసేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

Read More
Next Story