రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చీ రాగానే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) మేయర్ పదవిపై టీడీపీ కన్నేసింది. వైసీపీ మేయర్ గొలగాని హరివెంకట కుమారిని అవిశ్వాస తీర్మానం ద్వారా దించడానికి కుట్ర చేసింది. మేయర్‌ను దించేందుకు అవసరమైన బలం ఏ మాత్రం లేకపోయినా మిత్రపక్షం జనసేన సాయంతో ముందుకు అడుగులు వేసింది. ఎత్తుకు పై ఎత్తులతో వైసీపీ కార్పొరేటర్లకు ప్రలోభాల ఎర వేసింది. వాటికి తలొగ్గిన కొందరు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలోకి, మరికొందరు జనసేనల్లోకి జంప్ చేశారు. మొత్తం 98 కార్పొరేటర్ స్థానాలు, మరో 13 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్న ఈ మహా నగరపాలక సంస్థలో మేయర్‌ను పదవీచ్యుతురాలిని చేయాలంటే 2/3 వంతు మెజార్టీ అవసరం. అంటే అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 74 మంది సభ్యులు ఓటేయాలి. 2021లో జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో వైసీపీ 59, టీడీపీ 29, ఇండిపెండెంట్లు నలుగురు, జనసేన ముగ్గురు, బీజేపీ, సీపీఐ, సీపీఐ (ఎం)ల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఎన్నికయ్యారు. మేయర్‌పై అవిశ్వాసం నెగ్గడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 74ను చేర డానికి అష్టకష్టాలు పడ్డారు. వైసీపీ నుంచి ఎన్నికైన పలువురు కార్పొరేటర్లు పార్టీల ఫిరాయింపుతో ఏప్రిల్ 19న జరిగిన అవిశ్వాస తీర్మానంలో సరిగ్గా ఆ 74 మందే హాజరై మేయర్‌ను దించేశారు. ఆ తర్వాత మేయర్ స్థానంలో టీడీపీ 96వ వార్డు కార్పొరేటర్ పీలా శ్రీనివాసరావును ఎన్నుకున్నారు. కొద్దిరోజుల తర్వాత వైసీపీకి చెందిన డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్‌ను కూడా అవిశ్వాసంతోనే పదవీచ్యుతుడిని చేశారు.
డిప్యూటీ మేయర్ ఎన్నికకు హాజరైన సభ్యులు
డిప్యూటీ మేయర్ కోసమూ టీడీపీ పట్టు..
ఇప్పటికే మేయర్ పీఠాన్ని దక్కించుకున్న టీడీపీ.. ఇప్పడు డిప్యూటీ మేయర్ పదవి కూడా తమకే కావాలని పట్టుబట్టింది. మేయర్ పదవి ఎలాగూ టీడీపీకి దక్కింది కాబట్టి డిప్యూటీ మేయర్ పోస్టు తమకు ఇవ్వాలని జనసేన నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఈ రెండు పార్టీల మధ్య పంతాలకు దారితీసింది. కూటమి పొత్తును పక్కనబెట్టి టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు వ్యూహాలు పన్నారు. మరోవైపు డిప్యూటీ మేయర్ పదవి జనసేనకు ఇస్తే టీడీపీ సభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉంటారన్న ప్రచారాన్ని ఉధృతం చేశారు. పైగా అవిశ్వాస తీర్మానం ద్వారా దిగిపోయిన వైసీపీ మేయర్ హరివెంకట కుమారి యాదవ సామాజికవర్గానికి చెందిన మహిళ కావడంతో డిప్యూటీ మేయర్ పదవి అదే సామాజికవర్గ మహిళా కార్పొరేటర్‌కు ఇవ్వాలని టీడీపీ నేతలు మెలిక పెట్టారు. అలా చేయకపోతే టీడీపీ కార్పొరేటర్లు ఓటింగ్‌కు దూరంగా ఉంటారని ప్రచారం చేశారు. ఇలా ఎలా చూసినా డిప్యూటీ మేయర్ పోస్టును జనసేనకు దక్కకూడదన్న భావనతో టీడీపీ నాయకులు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ వచ్చారు. దీనికి ధీటుగా డిప్యూటీ మేయర్ పదవి ఇవ్వకపోతే రాజీనామా చేస్తామంటూ జనసేన సభ్యులు లేఖ రాయడంతో ఈ పంచాయతీ అధిష్టానానికి చేరింది. దీంతో ఇన్నాళ్లూ విశాఖ డిప్యూటీ మేయర్ పదవిపై సీరియస్‌గా స్పందించని జనసేన అధిష్టానం.. ఈ పదవిని జనసేనకు ఇవ్వాలని స్పష్టం చేసింది. డిప్యూటీ మేయర్ పదవి కోసం జనసేన నుంచి ఎన్నికైన వారు, వైసీపీ నుంచి ఆ పార్టీలోకి జంప్ చేసిన వారూ ఆశలు పెట్టుకున్నారు.
సీల్డ్ కవరులో అభ్యర్థి పేరు..
జనసేనలో ఆశావహులు అధికమవడంతో అధిష్టానం డిప్యూటీ మేయర్ అభ్యర్థి పేరును ఖరారు చేసి సీల్డ్ కవరులో తీసుకెళ్లాలని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే సీహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్‌ను ఆదేశించింది. సోమవారం ఉదయం జరిగే డిప్యూటీ మేయర్ ఎన్నిక వేళ ఆ సీల్డ్ కవర్‌ను తెరిచారు. అందులో జనసేన నుంచి మొదట్లో ఎన్నికైన 64వ వార్డు కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి పేరును అధికారికంగా ప్రకటించారు.
టీడీపీ సభ్యులు దూరంతో ఎన్నికకు బ్రేకు..
సోమవారం ఉదయం 11 గంటలకు జీవీఎంసీ డిప్యూటీ మేయర్ పదవి ఎన్నికకు అన్ని ఏర్పాట్లు చేశారు. డిప్యూటీ మేయర్ పదవి దక్కాలంటే కనీసం 56 మంది సభ్యులు హాజరు కావలసి ఉండగా (సీపీఐ, సీపీఐ (ఎం) సహా) 54 మందే హాజరయ్యారు. దీంతో కోరం సరిపోక ఎన్నికల అధికారి, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ ఈ ఎన్నికను మంగళవారానికి వాయిదా వేశారు.
నాడు 74.. నేడు 54 మందే హాజరు..
నెల రోజుల క్రితం మేయర్ హరివెంకట కుమారిని అవిశ్వాస తీర్మానానికి అవసరమైన 74 మంది హాజరయ్యారు. ఆరోజు జనసేన నుంచి ఒక్కరు గైర్హాజరైనా అవిశ్వాసం నెగ్గేది కాదు.. టీడీపీ మేయర్ స్థానాన్ని దక్కించుకునేదీ కాదు. కూటమి పొత్తు ధర్మానికి కట్టుబడి అవిశ్వాస తీర్మానానికి తమ సభ్యులంతా హాజరయ్యేలా చూశామని, కానీ ఇప్పడు టీడీపీ అందుకు విరుద్ధంగా డుమ్మా కొట్టారని జనసేన కార్పొరేటర్లు మండి పడుతున్నారు. ఉద్దేశపూర్వకంగానే మిగిలిన సభ్యులను గైర్హాజరయ్యేలా చేశారని వీరు ఆరోపిస్తున్నారు. అవిశ్వాస తీర్మానం నాటి హాజరుతో పోల్చుకుంటే టీడీపీ నుంచి గెలిచిన, ఆ పార్టీకి మద్దతుగా నిలిచిన కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు మరో 20 మంది (17 మంది టీడీపీ కార్పొరేటర్లు, ఇద్దరు ఎంపీలు, ఒక ఎమ్మేల్యే) సోమవారం నాటి ఎన్నికకు హాజరు కాలేదు. వీరిలో ఏ ఇద్దరు హాజరైనా డిప్యూటీ మేయర్ పదవి జనసేనకు దక్కేది. మంగళవారం నాటికి ఎలాగోలా వీరిలో ఇద్దరిని తీసుకురాగలిగితే జీవీఎంసీ డిప్యూటీ మేయర్ పీఠం జనసేన పరమవుతుంది. లేదంటే మళ్లీ వాయిదా పడుతుంది. మొత్తమ్మీద విశాఖలో టీడీపీ, జనసేనల మధ్య సఖ్యత అంతంతమాత్రంగానే ఉందన్న విషయం ఈ ఎన్నికతో స్పష్టమైంది.