
కోస్తాంధ్రలో కూటమి గెలుపు, ఉత్తరాంధ్రలో ఓటమి
3 ఎమ్మెల్సీ సీట్లకు జరిగిన ఎన్నికల్లో కూటమి 2 చోట్ల గెలిచింది. ఉత్తరాంధ్రలో ఓడింది. పీఆర్టీయూ గెలిచింది. పీడీఎఫ్ ఓడింది.
ఆంధ్రప్రదేశ్ లో మూడు ఎంఎల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార ఎన్డీఏ కూటమి మద్దతు ఇచ్చిన ఇద్దరు, ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ (PRTU) నుంచి ఒకరు గెలిచారు. కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం, ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలిచారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిపై పీఆర్టీయూ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు.
ఫిబ్రవరి 27న ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన మద్దతుతో మూడు చోట్ల అభ్యర్థులు బరిలో నిలిచారు. వైఎస్సార్ సీపీ ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు. బీజేపీ తటస్థంగా ఉంది. ఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించలేదు. అధికార ఎన్డీఏ కూటమి మద్దతుతో పోటీ చేసిన ప్రస్తుత ఎమ్మెల్సీ, ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (APTF) అభ్యర్థి పాకలపాటి రఘు వర్మపై పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించడం గమనార్హం. 2019 ఎన్నికల్లో శ్రీనివాసులు నాయుడును ఓడించిన వర్మ, ఈసారి ఓటమి చెందాడు.
రెండు సార్లు ఎమ్మెల్సీగా పనిచేసిన గాడె శ్రీనివాసులు నాయుడు, రెండవ ప్రాధాన్యత ఓట్ల ఎనిమిదో రౌండ్‌లో వర్మపై గెలిచారు. ఆయన మొత్తం 10,068 ఓట్లు సాధించి, 710 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇందులో తొలి ప్రాధాన్యత ఓట్లలో వచ్చిన 367 ఓట్లు కూడా ఉన్నాయి. PDF అభ్యర్థి గౌరి రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో పోటీ నుంచి తొలగించిన తర్వాత, ఎన్నిక పోటీ వర్మ, శ్రీనివాసులు నాయుడుల మధ్యనే కొనసాగింది. ఎనిమిదో రౌండ్ అనంతరం, వర్మ తన ఓటమిని అంగీకరించి, సంబంధిత పత్రాలపై సంతకం చేసి లెక్కింపు హాల్‌ను వీడారు.
మాజీ మంత్రి ఆలపాటి గెలుపు...
గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఘన విజయం సాధించారు. మొత్తం తొమ్మిది రౌండ్లకు గానూ, మార్చి 4వ తేదీ మంగళవారం తెల్లవారుజామున 5:50 గంటల సమయంలో చివరి రౌండ్ పూర్తయ్యే సరికి ఆయనకు 82,320 ఓట్ల ఆధిక్యం వచ్చింది. 7వ రౌండ్ ముగిసే సరికి ఆయనకు 1,18,070 ఓట్లు వచ్చాయి. మొత్తం 2,41,873 ఓట్లు పోలవగా, ఏడో రౌండ్ పూర్తయ్యే సరికి 21,577 చెల్లని ఓట్లుగా గుర్తించారు. దీంతో 50 శాతానికి పైగా ఓట్లు సాధించడంతో ఆలపాటిని విజేతగా ప్రకటించారు. ఇక తొమ్మిదో రౌండ్ పూర్తయ్యే సరికి ఆలపాటికి 1,45,057 ఓట్లు వచ్చాయి. సమీప ప్రత్యర్థి లక్ష్మణరావు 62,737 ఓట్లు సాధించారు. ఒట్ల లెక్కింపు ముగిసే సరికి ఆలపాటి రాజాకి 82,320 ఓట్ల మెజార్టీ దక్కింది. చెల్లుబాటు అయిన ఓట్లలో 60 శాతం పైగా ఓట్లను ఆలపాటి సాధించారు.
మార్చి 3 సోమవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలైంది. 25 మంది అభ్యర్థులు పోటీలో ఉండటంతో అప్రతిహాతంగా లెక్కింపు కొనసాగుతోంది.
ఉభయ గోదావరి జిల్లాలలో కూటమి అభ్యర్థికే ఆధిక్యత...
ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో తొలి రౌండు ముగిసేసరికి కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం ఆధిక్యంలో ఉన్నారు. మొత్తం 28వేల ఓట్లకు గాను ఆయన 16,520 ఓట్లు సాధించగా, స్వతంత్ర అభ్యర్థి దిడ్ల వీరరాఘవులుకు 5,815 ఓట్లు వచ్చాయి. ఏలూరు సీఆర్‌ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఈ లెక్కింపు మొదలైంది. 243 మంది ఉద్యోగులు తపాలా బ్యాలట్లు వినియోగించుకోగా.. వీటిలో 42 చెల్లలేదు. ఉదయం 8 గంటలకే లెక్కింపు ప్రక్రియ మొదలైనా, రాత్రి 8 వరకు ఓట్ల కట్టలు కట్టడమే సరిపోయింది. దీంతో ఫలితాలు ఆలస్యం అవుతున్నాయి. సాధారణ ఓట్ల ఫలితాలు 8 రౌండ్లలో వెలువడనున్నాయి.
కూటమికి చెంపదెబ్బ: బొత్స
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కూటమి ప్రభుత్వానికి చెంప దెబ్బ లాంటివని శాసనమండలిలో విపక్షనేత బొత్స సత్యన్నారాయణ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన టీడీపీ, జనసేన కూటమి పార్టీలకు ఏడాదిలోపే చావుదెబ్బ తగిలిందన్నారు.
అధికారం ఉందనే అహంకారంతో అరాచకాలు చేస్తున్న టీడీపీ, జనసేన పార్టీలకు విజ్ఞులైన ఉత్తరాంధ్ర ఉపాధ్యాయులు బెత్తంతో కొట్టి మరీ గట్టిగా గుణపాఠం చెప్పారన్నారు. ‘ఈ ఎన్నికల ద్వారా ఉపాధ్యాయులు ప్రజాస్వామ్య విలువలను మరోసారి చాటిచెప్పారు. కూటమి ప్రభుత్వ మోసాలను తిప్పికొడుతూ గట్టి తీర్పు ఇచ్చారు.
నాగెలుపును రాజకీయాలతో ముడిపెట్టొద్దు- గాదె
తన గెలుపును రాజకీయాలతో ముడిపెట్టొద్దని ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ విజేత గాదె శ్రీనివాసులు నాయుడు అన్నారు. ఉపాధ్యాయుల రుణం తీర్చుకుంటా. నా పనితీరును బట్టి నన్ను గెలిపించారు. 2007 నుంచి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా రాజకీయాలకు అతీతంగానే పనిచేశా. ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వంతో చర్చించి పరిష్కరిస్తా. అవసరమైతే ప్రభుత్వంపై సామ దాన బేధ దండోపాయాలకు సిద్ధంగా ఉన్నా అని ఆయన వ్యాఖ్యానించారు.
Next Story