యలమంచిలి వద్ద ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ లో మంటలు
x
దగ్ధమవుతున్న ఎర్నాకుళం ఎక్స్ ప్రెస్ రైలు బోగీలు

యలమంచిలి వద్ద ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ లో మంటలు

రెండు ఏసీ బోగీలు దగ్ధం, ఒకని సజీవదహనం, ప్రయాణీకుల హాహాకారాలు


అంతా ఆదమరచి హాయిగా నిద్దరోతున్నారు. ఇంతలో ఒక్కసారిగా రైలుబండికి కుదుపు. క్షణాల్లోనే పొగలు. చుట్టూ చిమ్మచీకటి.. దట్టమైన పొగమంచు. ఆ వెంటనే మంటలు. ప్రయాణికుల్లో హాహాకారాలు.. అలజడి మొదలైంది. రైలు దిగుదామంటే ఆగడం లేదు. ఏం చేయాలో పాలుపోవడం లేదు. కాసేపటకి రైలు ఓ స్టేషన్లో నెమ్మదిగా ఆగింది. అంతే ప్రాణభయంతో ప్రయాణికులు రైలు నుంచి దూకేశారు. ఇదంతా అనకాపల్లి జిల్లా యలమంచిలి రైల్వే స్టేషన్ వద్ద ఆదివారం అర్థరాత్రి దాటాక నెలకొన్న పరిస్థితి.

మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది

బ్రేకులు పట్టేయడం వల్లేనా మంటలు?
విశాఖ సమీపంలోని దువ్వాడ మీదుగా 18189 నంబరు టాటానగర్- ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ అర్థరాత్రి ఒంటిగంట సమయంలో అనకాపల్లి దాటింది. నర్సింగబిల్లి వద్ద బీ1 బోగీకి బ్రేకులు పట్టేయడంతో అగ్ని ప్రమాదం సంభవించినట్టు గుర్తించి
ప్రయాణికులు చైన్ లాగారు. ఆ తర్వాత రైలులోని ప్యాంట్రీ కారుకు ఆనుకుని ఉన్న బీ1, ఎం2 ఏసీ బోగీల్లో మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని ఎలమంచిలి స్టేషన్కు సమీపించే సరికి లోకో పైలట్లు గుర్తించారు. రైలును స్టేషన్లోకి తీసుకొచ్చి నిలిపివేశారు. దీంతో ఈ రైలులోని ప్రయాణికులంతా తమ లగేజీని ఎక్కడిదక్కడే ఉంచేసి ప్రాణ భయంతో, పిల్లా పాపలతో దిగేసి స్టేషన్లోకి పరుగులు తీశారు. స్టేషన్ సిబ్బంది అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చారు. అనకాపల్లి, యలమంచిలి, నక్కపల్లి నుంచి అగ్నిమాపక శకటాలొచ్చే లోపే లోపే ఈ రెండు ఏసీ బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలు ఇతర బోగీలకు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది నిలువరించగలిగారు. రైల్వే శాఖ ఉన్నతాధికారులు యలమంచిలి స్టేషన్కు చేరుకున్నారు. అంబులెన్సులను రప్పించి సహాయక చర్యలు చేపట్టారు. అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా ప్రమాద స్థలానికి వచ్చి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
విజయవాడ ప్రయాణికుడు సజీవ దహనం..
ఈ అగ్ని ప్రమాదంలో బీ1 బోగీలో ప్రయాణిస్తున్న ప్రయాణికుడు ఒకరు సజీవ దహనమైనట్టు గుర్తించారు. మృతుడు విజయవాడకు చెందిన చంద్రశేఖర్ సుందర్ (70)గా నిర్ధారించారు. రైలు అగ్ని ప్రమాదానికి గురైన విషయాన్ని నిద్రలో ఉన్న ఆయన గమనించక పోవడంతోనో లేదా వృద్ధాప్యంతో సత్వరమే లేవలేక పోవడంతోనో మృత్యు వాత పడినట్టు భావిస్తున్నారు. కాగా రెండు బోగీల్లోని ప్రయాణికుల వస్తు సామగ్రి అంతా కాలిపోయింది.

పూర్తిగా కాలిపోయిన బోగీలు

రైలులో 2 వేలమంది ప్రయాణికులు..
ఈ రైలులో సుమారు రెండు వేల మంది వరకు ప్రయాణికులున్నారు. మంటలు ఇతర బోగీలకు అంటుకుని ఉంటే ఘోరం జరిగిపోయి ఉండేది. ఒకపక్క మంటలు కొనసాగుతున్న బోగీలను ఇతర బోగీలకు అంటుకోకుండా రైల్వే
సిబ్బంది వాటిని ఎక్కడికక్కడే వేరు చేయడంతో ఆ రెండు బోగీలకే మంటలు పరిమితమై పలువురి ప్రాణాలు నిలిచాయి.
కాలిన బోగీలను వేరు చేసి..
మరోవైపు ఈ రైలులోని ప్రయాణికులంతా యలమంచిలి స్టేషన్లోనే ఉండిపోయారు. వీరంతా చలితో వణికిపోయారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ప్రమాదానికి గురైన రెండు బోగీల్లోని ప్రయాణికులను ఇతర బోగీల్లో సర్దుబాటు చేసి అదే రైలులో పంపించే ఏర్పాట్లు చేశారు.

భయంతో పరుగులు తీస్తున్న ప్రయాణికులు

రైళ్లు నిలుపుదల.. ఆలస్యం..
టాటానగర్-ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ అగ్ని ప్రమాదానికి గురైన ఘటన నేపథ్యంలో విశాఖ నుంచి విజయవాడ వైపు పలు రైళ్లు నిలిచిపోయాయి. అనేక రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. కొన్ని రైళ్లను విశాఖపట్నం, అనకాపల్లి, తుని తదితర స్టేషన్లలో నిలిపి వేశారు. రైళ్ల రాకపోకలను సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరించే చర్యలు చేపట్టారు.



Read More
Next Story