వైవిధ్యంలో టాటా ‘మెగా స్టార్’
x

వైవిధ్యంలో టాటా ‘మెగా స్టార్’

గుంటూరులోని జనచైతన్య వేదిక హలులో రతన్ టాటా సంస్మరణ సభలో ప్రసంగిస్తూ ఆర్థిక నిపుణులు చెరుకూరి కుటుంబరావు ప్రశంస



ప్రపంచవ్యాప్తంగా 100 దేశాలలో వైవిధ్యం గల వస్తు ఉత్పత్తి చేస్తూ 420 బిలియన్ డాలర్ల వార్షిక ఆదాయంతో ప్రపంచ గుర్తింపు పొందిన వ్యాపార దిగ్గజంగా టాటా గ్రూప్ రూపొందటం అభినందనీయమని ప్రముఖ ఆర్థిక నిపుణులు, ప్రణాళిక సంఘ పూర్వ ఉపాధ్యక్షులు చెరుకూరి కుటుంబరావు పేర్కొన్నారు.

ఈనెల 20వ తేదీ ఆదివారం గుంటూరులోని జనచైతన్య వేదిక హలులో భారత్ ప్రగతిలో టాటాల పాత్ర అనే అంశంపై జరిగిన చర్చా గోష్టికి ముఖ్యఅతిథిగా హాజరై చెరుకూరి కుటుంబరావు ప్రసంగించారు. భారతదేశంలో 1868లో ప్రారంభించిన టాటా గ్రూప్ దేశానికి ఆర్థిక పునాదులు వేశారని, సంక్షేమం, ధాతృత్వాన్ని చాటి చెప్పారన్నారు. సంపదను సృష్టిస్తూ వాటి ఫలితాలను సామాన్యులకు అందించే ధ్యేయంగా టాటా సంస్థలు పని చేస్తున్నాయన్నారు.

1912 లోనే 8 గంటల పని విధానాన్ని, 1915లో ఉచిత వైద్య సహాయాన్ని, 1917లో కార్మిక సంక్షేమ విభాగాన్ని, కార్మికుల పిల్లలకు విద్యను అందించడం, 1920లో జీతంతో కూడిన సెలవులు ఇవ్వడం, 1920 లోనే కార్మికులకు ప్రావిడెంట్ ఫండ్ అమలు చేయడం, 1921లో నైపుణ్యాల అభివృద్ధి సంస్థ ఏర్పాటు, 1928లో ప్రసూతి సెలవులు ఇవ్వడం, 1934లో కార్మికులకు బోనస్, గ్రాట్యుటీ లాంటి సంక్షేమ కార్యక్రమాలను భారత దేశంలో మొదటిగా ప్రవేశపెట్టిన ఘనత టాటా గ్రూపులదే అన్నారు. రతన్ టాటా ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన టెట్లీ టీ కంపెనీ, కోరస్ కంపెనీ, జాగ్వర్, లాండ్ రోవర్ కార్లను టాటా గ్రూపుల్లో విలీనం చేసుకుని అభివృద్ధిలో పయనించడం భారతదేశానికి గర్వకారణమన్నారు.




టాటా గ్రూప్ ల వార్షిక ఆదాయం ప్రపంచంలోని 90 దేశాల జాతీయ ఆదయాల కన్నా ఎక్కువగా ఉండటం టాటా ల ప్రగతిని తెలియజేస్తుందన్నారు. సభకు అధ్యక్షత వహించిన జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి ప్రసంగిస్తూ టాటా గ్రూపు ప్రారంభంనుండే స్వాతంత్ర్య ఉద్యమానికి విరాళాలు అందించిందని, మహాత్మా గాంధీజీకి 1909 లో 25 వేలు, 1910 లో మరో 25 వేలు, ఆ తర్వాత 1947 వరకు l లక్షా 25 వేలు విరాళాలు అందించి స్వాతంత్ర్య ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిందన్నారు. విశిష్ట సేవలందించిన రతన్ టాటా కు భారత ప్రభుత్వం భారతరత్న అందించి గౌరవించాలన్నారు.

1907 లో టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీని, 1910 లో టాటా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ సప్లై కంపెనీని, 1912లో ఇండియన్ సిమెంట్ కంపెనీని, 1917లో టాటా ఆయిల్ మిల్స్ కంపెనీని, టాటా ఇండస్ట్రియల్ బ్యాంకుని, 1919లో న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీని, 1920లో టాటా కన్స్ట్రక్షన్ కంపెనీని, 1936 లో టాటా ఇనిస్ట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ను మరియు టాటా ఎయిర్ సర్వీసెస్ కు , 1939లో టాటా కెమికల్స్ లాంటి కంపెనీలను స్థాపించి భారత పారిశ్రామిక ప్రగతికి టాటా గ్రూప్ పునాదులు వేసిందని వివరించారు.

మాజీ మంత్రివర్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్ ప్రసంగిస్తూ జె. ఆర్. డి టాటా మహాత్మా గాంధీకి మద్దతుగా నిలిచారని, సహాయ నిరాకరణ, స్వదేశీ ఉద్యమం, దండి సత్యాగ్రహం లాంటి ఉద్యమాలకు అండగా నిలిచారని గుర్తు చేశారు. రతన్ టాటా తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్న డి. సాంబశివరావు విజ్ఞప్తిని మన్నించి క్యాన్సర్ ఆసుపత్రిని నిర్మించారన్నారు.

రతన్ టాటా సేవలను గుర్తించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రతన్ టాటా ఇన్నోవేటివ్ హబ్ ను ప్రకటించడం హర్షణీయమన్నారు. శాసనమండలి సభ్యులు కె.ఎస్. లక్ష్మణరావు ప్రసంగిస్తూ టాటా గ్రూప్ భారతదేశంలో పారిశ్రామిక విస్తరణకు, ఉపాధి కల్పనకు, ఉద్యోగుల సంక్షేమానికి ఎనలేని కృషి చేశారన్నారు. క్రోనీ కాపిటిలిజం నేడు అమలవుతూ ప్రభుత్వ వనరులను, ప్రజల ధనాన్ని లూటీ చేస్తూ వేలాది కోట్లు సంపాదిస్తున్న పాలకులకు, పారిశ్రామిక వేత్తలకు భిన్నంగా టాటా గ్రూప్ దేశభక్తియుతమైన పారిశ్రామిక వేత్తలుగా ఉండటం అభినందనీయమన్నారు.

ఈ కార్యక్రమంలో మహాత్మా గాంధీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొ||డి.ఏ. ఆర్. సుబ్రహ్మణ్యం, మానవత చైర్మన్ పావులూరి రమేష్, నేస్తం సహ వ్యవస్థాపకులు టి. ధనుంజయ రెడ్డి తదితరులు ప్రసంగించారు. సభ ప్రారంభంలో రతన్ టాటా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, శ్రద్ధాంజలి ఘటించారు.


Read More
Next Story