జనసేనానికి ట్రాన్స్‌జెండర్ సవాల్..!
పిఠాపురం ఎన్నికలపైనే ఆంధ్ర ప్రజల దృష్టి ఉంది. అక్కడ పవన్ కల్యాణ్, వంగా గీత ప్రత్యర్థులు కావడం ఇందుకు ఒక కారణం అయితే.. ఇప్పుడు మరో కారణం కూడా యాడ్ అయింది.
రాజకీయాల్లో కూడా వివక్షతను సవాల్ చేస్తూ ఓ ట్రాన్స్ జెండర్ పోటీకి దిగారు. అభిమానాన్ని స్వాగతించని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌కు ఈ ట్రాన్స్‌జెండర్‌తో పాటు అధికార వైసీపీ అభ్యర్థి వంగా గీతతో కూడా ఛాలెంజ్ ఎదురుకానుంది. ఆమే తమన్నా సింహాద్రి. భారత చైతన్య పార్టీ(బీసీవై) తరపున ఆమె తన నామినేషన్‌ను దాఖలు చేశారు. అయితే వివాదంలో ఉన్న సమయంలో పవన్ కల్యాణ్‌కు మద్దతుగా నిలిచన తమన్నా.. ఇప్పుడు పవన్‌కు ప్రత్యర్థి కావడం రాష్ట్రవ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
తొలి ట్రాన్స్‌జెండర్ ఈమే
ఆంధ్ర ఎన్నికల బరిలో పోటీకి సిద్ధమైన తొలి ట్రాన్స్‌జెండర్ అభ్యర్థి తమన్నా సింహాద్రి. ఆమె 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేశారు. ఆ సమయంలో జనసేన నుంచి టికెట్ ఆశించిన ఆమెకు నిరాశే మిగిలింది. దాంతో ఆమె స్వతంత్ర అభ్యర్థిగా మంగళగిరి ఎన్నికల బరిలో తలపడ్డారు. కానీ అక్కడ వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి విజయం సాధించారు. ఇప్పుడు 2024 ఎన్నికల్లో ఆమె పిఠాపురంలో జనసేనాని పవన్‌కు ప్రత్యర్థిగా రంగంలోకి దిగుతున్నారు.
ఎందుకీ మార్పు
పవన్ కల్యాణ్‌ను శ్రీరెడ్డి.. రోడ్డు మీదకు లాగుతున్నప్పుడు తాను జనసేనకు, పవన్‌కు అండగా ఉన్నానని, ఆయన తరపున మాట్లాడానని తమన్నా సింహాద్రి చెప్పారు. అయితే పవన్ కల్యాణ్.. భావాలు నచ్చి ఆయన వెంట నడవాలని, ఆయనను సీఎంగా చూడాలని భావించినట్లు కూడా ఆమె పలు సందర్భాల్లో చెప్పారు. కానీ ఎప్పుడైతే ఆయన టీడీపీతో జత కట్టారో అప్పటి నుంచి పవన్ కల్యాణ్‌పై తమన్నా విమర్శలు ప్రారంభించారు. అయితే పవన్ తన భావాలను, చెగువెరా స్ఫూర్తిగా రూపొందించుకున్నానని చెప్పే సిద్ధాంతాలను పక్కన పెట్టి పక్కా రాజకీయ నాయకుడిగా మారడం వల్లే తమన్నా.. పవన్‌ను విమర్శిస్తున్నారని సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. అంతేకాకుండా బీసీవై నేత రామచంద్రయాదవ్.. సమాజంలో అందరికీ న్యాయం జరగాలన్న ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చి తన సిద్దాంతాలను తూచా తప్పకుండా పాటిస్తున్నారని, ఆ పార్టీ నుంచి టికెట్ ఆఫర్ రావడంతో ఆమె ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారని సమాచారం.
తమన్నాతో పవన్‌కు ప్రమాదమే..
ఇదిలా ఉంటే పిఠాపురం బరిలో తమన్నా సింహాద్రి పోటీ చేయడం పవన్‌కు మైనస్ పాయింట్ కావొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం పిఠాపురంలో పోటీ అంతా కూడా జనసేనాని పవన్ కల్యాణ్, వైసీపీ అభ్యర్థి వంగా గీత మధ్యే ఉందని అందరూ అనుకుంటున్నారని, ఒకవేళ తమన్నా పోటీతో ఓట్లు చీలితే అవన్నీ చాలా వరకు పవన్‌వే అవుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందువల్ల పిఠాపురంలో గెలిచేవారి గెలుపులో కన్నా తమన్నా పాత్ర ఓడిపోయే వారి ఓటమిలో కీలకంగా ఉండొచ్చని విశ్లేషకులు అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.