ఈ ఏడాది లక్ష మంది మహిళా పారిశ్రామిక వేత్తలను తయారు చేయడమే మా ప్రధాన లక్ష్యమని, ఆ విధంగా చేసి తీరుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. తాను వినూత్న ఆలోచనలు చేస్తానని, వాటిని మీ ముందుకు తీసుకొస్తానని, వాటిని అందిపుచ్చుకోవడం మీ బాధ్యత అంటూ మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. మహిళలను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. మహిళలు వ్యాపార రంగంలో రాణించే విధంగా 24 సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు చెప్పారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో శనివారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలకు ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ మహిళలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో గతంలో తాను ఆర్టీసి బస్సుల్లో మహిళా కండక్టర్లకు అవకాశం కల్పించామన్నారు. డ్రైవర్లుగా కూడా ఏర్పాటు చేద్దామనుకుంటే ఎవ్వరు ముందుకు రాలేదన్నారు. పొదుపు సంఘాలను ఏర్పాటు చేశామన్నారు. మహిళలు తమ ఊర్లల్లోనే కూర్చుని డబ్బులు సంపాదించుకునే విధానానికి శ్రీకారం చుడతానన్నారు. ఆదాయం ఆర్జించాలనే ఉద్దేశంతోనే డ్వాక్రా సంఘాలకు నాంది పలికామని, ఎన్నో సవాళ్లను ఎదుర్కొని డ్వాక్రా సంఘాలు నిలబడ్డాయన్నారు. ఆడబిడ్డల కష్టం తీర్చేందుకు దీపం పథకం తీసుకొచ్చామన్నారు. ప్రపంచాన్ని మెప్పించే శక్తి. సామర్థ్యాలు మహిళలకు ఉందన్నారు.
మేజర్ పంచాయతీలలో అరకు కాఫీ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. పాతికేళ్ల క్రితమే అరకు కాఫీకి బ్రాండ్ ఇమేజ్ తెచ్చామన్నారు. ప్రతి గ్రామంలో అరకు కాఫీ ఔట్‌లెట్లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సందర్భంగా మరో సారి ఎన్నికల్లో ఇచ్చిన తల్లికి వందనం పథకం గురించి ప్రస్తావించారు. ఒక ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నా వారందరికీ తల్లికి వందనం అమలు చేస్తామన్నారు. రూ. 15000 అందిస్తామన్నారు. ఐదుగురు పిల్లలున్నా.. వారికి రూ. 60వేలు ఇస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు మెటర్నిటీ సెలవులు ఎన్ని సార్లు అయినా ఇస్తామన్నారు. తన కుటుంబాన్ని ఉదాహణగా చెప్పారు. తన కుటుంబంలో వ్యాపార రంగంలో భువనేశ్వరి కీలక పాత్ర అన్నారు. హెరిటేజ్ సంస్థని భువనేశ్వరినే డెవలప్ చేసినట్లు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌లో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేస్తున్నామని, దీని ద్వారా ప్రతి ఇంటిలో ఒక వ్యాపార వేత్తను తయారు చేస్తామన్నారు. మహిళల కోసం 45 శాతం పెట్టుబి రాయితీ ఇస్తున్నట్లు చెప్పారు. జనాభా సంఖ్య తగ్గిపోతోందన్నారు. గతంలో ఇద్దరు కంటే ఎక్కువ వద్దని చెప్పామని, ఇప్పుడు వీలైనంత మంది పిల్లలను కనమని చెబుతున్నామన్నారు. ఆడబిడ్డల జోలికి వస్తే ఖబడ్డార్ అంటూ హెచ్చిరించారు. దుండగులకు అదే ఆఖరి రోజు అవుతుందన్నారు. గంజాయి, డ్రగ్స్, తాగి ఆడబిడ్డల జోలికి వస్తే వదిలిపెట్టేదే లేదని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారు. 14,705 స్వయం సహాయక సంఘాలకు రూ. 1,8826.43 కోట్ల రుణాలను సీఎం చంద్రబాబు పంపిణీ చేశారు. స్త్రీ నిధి రుణాల పంపిణీ కింద రూ. 1000 కోట్ల చెక్ అందజేశారు. 100 మంది మహిళల విజయ గాధ పుస్తకాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. మహిళలకు ఎలక్ట్రిక్ ఆటోలను పంపిణీ చేశారు. మహిళల భద్రత, రక్షణ కోసం ఏర్పాటు చేసిన శక్తి యప్‌ను ప్రారంభించారు. చేనేత రథం, ఈ వ్యాపారి పోర్టల్ డెలివరీ మెదలుపెట్టారు. ప్రకాశం జిల్లా టూర్‌కు వెళ్లిన సీఎం చంద్రబాబుకు అక్కడి ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికారు.