
ఏపీ లిక్కర్ స్కామ్‌పై పోస్టర్ వార్
జగన్ మీద, మద్యం కుంభకోణం మీద టీడీపీ రూపొందించిన పోస్టర్లు ఎలా ఉన్నాయో చూడండి.
కూటమి అధికారంలోకి వచ్చి కొలువు దీరిన తర్వాత తొలుత తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై డాది కేసులను తెరపైకి తెచ్చారు. తర్వాత ముంబాయి సినీ నటి కాదంబరి జెత్వానీ కేసును తీసుకొచ్చారు. తర్వాత చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్‌ల మీద సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు కేసులను తెరపైకి తెచ్చారు. అనంతరం జగన్ సరస్వతీ పవర్ ప్రాజెక్టులో భూముల ఆక్రమణ కేసులు తెరపైకి తెచ్చిని కూటమి ప్రభుత్వం లిక్కర్ స్కామ్ మీద దృష్టి సారించింది. గత కొద్ది రోజులుగా ఈ కేసు ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారింది.
దీనిపైన కూటమి ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణను వేగవంతం చేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను విచారణ చేయడం, అరెస్టులు చేయడం ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించిన ఆరోపణలను, విషయాలను ప్రజలకు తెలియజేసేందుకు ఐటీడీపీ నడుం బిగించింది. జగన్ హయాంలో లిక్కర్ వ్యవహారంలో చోటు చేసుకున్న అనేక అంశాల మీద అనేక ఆరోపణలతో కూడిన పోస్టర్లు రూపొందించి సోషల్ మీడియాలో వరుసుగా అప్‌లోడ్ చేస్తున్నారు. ఆకర్షణీయంగా వీటిని రూపొందించడంలో తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇవే హాట్ టాపిక్‌గా మారాయి. వీటిపైన అటు టీడీపీ, ఇటు వైసీపీలకు చెందిన సానుభూతి పరులు స్పందిస్తున్నారు. టీడీపీ వాళ్లు జగన్ మీద కామెంట్లు చేస్తుంటే.. వైసీపీ వాళ్లు టీడీపీ వాళ్ల మీద కామెంట్లు పెడుతూ అధికారిక తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో కాక పుట్టిస్తున్నారు.
ఇది జగన్ లిక్కర్ ముడుపులు రూట్.. అంటూ శుక్రవారం ఈ పోస్టర్‌ను పెట్టారు. దీంతో పాటుగా ప్రజలకు ప్రాణాంతకమైన మద్యం అమ్మి కొట్టేసిన వేలకోట్లు జగన్ తరలించిన మార్గం చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి అంటూ పోస్టు పెట్టారు. దీనిపై స్పందించిన ఓ వైసీపీ సానుభూతి పరుడు స్పందించాడు. అదే నిజం అయితే.. అవే టక్రులు పసుపు రంగు వేసుకొని చంద్రబాబు ఇంటికి వెళ్తున్నాయట? కొత్త ఇల్లు భూమి పూజ చేసినప్పుడు అన్ని ట్రక్కులు పసుపు కలర్‌లో ఉన్నాయంట.. టక్రులో ఇసుక మాఫియాతో పాటు.. ఇసుకలో మద్యం మాఫియాని దాచి చంద్రబాబు దగ్గరికి వెళ్తున్నాయంట.. అంటూ కామెంట్ చేశాడు.
వైసీపీ మద్యం కుంభకోణంలో వేల కోట్ల డబ్బంతా జగన్‌కే వెళ్లిందని మరో పోస్టర్ పెట్టారు. దీంతో పాటుగా 2019 నుంచి 2024 మధ్య ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయి వ్యక్తి(జగన్), ప్రభుత్వ అధికారుల సహకారంతోనే మద్యం కుంభకోణం జరిగిందని సిట్ తేల్చింది. మద్యం సిండికేట్‌లో కసిరెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ సహా మరి కొందరు కీలక భాగస్వాములని నిర్థారణ చేసుకుంది అంటూ పోస్టు పెట్టారు. దీనికి వీడు కడుపుకి అన్నం తినడు..కరెన్సీ నోట్లు తింటాడు అంటూ టీడీపీ సానుభూతి పరుడు కామెంట్ చేశాడు.
ఓ రోజు క్రితం మరో పోస్టర్ పెట్టారు. ఏపీ లిక్కర్ స్కాంలక్ష విస్తుబోయే నిజాలు.. ఎవరా ముంబాయి హీరోయిన్? ఎవరా ఇద్దరు నేతలు? అంటూ పోస్టు పెట్టారు. దీనిపై ప్రభుత్వం మీదే..మీరే చెప్పాలి. మమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తారు? అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టగా.. భలేవాడివే అన్నీ చెబుతారు..అందరి లెక్కలు తేలుస్తారు అంటూ మరో నెటిజన్ స్పందించాడు.
పక్కా స్కెచ్‌తోనే లిక్కర్ స్కామ్ అంటూ శుక్రవారం ఓ పోస్టర్ పెట్టారు. రాష్ట్రంలో ఎంత మద్యం తయారవుతుంది? ఎంత అమ్ముడవుతుంది? ఎంత ఆదాయం వస్తుంది? ఈ లెక్కలు పక్కా ఉంటే అది స్కామ్ ఎందుకవుతుంది? అందుకే అప్పటి వరకు ఎక్సైజ్ శాఖ వాడే సాఫ్ట్‌వేర్‌ను పక్కన పడేశారు. వైసీపీ పెద్దలు చెప్పిన లెక్కలే ఎక్సైజ్ శాఖ రాసుకోవాలి. అలా ఐదేళ్ల పాటు జరిగింది ఈ దోపిడీ అంటూ పోస్టు పెట్టారు. దీనిపై ప్రజల ప్రాణాలు పెట్టుబడిగా పెట్టి జగన్ రిలీజ్ చేసిన లిక్కర్ మూవీ తొలి రౌండ్లోనే రూ. 4000 కోట్లు దోచుకుందని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు.
రాజ్ కసిరెడ్డి అరెస్టు సమయంలో ఓ పోస్టర్ పెట్టారు. జగన్ చెప్పాడు..నేను చేశాను. మద్యం స్కామ్ ఏ–1 నిందితుడు రాజ్ కసిరెడ్డి అంటూ పోస్టర్ పెట్టారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం స్కామ్‌లో జగనే సూత్రదారి అని ఏ–1 నిందితుడు రాజ్ కసిరెడ్డి మాటల్లో తెలుస్తోంది. నెల నెల వసూలు చేసిన డబ్బును ఆనాటి జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, విజయసాయిరెడ్డితో పాటు గోవిందప్ప బాలాజీ అనే మరో వ్యక్తికి ఇచ్చే వాడిని అని అతను ఒప్పుకున్నాడు. ఈ బాలాజీ అనే వ్యక్తి భారతి సిమెంట్స్ డైరెక్టర్ అంటూ పోస్టు పెట్టారు.
దాని కంటే ముందు మరో పోస్టు పెట్టారు. లిక్కర్ స్కాంలో జగన్‘నాటకాలు’ అంటూ పోస్టర్ పెట్టారు. దీంతో పాటుగా అడ్రస్ లేని కంపెనీ పెట్టి, వేల కోట్లు మద్యంలో దోచుకున్న జగన్ ‘నాటకాలు’ బట్టబయలవుతాయి. అంటూ పోస్టు పెట్టారు.
దాని కంటే ముందు స్కామ్ డబ్బుల కోసం బులియన్ ఖాతాలు షెల్ కంపెనీలు, రియల్ ఎస్టేట్ సంస్థలు అంటూ ఓ పోస్టర్ పెట్టారు. దీంతో పాటుగా మద్యం కుంభకోణంలో తీసుకున్న ముడుపులను అనేక అక్రమ మార్గాల ద్వారా దారి మళ్లించి దర్యాప్తు సంస్థలను దొరక్కుండా చేసేశారు. వీళ్లు చేసిన పనులు చూస్తుంటే ఎంత పెద్ద ఆర్థిక నేరగాళ్లయినా నోరెళ్లబెట్టాల్సిందే..అంటూ పోస్టు పెట్టారు.
Next Story