టీ20 వరల్డ్‌ కప్‌: పాక్‌పై భారత్‌ గెలుపు
x

టీ20 వరల్డ్‌ కప్‌: పాక్‌పై భారత్‌ గెలుపు

మహిళల టీ 20 ప్రపంచ కప్‌లో టీమ్‌ ఇండియా జూలు విదిల్చింది. తొలి మ్యాచ్‌లో న్యూజీలాండ్‌ చేతిలో ఘోర పరాజయం పాలైనా, సెకెండ్ మ్యాచ్లో పాక్‌పై గెలిచి సత్తా చాటింది.


మహిళల టీ20 ప్రపంచ కప్‌లో టీమ్‌ ఇండియా జట్టు అద్బుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ టోర్నీలో ఓటమితో ప్రస్థానం ప్రారంభించిన టీమ్‌ ఇండియా దానిలో నుంచి తేరుకొని గెలుపుతో ప్రపంచానికి తన సత్తాను చాటింది. తొలి విజయాన్ని తన ఖాతాలో జమ చేసుకుంది. మహిళల టీ20 ప్రపంచ కప్‌ టోర్నీ యుఏఈ వేదికగా జరుగుతోంది. తొలి మ్యాచ్‌ న్యూజిలాండ్‌తో జరిగింది. దీనిలో టీమ్‌ ఇండియా ఓటమి పాలైంది. అయితే రెండో మ్యాచ్‌లో తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. చిరకాల ప్రత్యర్థి అయిన పాక్‌తో రెండో మ్యాచ్‌ జరిగింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో టీమ్‌ ఇండియా స్పష్టమైన ఆధిపత్యం కనబరచింది. ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో సెమీస్‌కు చేరే అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.

ఈ మ్యాచ్‌లో తొలుత పాక్‌ జట్టు బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 20 ఓవర్లలో 106 పరుగులు చేసింది. 107 పరుగులు విజయ లక్ష్యంగా బరిలోకి దిగిన టీమ్‌ ఇండియా జట్టు కేవలం 18.5 ఓవర్లలోనే టార్గెటను బద్దలు కొట్టింది. 4 వికెట్లును కోల్పోయిన టీమ్‌ ఇండియా జట్టు 106 లక్ష్యాన్ని చేదించి విజేతగా నిలచింది.
ఓపెనర్‌గా బరిలోకి దిగిన సెఫాలీ వర్మ 35 బంతుల్లో 32 పరుగులు సాధించింది. ఇందులో 3 ఫోర్లు సాధించింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 29 పరుగులు సాధించింది రిటైర్డ్‌ హర్ట్‌గా మిగిలింది. జెమీమా రోడ్రిగ్స్‌ 23 పరుగులు సాధించింది. పాక్‌ బౌలర్లలో ఫాతిమా, రెండు వికెట్లు తీయగా, సాదియా ఇక్బాల్, ఒమైమా తలో వికెట్‌ పడగొట్టారు.
అత్యంత ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్‌లో పాక్‌ టాస్‌ గెలిచింది. బ్యాటింగ్‌ను ఎంచుకుంది. అయితే టీమ్‌ ఇండియా బౌలర్లు పాక్‌ను బాగానే కట్టడి చేశారు. మిడిల్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగిన నిదా దర్‌ 28 పరుగులు, ఓపెనర్‌గా దిగిన మునీబా ఆలీ 17, ఫాతిమా సనా 13,అరూబ్‌ షా 14 పరుగులు సాధించారు. భారత బౌలర్లు శ్రేయంకా పాటిల్‌ రెండు, అరుంధతి 3 వికెట్లు పడగొట్టారు. రేణుకా సింగ్, దీప్తి శర్మ, ఆశా శోభన తలో వికెట్‌ పడగొట్టారు. అయితే పాక్‌పై విజయంతో మంచి ఊపు మీద ఉన్న టీమ్‌ ఇండియా అక్టోబరు 9న శ్రీలంకతో తలపడనుంది.
Read More
Next Story