పోస్టులెన్నో  చెప్పకుండా ఇదేమి జాబ్ క్యాలండర్ భట్టీ  ?
x

పోస్టులెన్నో చెప్పకుండా ఇదేమి జాబ్ క్యాలండర్ భట్టీ ?

వివిధ ఉద్యోగాలకు ఎప్పుడెప్పుడు పరీక్షలు నిర్వహిస్తామన్న విషయాన్ని ప్రకటించారు. అయితే ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న విషయాన్ని మాత్రం ప్రకటించలేదు.


తెలంగాణా ప్రభుత్వం 2024-25 జాబ్ క్యాలండర్ను అసెంబ్లీలో ప్రకటించింది. బడ్జెట్ సమావేశాల చివరిరోజున అంటే శుక్రవారం నాడు వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం జాబ్ క్యాలండర్ను ప్రకటించింది. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జాబ్ క్యాలండర్ను ప్రకటించారు. ఏ ఏ శాఖల్లో తమ ప్రభుత్వం ఉద్యోగాలను ఎప్పుడెప్పుడు భర్తీ చేయబోతోందనే విషయాన్ని ఉపముఖ్యమంత్రి ప్రకటించారు. జాబ్ క్యాలండర్ను ప్రకటించేసి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలుపుకున్నామని చేతులు దులిపేసుకున్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే వివిధ ఉద్యోగాలకు ఎప్పుడెప్పుడు పరీక్షలు నిర్వహిస్తామన్న విషయాన్ని ప్రకటించారు. అయితే ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న విషయాన్ని మాత్రం ప్రకటించలేదు.

ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న విషయాన్ని చెప్పకుండా పరీక్షలు ఎప్పుడెప్పుడు నిర్వహిస్తామని ప్రకటించటంలో అర్ధమేంటో భట్టీయే చెప్పాలి. ఉదాహరణకు గ్రూప్-1 పోస్టులకు నోటిఫికేషన్ ఎప్పుడిచ్చారు ? దాని పరీక్షను ఎప్పుడు నిర్వహించబోతున్నారనే విషయాన్ని ప్రకటించారు. అలాగే వివిధ శాఖల్లోని ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అవబోయే తేదీలను, పరీక్షలు నిర్వహించబోయే తేదీలను కూడా భట్టి ప్రకటించారు. ఇంతవరకు బాగానే ఉంది కాని అసలు విషయం అంటే ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారన్న విషయాన్ని మాత్రం ప్రకటించలేదు. అసలు విషయమంతా భర్తీ చేయబోయే ఉద్యోగాల సంఖ్యలోనే కదా ఉంటుంది. ఇపుడు ప్రకటించిన జాబ్ క్యాలండర్ తో పాటే శాఖల వారీగా భర్తీ చేయబోయే ఉద్యోగాల సంఖ్యను కూడా ప్రకటించుంటే నిరుద్యోగులకు పూర్తి క్లారిటి ఉండేది.




భర్తీ చేయబోయే ఉద్యోగాల ఖాళీలను బట్టే తాము ఏ ఉద్యోగానికి కోచింగ్ తీసుకోవాలి ? ఏ ఉద్యోగంలో చేరాలన్న విషయాన్ని నిరుద్యోగులు డిసైడ్ చేసుకుంటారు. ఎందుకంటే తక్కువ సంఖ్యలో భర్తీ అయ్యే ఉద్యోగాలకు ఎంపికయ్యే అవకాశాలు కూడా తక్కువగానే ఉంటాయి. ఉదాహరణకు 583 గ్రూప్-1 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం గతంలోనే నోటిఫికేషన్ ఇచ్చింది. దాని ప్రకారం లక్షల్లో దరఖాస్తులొచ్చాయి. అంటే ఉద్యోగాలు తక్కువగా ఉన్నప్పటికీ దరఖాస్తులు చేసుకున్న అభ్యర్ధులు మాత్రం లక్షల్లో ఉన్నారు. ఉద్యోగాల సంఖ్యను బట్టి తాము గ్రూప్-1 పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలా ? లేకపోతే ఇంతకన్నా ఎక్కువ ఉద్యోగాలుండే గ్రూప్-2 లేదా గ్రూప్-3కి దరఖాస్తు చేసుకోవాలా అన్న విషయంలో అభ్యర్ధులకు అవకాశం ఉంటుంది.

ఇపుడు ప్రకటించిన జాబ్ క్యాలండర్లో ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న విషయాన్ని ప్రభుత్వం ప్రకటించకపోవటంతో దరఖాస్తులు చేయాలని అనుకునే అభ్యర్ధులకు ఛాయిస్ తగ్గిపోతుంది. ఇదే విషయమై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతు ఉద్యోగాల ఖాళీలను ప్రకటించకుండా ప్రభుత్వం మోసం చేసిందన్నారు. అందుకనే దీన్ని జాబ్ క్యాలండర్ అని కాకుండా అబీడ్స్ లో దొరికే క్యాలండర్ లాగుందని ఎద్దేవా చేసింది. దీనికి భట్టి సమాధానమిస్తు భర్తీ చేయబోయే ఉద్యోగాల ఖాళీలను నోటిఫికేషన్ సమయంలో ప్రకటిస్తామని చెప్పారు. ఇక్కడే భట్టీ ప్రకటన ఆశ్చర్యంగా ఉంది. ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తారనే విషయంలో ప్రభుత్వానికి క్లారిటి ఉంటుంది. పైగా ఏ శాఖలో ఎంతమంది ఉద్యోగులు ఎప్పుడెప్పుడు రిటైర్ అవబోతున్నారనే విషయం కూడా ప్రభుత్వానికి ముందే తెలిసిపోతుంది. అలాంటపుడు జాబ్ క్యాలండర్ ప్రకటన సమయంలోనే శాఖల వారీగా భర్తీ చేయబోయే ఉద్యోగాల సంఖ్యను కూడా ఇచ్చుంటే బాగుండేది.



ఇపుడు ప్రకటించిన జాబ్ క్యాలండర్లో శాఖల వారీగా భర్తీచేయబోయే ఉద్యోగాల సంఖ్యను ప్రకటించటంలో ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమిటో అర్ధంకావటంలేదు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీచేస్తామని దాదాపు ఏడాది క్రితమే ప్రకటించగలిగిన రేవంత్ రెడ్డి భర్తీ చేయబోయే ఉద్యోగాల సంఖ్యను రహస్యంగా ఉంచటమే విచిత్రంగా ఉంది. ఏదేమైనా ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలండర్ పై నిరుద్యోగులు ఏమంతా సంతృప్తిగా అయితే లేరు. మరీ విషయంలో ప్రభుత్వం ఏమన్నా పునరాలోచిస్తుందేమో చూడాలి.

Read More
Next Story