ఆంధ్రప్రదేశ్ లో స్విగ్గీ సేవలు బంద్!
x

ఆంధ్రప్రదేశ్ లో స్విగ్గీ సేవలు బంద్!

ఆంధ్రప్రదేశ్ లో ఫుడ్ లవర్స్ కి ఈ వార్త పెద్ద షాకే. స్విగ్గీ యాజమాన్యంపై ఆంధ్రప్రదేశ్ హోటళ్లు, రెస్టారెంట్ల యాజమానులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే...


స్విగ్గీ యాప్ ను ఓపెన్ చేసి ఇలా ఫోన్ తీసుకుని అలా ఫుడ్ ఆర్డర్ చేస్తే ఓ అరగంటలో వచ్చేస్తోంది. స్విగ్గీ బాయ్ ఫుడ్ డెలివరీ చేసి మనకో నమస్కారం పెట్టి పోతుంటాడు. ఇకపై ఆంధ్రప్రదేశ్ లో ఆ పరిస్థితి ఉండదట. స్విగ్గీ సిబ్బంది ఆంధ్రప్రదేశ్ హోటళ్ల యాజమాన్యాలను నానా తిప్పలు పెడుతున్నాయట. దాంతో స్విగ్గీని బహిష్కరించాలని ఆంధ్రప్రదేశ్‌ హోటళ్ల యాజమాన్యాలు నిర్ణయం తీసుకున్నాయి.

సహజంగా మనం ఫుడ్ ఆర్డర్ చేసిన వెంటనే మొబైల్ నుంచి డబ్బులు చెల్లిస్తుంటాం. అవి స్విగ్గీ ఎకౌంట్ కి వెళతాయి. ఫుడ్ తీసుకున్న వెంటనే ఆ హోటల్ యాజమాన్యానికి డబ్బులు చెల్లిస్తుండడం ఆనవాయితీ. అయితే ఇటీవలి కాలంలో స్విగ్గీ డబ్బులు చెల్లించడం మానేశాయట. దీంతో హోటల్ యాజమాన్యాలు మండిపోతున్నాయి. ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేకపోవడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్టు హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్వీ స్వామీ, కమిటీ కన్వీనర్ రమణారావు చెప్పారు.
నగదు చెల్లింపులు చేయకుండా ఇబ్బందిపెడుతున్న స్విగ్గీ ని దూరం పెట్టాలని హోటల్‌, రెస్టరంట్‌ యాజమాన్యాలు నిర్ణయించినట్టు తెలిపారు. స్విగ్గీకి ఈ నెల 14 నుంచి అమ్మకాలు నిలిపివేయాలని అసోసియేషన్‌ నిర్ణయం తీసుకుంది. ‘‘స్విగ్గీ, జొమాటో వల్ల హోటళ్లు, రెస్టారెంట్లకు నష్టం జరుగుతోంది. ఈ రెండు సంస్థల యాజమాన్యాలతో గతంలో చర్చలు జరిపాం. మా అభ్యంతరాలను జొమాటో మాత్రమే అంగీకరించింది. స్విగ్గీ అంగీకరించలేదు. అందువల్ల స్విగ్గీని బాయ్ కాట్ చేస్తున్నాం’’ అని ఆర్‌వీ స్వామి, కమిటీ కన్వీనర్ రమణారావు తెలిపారు.
స్విగ్గీకి ఎక్కువగా ఆర్డర్లు ఉండడంతో ఆ యాజమాన్యం పట్టించుకుంటున్నట్టు లేదు. మరోపక్క, కస్టమర్లు మాత్రం స్విగ్గీ లేకపోయినా జొమాటో ఉంది కదా అని ఊపిరిపీలుస్తున్నారు. అనుకున్న సమయం కన్నా ఇంకో అరగంట ఆలస్యమైనా ఎదురుచూద్దాం లెమ్మనే ధోరణే ఎక్కువగా వినియోగదారుల్లో కనబడుతోంది. బయటకి పోయే వాళ్ల సంఖ్య తక్కువ కావడం వల్ల ఈ డెలివరీ సంస్థలకు గిరాకీ పెరిగింది.


Read More
Next Story