బెట్టింగ్ జోరు పెంచుతున్న సర్వేలు..!?
x

బెట్టింగ్ జోరు పెంచుతున్న సర్వేలు..!?

సార్వత్రిక ఎన్నికల సర్వేలు బెట్టింగ్ జోరు మరింత పెంచుతున్నట్లు కనిపిస్తోంది. పోలింగ్ గడువు సమీపించే కొద్దీ మరింత ఎక్కువ అయ్యేలా ఉంది. కౌంటింగ్ ముగిశాక ఎంతమంది జేబులు గుల్లవుతాయనేది వెల్లడవుతుంది.


సంక్రాంతి వస్తే కోడి పందాలు. సమ్మర్ వస్తే ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్‌లతో పాటు ఇప్పుడు ఎన్నికలు కూడా పందెంరాయుళ్ల జోరుని పెంచుతున్నాయి. ఇప్పటికే రూ. కోట్లు చేతులు మారినట్లు తెలుస్తోంది. కౌంటింగ్ గడువు సమీపించే కొద్దీ ఈ వ్యవహారం మరింత జోరు అందుకునే వాతావరణం ఉందని భావిస్తున్నారు.

ఆంధ్ర పొలిటికల్ లీగ్ పోటీలో విజేత ఎవరు? ఏ నియోజకవర్గంలో ఎవరికి ఎంత మెజార్టీ వస్తుంది?? ఫలానా అభ్యర్థి గెలుస్తాడు.! మెజార్టీ తగ్గుతుంది. ఈసారి ఎన్నికల్లో కూటమిదే విజయం. కాదు..! వైఎస్. జగన్.. సీఎం కావడం తథ్యం..!! ప్రస్తుతం రాష్ట్రంలోని బెట్టింగ్ రాయుళ్ల తీరు ఇది. పోలింగ్ జరగడానికి ముందు, ఆ తర్వాత వివిధ సంస్థలు, పార్టీలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న సర్వేల అంచనాలు కూడా బెట్టింగ్ రాయుళ్లను మరింత రెచ్చగొడుతున్నట్లు కనిపిస్తోంది.

ఐపీఎల్ ను తలదన్నే రీతిలో బెట్టింగ్

ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌ను తలదన్నే రీతిలో ఆంధ్ర రాజకీయ నాయకులపై ఒకరిని మించి ఒకరు పోటీ పడ్డారు. వేలు, లక్షలు పందాలు కాస్తున్నట్లు సమాచారం. వాస్తవంగా ఇలా బెట్టింగ్లకు పాల్పడడం చట్టరీత్యా నేరం. లోపాయికారీగా మాటలు, ఒప్పందాలు, చేతులు మారుతున్న డబ్బు రహస్యంగా జరుగుతున్న వ్యవహారం ఇది. ఈ సమాచారం పోలీసుల వరకు చేరడం లేదు. కారణం వ్యక్తులు పార్టీల మధ్య సాగుతున్న బెట్టింగ్లు భారీ స్థాయిలో ఉన్నట్లు చెబుతున్నారు.

ఈనెల 13వ తేదీ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. సగం రాత్రి వరకు కొన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. 14వ తేదీ మధ్యాహ్నానికి కానీ రాష్ట్రంలో పోలింగ్ శాతం ఎంత అనేది వెల్లడి కాలేదు. అంతే..! ఆ తర్వాతే ఎన్నికలపై పిచ్చి, నాయకులపై ఉన్న వీరాభిమానం, పార్టీలపై ఉన్న అత్యంత అభిమానంతో ఔత్సాహికులు కౌంటింగ్ వరకు కూడా ఆగలేక పోతున్నామని చెప్పకనే చెబుతున్నారు. అధికార వైఎస్ఆర్సిపి, ప్రతిపక్ష టిడిపి అభ్యర్థులుగా పోటీ చేసిన విఐపిలపైన లక్షలు, కోట్ల కూడా పందాలు కాస్తున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల్లో ప్రధాన నాయకులుగా భావించే వారి మెజారిటీల పైన కూడా పందాలు జోరుగా సాగుతున్నాయని, ఇప్పటికే రూ. కోట్లాది బెట్టింగ్ పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.

పులివెందుల నుంచి పిఠాపురం వరకు..

2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటు స్థానాలకు పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో

అధికార ప్రతిపక్ష పార్టీల నుంచి సారథ్యం వహిస్తున్న ఇద్దరు రాయలసీమ ప్రాంతానికి చెందినవారే. వారిలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా పులివెందులకు చెందిన వ్యక్తి. టిడిపి అధ్యక్షుడు ఎన్. చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు. కూటమిలో భాగస్వామి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి బరిలో ఉన్నారు. ఈ వివరాలు అందరికీ తెలిసినవే!

కాయ్ రాజా కాయ్..

పులివెందుల అసెంబ్లీ స్థానంలో ఈసారి 81.86 శాతం పోలింగ్ నమోదయింది. 2014 ఎన్నికలతో పోలిస్తే 2019లో నాలుగు శాతం ఓటింగ్ పెరిగింది. గత ఎన్నికలతో పోలిస్తే 2024 ఎన్నికల్లో రెండు శాతం పోలింగ్ జరిగినట్లు నమోదైన ఓట్లు చెబుతున్నాయి. దీనికి తోడు ఈసారి ఎన్నికల్లో కడప ఎంపీ స్థానం నుంచి సీఎం వైఎస్. జగన్ సోదరి వైఎస్. షర్మిల పోటీ చేయడం ఎన్నికల్లో వేడిని రాజేసింది. ఈ కారణాల రీత్యా సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డికి ఎంత మెజారిటీ వస్తుంది? కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి? మెజార్టీని ఎంత ప్రభావితం చేయగలరు. అనే విషయంలో బెట్టింగులు జరిగాయని తెలుస్తోంది.

కుప్పంలో చంద్రబాబునాయుడుకు మెజార్టీ తగ్గుతుందని కొందరు, పెరుగుతుందని ఇంకొందరు పోటా పోటీగా రూ. లక్షలు పందెం కాసినట్లు సమాచారం. కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు ఎనిమిదో సారి అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధికంగా పోలింగ్ నమోదైన నియోజకవర్గాల్లో కుప్పం 89.88 శాతం రెండో స్థానంలో ఉంది. ఇదే సర్వత్రా ఉత్కంఠకు దారితీసింది. ఇక్కడ వైఎస్ఆర్సిపి నాయకులు ప్రధానంగా దృష్టి పెట్టారు. ఓల్డ్ మేనేజ్మెంట్ జరిగిందని చెబుతున్నారు. పెరిగిన ఓటింగ్ శాతం ఎవరికి లాభం? ఎవరికి నష్టం? ఇక్కడ పాగా వేస్తామని చెబుతోంది. మాత్రం సాధ్యం కాదని టిడిపి సవాల్ చేస్తోంది. ఈ వ్యవహారం భారీ బెట్టింగులకు దారి తీసినట్లు అంచనా వేస్తున్నారు.

పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ మెజార్టీ లక్షకు తగ్గదని కొందరు నాయకులు, 50 వేలకు పైబడుతుందని ఇంకొందరు కోట్లాది రూపాయలు పందాలు కాసినట్లు చెబుతున్నారు. ఈ ప్రాంతానికి చెందిన ఓ మాజీ మంత్రి, ప్రస్తుతం వైఎస్ఆర్సిపి నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి ఒకరు రూ. 40 కోట్లు పందెం కాశారనే వార్తలు ఇటీవల మీడియాలో వైరల్ అయ్యాయి. అది ఎంతవరకు నిజమనేది మాత్రం ఎక్కడ తేలలేదు. "ఇది ఒక రకంగా హైప్ క్రియేట్ చేయడం కూడా అని అంచనా" వేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో రూ. వందల కోట్లు బెట్టింగ్ జరిగిందనే వార్తలు షికారు చేస్తున్నాయి.

వీరికి తోడు మంగళగిరిలో పోటీ చేస్తున్న నారా లోకేష్, రఘురామకృష్ణంరాజు, నంద్యాల అసెంబ్లీ పార్లమెంటు స్థానాల్లో కూడా బెట్టింగుల జోరు పెరిగినట్లు సమాచారం. చివరాఖరికి కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థిగా పోటీ చేసిన పార్థసారథి, వైయస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వైఎస్ ప్రసాదరెడ్డికి గట్టి పోటీ ఉందని అంచనా వేశారు. సర్వే ఫలితాలు అంతుచిక్కని స్థితిలో వారి గెలుపు ఓటములపై పందాలు కాశారని తెలుస్తోంది. ప్రధానంగా ఎస్ కే డి కాలనీ, షరీఫ్ బజార్‌తోపాటు మార్కెట్ యార్డు ప్రాంతానికి చెందిన వ్యాపారులు కూడా ఉత్సాహంగా బెట్టింగులు కాశారనేది సమాచారం. ఇదిలా ఉండగా పెరిగిన ఓటింగ్ శాతం తాను అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలకు ఫలితమే అని వైఎస్ఆర్సిపి ధీమా వ్యక్తం చేస్తోంది. కొత్త ఓటర్లు, ఉద్యోగులు, ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత మొత్తం తమకు అనుకూలిస్తుందని టిడిపి కూటమి అంచనా వేస్తోంది. పెరిగిన ఓటింగ్ శాతం దేనికి సంకేతం అనేది ఎవరికి తోచిన తీరుగా వారు విశ్లేషించుకుంటున్నారు. అయితే..

సర్వేల అంచనాలతో..

రాష్ట్రంలోని కొత్త, పాతతరం సెఫాలజిస్టులు ఇస్తున్న అంచనాలు ఒకపక్క. వివిధ జాతీయ స్థాయి, స్థానిక సంస్థల సర్వే నివేదికలు, లెక్కలు ఎవరికి తోచిన తీరుగ వారు విశ్లేషణలతో ఊదరగొడుతున్నారు. వీటన్నిటినీ పరిశీలిస్తున్న రాజకీయాలంటే వల్లమాలిన పిచ్చి ఉన్న కొందరు.. స్థానిక పరిస్థితులను అంచనా వేసుకుంటున్నారు. వాటన్నిటినీ క్రోడీకరించి తమకు ఉన్న అంచనాలతో ఏ నాయకుడు ఎంత మెజారిటీతో గెలుస్తారు. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి. ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అనే స్థాయి వరకు వెళ్లినట్లు వాతావరణం కనిపిస్తుంది. నెల్లూరు జిల్లాలోని ఓ నియోజకవర్గంలో ఒక అభ్యర్థి గెలుస్తారనే ధీమాతో ఉన్నారు. ఆయన పోటీ చేసిన అభ్యర్థి సెంటిమెంట్ అవసరాన్ని ప్రయోగించారు. అది బాగా ఉపయోగపడుతుంది. అని చెబుతూ, సోషల్ మీడియాలో సర్వేలతో ఊదరగొడుతున్నారు. ఇది కాస్త భారీ బెట్టింగ్లకు దారి తీసింది అని భావిస్తున్నారు. అంతేకాకుండా చిత్తూరు జిల్లాలో కూడా.. తిరుపతి, పుంగనూరు, మదనపల్లి, పలమనేరు నియోజకవర్గాలు హాట్ సీట్లుగా మారాయి. ఇక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థుల మెజారిటీతోపాటు విజయ అవకాశాలపై కూడా భారీగానే బెట్టింగ్లు జరిగినట్టు తెలుస్తోంది. వాట్సాప్ గ్రూప్లు, సోషల్ మీడియాలో వెలువడుతున్న సర్వేల అంచనాలను చూసి, రాజకీయ ఉత్సాహికులు

రూ.లక్షల కోట్లలో పందాలు కాస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పోలింగ్ ముగిసిన తర్వాత, కేంద్ర ఎన్నికల సంఘం మరసటి రోజు మధ్యాహ్నానికి కానీ పూర్తిస్థాయిలో ఎంత శాతం పోలైంది ప్రకటించలేకపోయింది. ఆ తర్వాత నుంచి రాష్ట్రంలో బెట్టింగులకు తెరతీశారని చెబుతున్నారు. ఈ వ్యవహారం కౌంటింగ్ మొదలయ్యే ముందు రోజు వరకు కూడా మరింత జోరు అందుకునే పరిస్థితి లేకపోలేదు. ఆ తర్వాత కూడా ప్రతి రౌండ్లో వచ్చే ఫలితం ఆధారంగా బెట్టింగ్ జరుగుతుందని తెలుస్తోంది. కౌంటింగ్ తర్వాత ఎంతమంది జోబులు గుల్లవుతాయో వేచి చూడాలి. డబ్బులు చేతులు మారడంలో అయ్యే జాప్యం, వ్యక్తుల మధ్య జరిగే వాగ్వివాదాల తర్వాత కానీ ఈ బెట్టింగ్ల వ్యవహారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉండదు. అంతవరకు అంతా రహస్యంగానే ఉంటుందని సందేహం లేదు.

Read More
Next Story