సురేఖ తప్పు మాట్లాడలేదు ..లాయర్ సమర్ధన
x

సురేఖ తప్పు మాట్లాడలేదు ..లాయర్ సమర్ధన

‘పండుకో’ అంటేనే అవతలి వాళ్ళ పరువుకు భంగం కలిగినట్లు లెక్కట. మంత్రి ఎక్కడా పండుకో అన్నపదం ఉపయోగించలేదు కాబట్టి సురేఖ తప్పు మాట్లాడలేదన్నది లాయర్ వాదన.


మంత్రి కొండా సురేఖకు సరిగ్గా సరిపోయింది ఈ లాయర్. సెలబ్రిటీ కపుల్ సమంత-నాగచైతన్యల విడాకులపై చాలా అసభ్యంగా సురేఖ మాట్లాడిన విషయం అందరికీ తెలిసిందే. వీళ్ళ విడాకులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే కారణమని మంత్రి ఆరోపించారు. వాళ్ళు విడాకులు తీసుకోవటానికి కేటీఆర్ ఏ విధంగా కారణమో కూడా మీడియా సమావేశంలోనే మంత్రి వివరించారు. నిజానికి మంత్రి చెప్పిన కారణం వినటానికే చాలా ఇబ్బందిగా అనిపించింది. అలాంటిది ఆ కారణాన్ని మంత్రి పదేపదే ఆరోపించటం తెలుగురాష్ట్రాల్లో అప్పట్లో సంచలనమైంది. దానిపై తమ పరువుకు భంగం కలిగించారని అక్కినేని నాగార్జున, కేటీఆర్ విడివిడిగా మంత్రికి లీగల్ నోటీసులు పంపించారు.

నాగార్జున అయితే మంత్రిపై నాంపల్లి కోర్టులో కేసే వేశారు. ఆ కేసుపై మంగళవారం కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా నాగార్జున, అమల దంపతులు కోర్టుకు హాజరయ్యారు. విచారణ తర్వాత కొండాసురేఖ వ్యాఖ్యలు, ఆరోపణలపై లాయర్ ఒక ఛానల్ తో మాట్లాడిన మాటలు ఇపుడు బాగా వైరల్ అవుతోంది. ఇంతకీ లాయర్ ఏమి అన్నారంటే మంత్రి ఏమీ తప్పు మాట్లాడలేదట. ‘పండుకో’ అంటేనే అవతలి వాళ్ళ పరువుకు భంగం కలిగినట్లు లెక్కట. మంత్రి ఎక్కడా పండుకో అన్నపదం ఉపయోగించలేదు కాబట్టి సురేఖ తప్పు మాట్లాడలేదన్నది లాయర్ వాదన. పండుకో అని కాని అసభ్యపదజాలంకాని మంత్రి వాడలేదని లాయర్ అన్నారు. ‘అక్కినేని కుటుంబానికి చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చకుండా ఉండాలంటే సమంతను తన దగ్గరకు పంప’మని నాగార్జునను కేటీఆర్ అడిగారు అని మంత్రి చాలా స్పష్టంగా ఆరోపించారు. ఇంతకన్నా అసభ్యకరం ఏముంటుంది ? ఈ విషయంలో లాయర్ కు ఎక్కడా అసభ్యత కనబడలేదా ?

కన్వెన్షన్ సెంటర్ ను కూల్చకూడదంటే, సమంతను పంపమని నాగార్జునను కేటీఆర్ అడిగారంటే ఎందుకు పంపమని అన్నారని లాయర్ ఉద్దేశ్యం. కాఫీ లేదా టీ తాగటానికి సమంతను పంపమని నాగార్జునను కేటీఆర్ అడిగుంటారని లాయర్ ఉద్దేశ్యమా ? పరాయి మగవాడి భార్యను తన దగ్గరకు పంపమని ఎవరైనా అడిగితే జనాలకు ఎలాంటి అర్ధం స్పురిస్తుందో ఈ లాయర్ కు తెలీదా ? అందులో లాయర్ కు అసభ్యత వినిపించటంలేదా ? మంత్రి వ్యాఖ్యల్లో ఎక్కడ కూడా నాగార్జున ఫ్యామిలీని అవమానించలేదట. మంత్రి వ్యాఖ్యలు తమను అవమానించేట్లుగా ఉన్నాయని నాగార్జున ఫ్యామిలి చెప్పటమే పెద్ద జోకట.

మంత్రి మాటల్లో ఎక్కడా తప్పులేదు కాబట్టి పరువుకు భంగం కలిగించటమనే ప్రస్తావనే లేదని లాయర్ అన్నారు. పరువుకు భంగం కలిగినపుడు మాత్రమే పరువుతక్కువ అన్న ప్రస్తావన వస్తుందని లాయర్ వివరించారు. మంత్రి ఆరోపణల్లో చెడ్డమాటలన్నదే ఎక్కడా ఉపయోగించలేదని లాయర్ చెప్పారు. మరి మంత్రి ఎందుకు క్షమాపణ చెప్పారంటే సమంత సెలబ్రిటీ కాబట్టి ఆమె ఇగో హర్ట్ అయ్యిందని తెలిసి ఇగోను హర్ట్ చేసినందుకు మాత్రమే మంత్రి క్షమాపణ చెప్పారని లాయర్ వివరించారు. కేటీఆర్ ఇదంతా క్రియేట్ చేస్తున్నాడన్న కోపంతో మాత్రమే మంత్రి ఇదంతా మాట్లాడారు కాని ఇందులో అసలు ఏమీలేదని లాయర్ తేల్చేశారు.

పరువుకు భంగం కలిగించినట్లుగా కొండా సురేఖ ఎక్కడా మాట్లాడలేదు కాబట్టి సురేఖపైన వేసిన కేసు కొట్టేస్తారని లాయర్ చాలా ధీమాగా చెప్పారు. మంత్రి తప్పు ఏమీ మాట్లాడకపోయినా వీళ్ళే వక్రీకరించి, మ్యానుప్లేట్ చేసి చాలా హంగామా చేసినట్లు లాయర్ ఆరోపించారు. టాలీవుడ్ అంతా దిగేసి మంత్రికి వ్యతిరేకంగా భయంకరమైన స్టేట్ మెంట్లు ఇచ్చినట్లు మండిపడ్డారు. 24 క్రాఫ్ట్స్ అంటే అందరికీ తెలిసిందే కదాని ఎదురు ప్రశ్నించారు. సినిమా ఫీల్డంటే, హీరోలు, హీరోయిన్లంటే అందరికీ తెలిసిన విషయమే అని లాయర్ చాలా తేలిగ్గా చెప్పేశారు. ప్రత్యేకంగా ఎవరూ చెప్పాల్సిన అవసరంలేదన్నారు. మొత్తానికి సురేఖ ఈ లాయర్ సరిగ్గా సరిపోయారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

కేసు నిలబడదు

కొండా సురేఖ మీద అక్కినేని నాగార్జున వేసిన పరువునష్టం దావా కేసు నిలబడదని మంత్రి తరపు లాయర్ తిరుపతి వర్మ చెప్పారు. మంత్రిమీద వేసిన పరువునష్టం దావా కేసులో నాగార్జున, నాగచైతన్య, సాక్షి సుప్రియ వేసిన మూడు పిటీషన్లలోని అంశాలు వేర్వేరుగా ఉన్నట్లు చెప్పారు. ఒకే అంశంపై ముగ్గురి వాదనలు వేర్వేరుగా ఉన్న కారణంగా అక్కినేని ఫ్యామిలీ వేసిన కేసు నిలబడదని తాను అనుకుంటున్నట్లు వర్మ అభిప్రాయపడ్డారు. 10వ తేదీన మరో సాక్షిని ప్రొడ్యూస్ చేస్తామని చెప్పారని ఆ సాక్షి ఇచ్చే వాగ్మూలాన్ని కూడా చూసిన తర్వాత తాము లీగల్ గా ఎలా పోరాడాలనే విషయంపై నిర్ణయం తీసుకుంటామని తిరుపతి వర్మ చెప్పారు.

Read More
Next Story