
సురవరం గొప్ప మానవతా వాది
సభకు హాజరైన పలు పార్టీల ప్రముఖ నాయకులు
సీపీఐ ప్రముఖ నాయకులు సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభ విజయవాడ సీపీఐ స్టేట్ కార్యాలయం దాసరి భవన్ లో గురువారం జరిగింది. ఈ సభకు ముఖ్యమైన పార్టీల నాయకులంతా హాజరయ్యారు. సుధాకర్ రెడ్డి భార్య సురవరం విజయలక్ష్మి తన జ్నాపకాలను ఈ సందర్భంగా పంచుకున్నారు. సభకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అధ్యక్షత వహించారు. ముందుగా సుధాకర్ రెడ్డి చిత్రపటానికి పూలు చల్లి నాయకులు నివాళులర్పించారు.
సభలో పాల్గొన్న వారిలో సీపీఐ నాయకులు రామకృష్ణతో పాటు ముప్పాళ్ల నాగేశ్వరరావు, రావులపల్లి రవీంద్రనాధ్, కేవీవీ ప్రసాద్, కాంగ్రెస్ నాయకులు డాక్టర్ కేవీపీ రామచంద్రరావు, వైఎస్సార్సీపీ నాయకులు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ నాయకులు టీడీ జనార్థన్ రావు, సీపీఎం మాజీ రాష్ట్ర కార్యదర్శి పి మధు, సీపీఐ ఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి పి ప్రసాద్, సీపీఐ ఎంఎల్ న్యూ డెమొక్రసీ రాష్ట్ర కార్యదర్శి జాస్తి కిశోర్ లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సురవరం సుధాకర్ రెడ్డితో ఉన్న సన్నిహిత సంబంధాలను కేవీపీ, బొత్స వంటి వారు పంచుకున్నారు. ఆయన తన ఆశయ సాధన కోసం చేసిన కృషి, పార్లమెంట్ సభ్యునిగా పార్లమెంట్ లో తన వాణి ప్రజల కోసం వినిపించిన అంశాలను ప్రస్తావించారు. పలు సందర్భాల్లో జరిగిన సభలు, సమావేశాల్లో కలిసామని, ఆయన పలకరింపు ఎంతో ఆప్యాయతతో కూడుకుని ఉంటుందని పేర్కొన్నారు.
సభకు సుధాకర్ రెడ్డి అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.