ట్రిపుల్‌ ఆర్‌ సక్సెస్‌..జగన్‌ కేసులో సుప్రీం కోర్టు కీలక నిర్ణయం
x

ట్రిపుల్‌ ఆర్‌ సక్సెస్‌..జగన్‌ కేసులో సుప్రీం కోర్టు కీలక నిర్ణయం

అక్రమాస్తుల కేసుకు సంబంధించి జగన్‌కు, రఘురామకృష్ణరాజుకు మధ్య సుప్రీం కోర్టులో హోరా హోరీ యుద్ధం కొనసాగుతోంది.


మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేసు అంశంలో సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వైఎస్‌ జగన్‌ బెయిల్‌ రద్దు, జగన్‌ కేసులను విచారణ చేస్తున్న ధర్మాసనాన్ని మార్చాలని కోరుతూ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు గతంలో దాఖలు చేసిన పిటీషన్‌పై సుప్రీం కోర్టు స్పందించింది. పిటీషన్‌ను పరిగణలోకి తీసుకున్న సుప్రీం కోర్టు జగన్‌ కేసును విచారిస్తున్న ధర్మాసనాన్ని మార్పు చేయాలని నిర్ణయించింది. జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా, జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌ ధర్మాసనం జగన్‌ కేసును విచారిస్తోంది. రఘురామకృష్ణరాజు అభ్యర్థన మేరకు ఆ ధర్మాసనాన్ని తప్పించి జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ సతీష్‌ చంద్రశర్మ ధర్మాసనానికి జగన్‌ కేసును అప్పగించింది.

వ్యాపారాల లావాదేవీలకు సంబంధించి 2019లో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా నర్సాపూర్‌ ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణరాజుకు, నాటీ సీఎం జగన్‌కు మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. ఇవి పెరిగి పెద్దవి కావడంతో జగన్‌ మీద రఘురామకృష్ణ రాజు తిరుగుబాటుకు దిగారు. జగన్‌ను, జగన్‌ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కు పెట్టారు. కొంత కాలానికి ఈ విమర్శలు పతాక స్థాయికి చేరాయి. దీంతోజగన్‌ బెయిల్‌ రద్దు చేయాలని సీబీఐ కోర్టులో ఏప్రిల్‌ 2021న పిటీషన్‌ దాఖలు చేశారు. అయితే దీనిని సీబీఐ కోర్టు తోసిపుచ్చింది. ఈ నేపత్యంలో
ఆర్‌ఆర్‌ఆర్‌ మీద రాజద్రోహం కేసు నమోదు చేసిన సీఐడీ పోలీసులు 2021 మే 14న అరెస్టు చేశారు. విచారణ పేరుతో తనను చిత్ర హింసలకు గురి చేశారని, హత్యయత్నాం కూడా జరిగిందని తర్వాత ఆరోపణలు చేయడం కేసులు నమోదు చేయడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం అవి కొనసాగుతున్నాయి.
రాజద్రోహం కేసు అనంతరం పగ పెంచుకున్న ఆర్‌ఆర్‌ఆర్, జగన్‌ విచారణను తెలంగాణ నుంచి వేరే రాష్ట్రానికి మార్చాలని తెలంగాణ హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. అక్కడ కూడా ఆర్‌ఆర్‌ఆర్‌కు చుక్కెదురైంది. దీంతో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. జగన్‌ బెయిల్‌ను రద్దు చేయాలని, విచారణను తెలంగాణ నుంచి వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని పిటీషన్‌ దాఖలు చేశారు. దీనిపైన విచారణ చేపట్టిన జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ధర్మాసనం జగన్‌ కేసు విచారణ ఎందుకు ఆలస్యం అవుతోందని సీబీఐని ప్రశ్నించింది. జాప్యానికి గల కారణాలపై అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. తర్వాత ఆగస్టు 2024లో విచారణ చేపట్టిన ఇదే ధర్మాసనం సీబీఐ మీద అసంతృప్తి వ్యక్తం చేసింది. జగన్‌ కేసు విచారణ ఎందుకు వేగవంతం చేయడం లేదని ప్రశ్నించింది. తర్వాత జగన్‌ బెయిల్‌ను రద్దు చేయాలని సుప్రీం కోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. విచారణ ధర్మాసనాన్ని కూడా మార్చాలని సుప్రీం కోర్టును అభ్యర్థించారు.
దీనిపైన సోమవారం విచారణ చేపట్టింది. పిటీషనర్‌ రఘురామకృష్ణరాజు తరపున న్యాయవాది బాలాజీ సుబ్రహ్మణ్యం సుప్రీం కోర్టులో వాదనలు వినిపించారు. గత 12ఏళ్లుగా విచారణలో అడుగు ముందుకు పడలేదని, సిబీఐ, నిందితుడు జగన్‌మోహన్‌రెడ్డి కుమ్మక్కయ్యారని, వాదనల విన్న తర్వాత ఎలాంటి నిర్ణయం వెల్లడించకుండానే ఐదుగురు న్యాయమూర్తులు బదిలీ అయ్యారని, ఈ నేపథ్యంలోనే జగన్‌ విచారణను వేరే కోర్టుకు బదిలీ చేయాలని సుప్రీం కోర్టును ఆశ్రయించినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇదే సమయంలో సీబీఐ తరపున న్యాయవాది తన వాదనలు సుప్రీం కోర్టులో వినిపించారు. జగన్‌ కేసుకు సంబంధించిన అన్ని వివరాలను సమర్పిస్తూ గతంలోనే అఫిడవిట్‌ దాఖలు చేసిందని వివరించారు. దీంతో పాటుగా ఈ కేసులో తమ వాదనలు వినిపించేందుకు కొంత సమయం కావాలని కోరారు. ఈ కేసును తెలంగాణ హైకోర్టు పర్యవేక్షిస్తోందని, అక్కడే పెండింగ్‌లో ఉందని నిందితుడు జగన్‌ తరపున న్యాయవాది ముకుల్‌ రోహత్గీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మరో కేసులో బిజీగా ఉన్నందు వల్ల ఈ కేసును వాయిదా వేయాలని అదనపు సొలిసిటర్‌ జనరల్‌(ఏఎస్‌జీ) విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో జస్టిస్‌ బీవీ నగరత్న, జస్టిస్‌ సతీష్‌ చంద్రశర్మ ధర్మాసనం వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. వచ్చే సోమవారం ఈ కేసుకు సంబంధించిన విచారణ చేపడుతామని వెల్లడించింది.
Read More
Next Story