లడ్డూ కల్తీపై సుప్రీం కోర్టు వ్యాఖ్యలు వారికి చెంపపెట్టు: వైఎస్‌ షర్మిల
x

లడ్డూ కల్తీపై సుప్రీం కోర్టు వ్యాఖ్యలు వారికి చెంపపెట్టు: వైఎస్‌ షర్మిల

తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీం కోర్టు విచారణ నేపథ్యంలో ఏపీసీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టు అన్నారు.


తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం వివాదంపై సోమవారం సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు అటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి, ఇటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి చెంప పెట్టులాంటివని ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. ఈ వివాదంపై స్వతంత్ర సంస్థైన సీబీఐతో విచారణ జరిపించాలని ఆమె డిమాండ్‌ చేశారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్‌ పార్టీ మొదటి నుంచి చెబుతోందన్నారు. ఇవ్వాళ సుప్రీం కోర్టు ఇచ్చిన సూచన కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ కి బలం చేకూరినట్లయ్యిందన్నారు. సిట్‌ దర్యాప్తు కేవలం రబ్బర్‌ స్టాంప్‌ తప్పా, విచారణకు ఉపయోగం లేదన్నారు. సీబీఐకి అప్పగిస్తే లడ్డూ కల్తీపై లోతైన దర్యాప్తు జరుగుతుందన్నారు.

ఆందోళనలో ఉన్న కోట్లాది మంది భక్తులకు నిజ నిజాలు వెల్లడవుతాయన్నారు. కల్తీ ఎలా జరిగింది ? ఎక్కడ జరిగింది ? పాల్పడ్డ దొంగలు ఎవరు ? తక్కువ ధరకు కాంట్రాక్టు ఇవ్వడం వెనుక కారణం ఏంటి ? ఎన్‌డీడీబీ రిపోర్ట్‌ను ఎందుకు ఇంతకాలం దాచిపెట్టారు ? మత రాజకీయాలకు ఆజ్యం పోసింది ఎవరు ? ఇలాంటి ఎన్నో సందేహాలకు సమాధానం దొరకాల్సిన అవసరం ఉందన్నారు. నిందితులకు కఠిన శిక్ష పడాల్సిన అవసరం ఉందన్నారు. దెబ్బతిన్న హిందువుల మనోభావాలు మీకు ముఖ్యం అనుకుంటే, మత రాజకీయాలు మీ అజెండా కాకపోతే, లడ్డూ కల్తీపై సుప్రీంకోర్టు సూచనలు పరిగణనలోకి తీసుకోవాలని కూటమి సర్కారును కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తోందన్నారు.

Read More
Next Story