విచారణకు సహకరించాలని సీఎం చంద్రబాబుకు సుప్రీం కోర్టు సూచన
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సీఎం చంద్రబాబు బెయిల్ రద్దు పిటీషన్‌ను కొట్టేసిన సుప్రీం కోర్టు.. విచారణకు సహకరించాలని సూచించింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. సీఎం చంద్రబాబు స్కిల్‌డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు సానుకూలంగా స్పందించింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని దాఖలు చేసిన పిటీషన్‌ను సుప్రీం కోర్టు కొట్టేసింది. ఈ కేసుకు సంబంధించి దాఖలైన పిటీషన్ మీద సుప్రీం కోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ఇప్పటికే చార్జిషీట్ దాఖలైన నేపథ్యంలో స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించి బెయిల్ రద్దు విషయంలో జోక్యం చేసుకోవలసిన అవసరం లేదని, బెయిల్ రద్దు అంశంలో తామే ఏమీ కల్పించుకోలేమని పేర్కొంది. అయితే.. అవసరమైన సందర్భాల్లో విచారణకు సహకరించాల్సి ఉంటుందని సీఎం చంద్రబాబుకు సుప్రీం కోర్టు సూచించిన సుప్రీం కోర్టు, చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ గత ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్‌ను కొట్టేసింది. ఆ మేరకు సుప్రీం కోర్టు జస్టిస్ బేలా ఎం త్రివేది నేతృత్వంలోని సుప్రీం కోర్టు బెంచ్ బుధవారం తీర్పును వెలువరించింది. సీఎం చంద్రబాబు నాయుడు తరపున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గి సుప్రీం కోర్టులో వాదనలు వినిపించారు.