
శ్రీలక్ష్మికి ఓబుళాపురం కేసులో షాకిచ్చిన సుప్రింకోర్టు
సుప్రింకోర్టు తాజా ఆదేశాలతో శ్రీలక్ష్మి కేసు హైకోర్టులో మళ్ళీ రీఓపెన్ అవబోతోంది.
ఓబుళాపురం అక్రమమైనింగ్ కేసులో సుప్రింకోర్టు ఐఏఎస్ అధికారి యెర్రా శ్రీలక్ష్మికి పెద్ద షాక్ ఇచ్చింది. మంగళవారమే ఓబుళాపురం మైనింగ్ కేసు(ఓఎంసీ)లో సీబీఐ కోర్టు ఐదుగురు నిందితులకు ఏడేళ్ళు జైలుశిక్ష విధించిన విషయం తెలిసిందే. కేసులో మొత్తం తొమ్మిదిమందిని సీబీఐ విచారించగా ఐఏఎస్ అధికారులు శ్రీలక్ష్మి, కృపానందంతో పాటు మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indra Reddy)కి వ్యతిరేకంగా సాక్ష్యాలు లేవన్న కారణంగా సీబీఐ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. గాలిజనార్ధనరెడ్డి(Gali Janardhan Reddy), శ్రీనివాసులరెడ్డి, వీడీ రాజగోపాల్, ఓఎంసీకి ఫైన్ వేసి గాలికి పీఏగా పనిచేసిన మొహిసిన్ ఆలీఖాన్ కు ఏడేళ్ళు జైలుశిక్ష విధించింది. తనకు సీబీఐ కోర్టు క్లీన్ చిట్ ఇవ్వటంతో శ్రీలక్ష్మి చాలా హ్యాపీగా ఉన్నారు. అంతకుముందే శ్రీలక్ష్మి వేసిన పిటీషన్ను విచారించిన హైకోర్టు 2022లోనే శ్రీలక్ష్మికి క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే.
అయితే సీబీఐ కోర్టు(CBI Court) క్లీన్ చిట్ ఇచ్చిన 24 గంటల్లోపే సుప్రింకోర్టు శ్రీలక్ష్మికి పెద్ద షాకిచ్చింది. ఎలాగంటే తెలంగాణ హైకోర్టు శ్రీలక్ష్మికి ఏకపక్షంగా ఇచ్చిన క్లీన్ చిట్ చెల్లదని సుప్రింకోర్టు స్పష్టంగా చెప్పింది. ప్రతివాది అయిన సీబీఐ తరపు వాదనలు వినకుండానే హైకోర్టు ఐఏఎస్ అధికారికి క్లీన్ చిట్ ఇవ్వటం చెల్లదని సుప్రింకోర్టు తేల్చేసింది. కాబట్టి శ్రీలక్ష్మి కేసును మళ్ళీ ఓపెన్ చేసి హైకోర్టులో విచారణ జరపాల్సిందే అని ఆదేశించింది. అలాగే కేసు విచారణను మూడునెలల్లో ముగించాలని కూడా గడువు నిర్దేశించింది. ఓఎంసీ(OMC Case) కేసులో శ్రీలక్ష్మి ఏ6గా ఉన్నారు. క్వాష్ పిటీషన్ దాఖలుచేసిన శ్రీలక్ష్మిపై హైకోర్టు 2022లోనే కేసునుండి ఉపశమనంపొందారు. అయితే సుప్రింకోర్టు తాజా ఆదేశాలతో శ్రీలక్ష్మి కేసు హైకోర్టులో మళ్ళీ రీఓపెన్ అవబోతోంది.
సుప్రింకోర్టు ఆదేశాలతో శ్రీలక్ష్మి తరపు లాయర్, సీబీఐ తరపు లాయర్ మళ్ళీ వాదనలు వినిపించాల్సుంటుంది. 2022లో హైకోర్టు శ్రీలక్ష్మికి క్లీన్ చిట్ ఇవ్వటాన్ని సీబీఐ సుప్రింకోర్టులో సవాలుచేసింది. అప్పటినుండి వాదోపవాదాలు జరిగి బుధవారం సుప్రింకోర్టు తాజా ఆదేశాలు ఇవ్వటం నిజంగా శ్రీలక్ష్మికి షాకనే చెప్పాలి. మరి ఈ కేసు రీఓపెన్లో ఓఎంసీ అవినీతిలో శ్రీలక్ష్మి పాత్ర ఉందనేందుకు సీబీఐ ఎలాంటి ఆధారాలను చూపిస్తుందన్నది ఆసక్తిగా మారింది.