‘జగన్‌కు వైద్యులు సరైన సలహా ఇవ్వలేదు’.. సునీత సెటైర్
x

‘జగన్‌కు వైద్యులు సరైన సలహా ఇవ్వలేదు’.. సునీత సెటైర్

నామినేషన్ వేయనున్న సందర్భంగా నిర్వహించిన సభలో వివేకా హత్యపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను సునీత తీవ్రంగా ఖండించారు. జగన్‌కు ఓ సలహా ఇచ్చారు.


సీఎం వైఎస్ జగన్‌పై వైఎస్ సునీత సెటైర్లు వేశారు. ఆయనకు విజయవాడలో తగిలిన దెబ్బకు ఇంకా బ్యాండేజ్ ఉండటంపై సునీత స్పందించారు. ‘‘బ్యాండేజ్‌ని ఎక్కువ రోజులు ఉంచుకుంటే సెప్టిక్ అవుతుంది జగన్. వైద్యులు నీకు సరైన సలహా ఇవ్వలేదు’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వీలైనంత త్వరగా బ్యాండేజ్‌ని తొలగించమని ఒక డాక్టర్‌గా తాను సలహా ఇస్తున్నానని చెప్పారు. అంతేకాకుండా దెబ్బ త్వరగా మానాలంటే గాలి తగాలలని, లేని పక్షంలో సెప్టిక్ అయ్యే ప్రమాదం ఉందని వివరించారామే. అనంతరం నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో జగన్ చేసిన వ్యాఖ్యలకు ఆమె ఘాటుగా బదులిచ్చారు.

వివేకాపై ద్వేషమే కనిపిస్తోంది

‘‘బహిరంగ సభ వేదికగా వివేకాపై జగన్ చేసిన వ్యాఖ్యల్లో నాన్నపై ఆయనకు ఉన్న ద్వేషమే కనిపిస్తోంది. ఏం పాపం చేశారని ఆయనంటే మీకు ఇంత కోపం, కక్ష. మీ కోసం పదవిని, అధికారాన్ని త్యాగం చేసినందుకా. మీరు బాగుండాలని ఆకాంక్షించినందుకా. వివేకా హత్యకేసును అప్పగించడానికి సీఎం జగన్‌కు భారతదేశ న్యాయవ్యవస్థ, సీబీఐపై నమ్మకం లేదు. మరి జగన్‌కు ఏ వ్యవస్థపైన నమ్మకం ఉందో చెప్పాలి. వివేకా హత్య కేసు గురించి ప్రసంగాల్లో మాట్లాడకూడదంటూ కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చిన వారే ఇప్పుడు సభలు పెట్టి మాట్లాడుతున్నారు. వివేకా కేసులో సీబీఐ రెడీ చేసిన నిందితుల జాబితాలో పేరు ఉన్న వారికి ఓట్లు వేయకండి’’ అని ఆమె ఓటర్లకు పిలుపునిచ్చారు.

ఇప్పటికైనా నాకు సహాయం చేయండి

‘‘చట్టం దృష్టిలో అందరూ సమానులే.. తప్పు చేసింది నేనైనా, నా భర్త అయినా శిక్ష పడాల్సిందే. అవినాష్ రెడ్డిని చిన్న పిల్లోడని అంటున్నారు. ఎంపీ పదవుల్లో పిల్లలు ఉంటారా? పిల్లలకు పదవులు కూడా ఇస్తారా? పిల్లలకు పదవులు ఇవ్వడానికి మన రాజ్యాంగం ఒప్పుకోదు. పిల్లలు అయితే స్కూల్‌కు వెళ్లాలి. నిందితులంటూ సీబీఐ ముద్ర వేసిన వారిని జగన్ రక్షిస్తున్నారు. ఐదేళ్లుగా నా తండ్రి హత్యపై న్యాయం కోసం పోరాటం చేస్తుంటే నాకు రాజకీయాలు అంటగడుతున్నారు. సీఎంను వేడుకుంటున్నా.. ఇప్పటికైనా నా పోరాటానికి సహాయం చేయండి’’ అని కోరారు.

ప్రతిపక్షాలతో చేతులు కలిపామా!

‘‘వివేకానందరెడ్డి అతి దారుణంగా హత్య చేయబడ్డారు. ఐదేళ్లుగా దీనిపై పోరాడుతున్నా. ఇందులో నేను చేస్తున్న పోరాటం కనిపించడం లేదు. మీ కళ్లకు రాజకీయాలే కనిపిస్తున్నాయా. ఇప్పుడు మేము ప్రతిపక్షాలతో కలిశామని ఆరోపిస్తున్నారు. మేము ఐదేళ్లుగా చేస్తున్నా పోరాటంలో ప్రతిపక్షాలే కాదు ఏ పార్టీ కూడా లేదు. వివేకానందరెడ్డికి న్యాయం జరగాలన్నదే నా ఆశయం’’ అని ఆవేదన వ్యక్తం చేశారామే.

అసలు జగన్ ఏమన్నారంటే

బహిరంగ సభలో ప్రసంగించిన సీఎం జగన్.. ‘‘వివేకాను ఎవరు చంపారో, ఎవరు చంపించారో అన్న విషయం ప్రజలందరికీ తెలుసు. వివేకాను చంపిన హంతకుడికి ఎవరు మద్దతు ఇస్తున్నారో కూడా ప్రజలు చూస్తున్నారు. వివేకాను ఓడించిన వారితోనే చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారంటే అర్థం ఏంటి. చిన్నాన్నకు రెండో పెళ్ళి అయిందన్న విషయం వాస్తవం. సంతానం ఉన్నదన్న అంశం కూడా అంతే వాస్తవం’’అని అన్నారు.

Read More
Next Story