పేరు చివర చౌదరి,నాయుడు,రాజు లేకపోవడమే సునీల్‌కు శాపమైంది
x

పేరు చివర చౌదరి,నాయుడు,రాజు లేకపోవడమే సునీల్‌కు శాపమైంది

పీవీ సునీల్‌కుమార్‌పై ఏపీ ప్రభుత్వ వ్యవహార శైలిపట్ల మాజీ ఐపీఎస్‌ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ తీవ్రంగా స్పందించారు.


ఆంధ్రప్రదేశ్‌ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీవీ సునీల్‌కుమార్‌పై కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మాజీ ఐపీఎస్‌ అధికారి, టీఆర్‌ఎస్‌ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పీవీ సునీల్‌కుమార్‌పై విచారణ చేపట్టాలని అందుకు ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేస్తూ ఏపీ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు.

సునీల్‌ కుమార్‌పై ఏపీ ప్రభుత్వం వివక్ష పూరితంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. లేక పోతే వందల కోట్లు బ్యాంకులను ముంచి, ఎమ్మెల్యేగా ఎన్నికై దర్జాగా తిరుగుతున్న రఘురామకృష్ణరాజు బయట ఉండటమేంటి.. మూడు దశాబ్దాలుగా దేశానికి సేవలు చేసిన ఒక నికార్సయిన పోలీసు అధికారి పోస్టింగ్‌ లేకుండా మౌనంగా రోదిస్తూ, అక్రమ కేసుల చిత్ర హింసను ఎదుర్కోవడం ఏంటి? అని ప్రశ్నించారు.
డీజీపీ ర్యాంకులో ఉన్న ఆంధ్ర ఐపీఎస్‌ అధికారి పీవీ సునీల్‌ కుమార్‌ చేసిన ఘోరమైన తప్పు ఆయన ఎస్సీ మాల కులంలో పుట్టమేనా? ఆయన పేరు చివరన రాజు/నాయుడు/చౌదరి/రెడ్డి/వర్మ/శర్మ లాంటి పేర్లు లేకపోవడమే ఆయన పాలిట శాపమైంది. ఇది ముమ్మాటికీ నిజం. బైదవే.. నాకు పైన చెప్పిన అన్ని కులాల్లో ఆత్మీయులు ఉన్నారు. అది వేరే విషయం.
పీవీ సునీల్‌ కుమార్‌ నేను బెల్లంకొండ(అదిలాబాద్‌)1998 నుంచి కలిసి పని చేశాం. ఆయనకు ప్రతీ సారి చాలా సార్లు ప్రభుత్వాలు అన్యాయం చేశాయి. అందరి లాగా నాకూ ప్రాధాన్యత ఉన్న పోస్టులు ఇవ్వండి అని వేడుకున్నా అగ్రనాయకుల గుండెలకు కరగలేదు. ఈ వివక్ష ఏ మీడియాకు కనిపించదు. ఎందుకంటే వాళ్లకు ఎవరిని బజారున పడేయాలి, ఎవరిని ఎప్పుడు కాపాడుకోవాలి అనేది బాగా తెలుసు. అణచివేయబడ్డ వర్గాలకు దండోరా లాంటి వాళ్ల సొంత మీడియా ఉండే అవకాశం ఎన్నడూ రానివ్వరు. ఇక 79 శాతం ఆధిపత్య వర్గాలతో నిండిన న్యాయ వ్యవస్థలో పీవీ సునీల్‌ కుమార్‌ లాంటి అణచివేతకు గురవుతున్న అధికారికి ఉపశమనం దొరుకుతుందన్న ఆశ కూడా లేదు. అందుకే ఒకప్పుడు నారా చంద్రబాబు, రోజా సెల్వమణి తెలిసి తెలిసి ఎస్సీ కులంలో పుట్టాలని ఎవరు కోరుకుంటారని అని అన్నారేమో? వారు పెద్ద కులంలో పుట్టారు కాబట్టి వారి మాటలు నన్ను పెద్దగా ఆశ్చర్యానికి గురి చేయలేదని వ్యాఖ్యానించారు. ఈ వేదింపులకు అంతం ఎప్పుడు అంటూ పేర్కొన్నారు.
పీవీ సునీల్‌ కుమార్‌ గారు ఇక ఈ మౌన రోదనలు చాలు బ్రదర్‌. ప్రజా క్షేత్రంలో అడుగు పెట్టి పీవీ పులి కుమార్‌లా గర్జించండి. ఈ తుపేల్‌ మెమోలకు, ఎంక్వైరీలను పట్టించుకోకండి అని సూచించారు. పోరాటం సాగించాలే తప్ప వెనక్కి తిరిగి చూడొద్దని, ఎప్పుడూ ముందుకు సాగాలని ప్రతి అన్యాయాన్ని ఖతం చేయాలని తన సామాజిక వేదికగా ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ పేర్కొన్నారు.
Read More
Next Story