స్వామి వారి లడ్డూలో సుగంధం ఎందుకు లేదు?
x

స్వామి వారి లడ్డూలో 'సుగంధం' ఎందుకు లేదు?

అన్నీ ఆ పైవాడికే తెలుసునంటున్న సుగంధ్


శ్రీవారి లడ్డూ తయారీలో జంతుకొవ్వు కలిసిన నెయ్యిని వాడారన్న ఆరోపణలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. పూటకో విషయం బయటకు వస్తున్నట్టు సిట్ అధికారులు చెబుతున్నా ఏదీ ఇంకా నిర్ధారణకు రాలేదు. నిన్న ఇద్దరు కీలక వ్యక్తులను ప్రశ్నించింది. అయితే వాళ్లు ఎవరూ ఈ విచారణకు సహకరించడం లేదని తెలుస్తోంది. సిట్ వేస్తున్న ప్రశ్నలన్నీ టీటీడీ మాజీ ఛైర్మన్, రాజ్యసభ సభ్యుడు, వైసీపీ అధినేత వైవీ సుబ్బారెడ్డి చుట్టూ తిరుగుతున్నాయి. సుబ్బారెడ్డి కేంద్రంగా సాగుతున్న విచారణలో నిన్న సిట్ అధికారులు ఏమేమి ప్రశ్నలు అడిగారంటే..
‘తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా అవుతోందని 2020 ఆగస్టులో మీ దృష్టికి వచ్చింది కదా? ఆ విషయాన్ని టీటీడీ మాజీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డికి మాత్రమే ఎందుకు చెప్పారు? ఉన్నతాధికారుల దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదు?’ అని ఈ కేసులో నిందితుడు, టీటీడీ కొనుగోళ్ల విభాగం మాజీ జీఎం ఆర్‌ఎస్‌ఎస్‌వీఆర్‌ సుబ్రహ్మణ్యాన్ని సీబీఐ నేతృత్వంలోని సిట్‌ అధికారులు ప్రశ్నించారు.
నమూనాలు ల్యాబ్‌కు పంపమని వైవీ సుబ్బారెడ్డి చెప్పినందున ఆయనకే కల్తీ విషయాన్ని చెప్పామని సుబ్రహ్మణ్యం సమాధానమిచ్చినట్టు తెలుస్తోంది. నాలుగు డెయిరీలూ కల్తీ నెయ్యి పంపుతున్నాయని సుబ్బారెడ్డికి మీరు, డిప్యూటీ ఈవో వివరించిన తర్వాత కూడా దాని సరఫరా ఎందుకు కొనసాగిందని ప్రశ్నించారని, ఛైర్మన్‌గా ఆయన నిర్ణయం తీసుకున్నారని సుబ్రహ్మణ్యం తెలిపినట్లు సమాచారం.
‘ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్‌లలోని భోలేబాబా డెయిరీ ప్లాంట్లను తాము (సిట్ అధికారులు) పరిశీలించినప్పుడు వాటికి అంత సామర్థ్యం లేదని గుర్తించాం. కొనుగోళ్ల విభాగం జీఎంగా, తనిఖీ బృందంలో సభ్యుడిగా ఉన్న మీరు ఎందుకు గుర్తించలేదు?’ అని ప్రశ్నించగా తనతోపాటు మరికొందరూ తనిఖీ చేశారని, అందరి అభిప్రాయాలు టీటీడీకి నివేదించామని సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు.
విచారణ మధ్యలో వైవీ సుబ్బారెడ్డి వ్యక్తిగత కార్యదర్శి ప్రస్తావనా వచ్చినట్టు సమాచారం. ‘టీటీడీతో సంబంధమే లేని చిన్న అప్పన్నకు డెయిరీల పేర్లు, వాటి ప్రతినిధుల ఫోన్‌ నంబర్లు ఎందుకిచ్చారు?’ అని అడగ్గా అతడు సుబ్బారెడ్డి వ్యక్తిగత కార్యదర్శినని చెప్పడం వల్లే సమాచారం అందించానన్నారు.
ఆయనతోపాటు మరో నిందితుడు అజయ్‌ కుమార్‌ సుగంధ్‌ను ప్రశ్నించారు. చాలా ప్రశ్నలకు సుగంధం కూడా నోరు విప్పినట్టు తెలియరావడం లేదు. తెలియదు, గుర్తులేదు, వాళ్లు ఎవరు ఏమిటో తెలియదని చెప్పినట్టు సమాచారం.
సుగంధ్‌ ఆయిల్స్‌ యజమాని అజయ్‌ కుమార్‌ సుగంధ్‌ సిట్‌ విచారణకు ఏమాత్రం సహకరించలేదని తెలిసింది. భోలేబాబా డెయిరీ డైరెక్టర్లు పొమిల్‌ జైన్, విపిన్‌ జైన్‌.. కొన్నేళ్లుగా కల్తీ నెయ్యి వ్యాపారం చేస్తున్నారని, వారికి ఎందుకు సహకరించారని ప్రశ్నించగా తనకు ఆ విషయంతో సంబంధం లేదన్నారు.
Read More
Next Story