
Sudha Rani Relangi
ఏలూరు యువతికి కేంద్రంలో ఎంత పెద్ద పోస్టో!
ఆంధ్ర వనిత అత్యంత కీలక కేంద్ర సమాచార కమిషనర్ అయ్యారు. ఆమె పేరు సుధారాణి రేలంగి
ఆంధ్ర వనిత అత్యంత కీలక కేంద్ర సమాచార కమిషనర్ అయ్యారు. ఆమె పేరు సుధారాణి రేలంగి. ఏలూరు వాసి. ప్రస్తుతం పెట్రోలియం, సహజ వాయువుల రెగ్యులేటరీ బోర్డు సభ్యురాలిగా ఉన్న ఆమెను ఏకంగా కేంద్ర సమాచార కమిషనర్‌గా నియమించారు. ప్రధానమంత్రి ఆధ్వర్యంలోని నియామక కమిటీ ఆమె పేరును సిఫార్సు చేసింది.
న్యాయ రంగంలో సుదీర్ఘ అనుభవం, విస్తరించిన విశిష్ట కెరీర్, అడ్వకసీ నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించి ILS కేడర్‌కు చెందిన సివిల్ సర్వీసుల్లో చేరిన సుధారాణి రేలంగి, ప్రస్తుతం పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు (PNGRB)లో మెంబర్ (లీగల్)గా పని చేస్తున్నారు. న్యాయ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ లీగల్ సర్వీస్ సీనియర్ అధికారిగా ఆమె, బోర్డు నియంత్రణ, శాసన, న్యాయ నిర్ణయ, కార్యనిర్వాహక కార్యకలాపాలకు దిశానిర్దేశం చేస్తూ, ట్రిబ్యునళ్లు, హైకోర్టు, సుప్రీంకోర్టులో జరిగే వ్యాజ్యాలు సహా అన్ని న్యాయ వ్యవహారాలను ఆమె పర్యవేక్షిస్తుంటారు.
ఈ బహుముఖ పాత్రలో, భారతదేశ చమురు, వాయు రంగం, హైడ్రోకార్బన్, ఎనర్జీ రంగాల నియంత్రణా వ్యవస్థకు న్యాయ సలహా సేవలను అందిస్తున్నారు. ఇంతకు ముందు ఆమె సీబీఐ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్‌గా, ఇండియన్ టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP)లో జడ్జ్ అడ్వకేట్ జనరల్‌గా, న్యాయ శాఖ మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీ, లెజిస్లేటివ్ కౌన్సెల్‌గా సేవలందించారు. లీగల్ స్ట్రాటజీ, లిటిగేషన్, అంతర్జాతీయ న్యాయం, లీగల్ రీసెర్చ్, న్యాయ సలహా, లీగల్ రైటింగ్, ప్రభుత్వ వ్యవహారాలు, వ్యాపార కార్యక్రమాలు, లిటిగేషన్ మేనేజ్‌మెంట్, న్యాయ పరిపాలన, వివాద పరిష్కారం, క్రిమినల్ జస్టిస్, అంతర్జాతీయ సహకారం, ప్రజా విధానం వంటి విభిన్న నైపుణ్యాలను ఆమె ఈ ప్రయాణంలో సాధించారు.
శ్రీమతి రేలంగి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్ర డిగ్రీ, సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ సాధించారు. లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అండ్ ఫైనాన్స్ నుంచి ఇంటర్నేషనల్ బిజినెస్ లా లో ఎగ్జిక్యూటివ్ ఎల్‌ఎల్‌ఎమ్ పూర్తి చేసి, తన అంతర్జాతీయ న్యాయ దృష్టిని మరింత విస్తరించారు.
ఈమె స్వస్థలం ఏలూరు. పాఠశాల విద్య నుంచి డిగ్రీ వరకు ఏలూరులోని సెయింట్ థెరిసా విద్యాలయంలో చదివారు. సీఆర్‌ఆర్ కళాశాలలో లా డిగ్రీ పూర్తిచేశారు. లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అండ్ ఫైనాన్స్ నుంచి ఇంటర్నేషనల్ బిజినెస్ లాలో ఎల్‌ఎల్‌ఎం చేశారు. 2003 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. ఆ తర్వాత ఇండియన్ లీగల్ సర్వీస్‌కు ఎంపికయ్యారు. తెలుగువారైన ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ 2013 నవంబరు నుంచి 2018 నవంబరు వరకు కేంద్ర సమాచార కమిషనర్‌గా సేవలందించారు. ఆ తర్వాత ఇప్పుడు సుధారాణి రేలంగి నియమితులయ్యారు.
కేంద్ర సమాచార కమిషన్ ప్రధాన కమిషనర్‌గా న్యాయశాఖ మాజీ కార్యదర్శి రాజ్‌కుమార్ గోయల్ నియమితులయ్యారు. అలాగే రైల్వే బోర్డు మాజీ ఛైర్మన్ జయవర్మ సిన్హా, కేంద్ర సామాజిక న్యాయం, సాధికార శాఖ మాజీ కార్యదర్శి సురేంద్రసింగ్ మీనా, మాజీ ఐఎఫ్‌ఎస్ అధికారి కుశ్వంత్‌సింగ్ సేథి, మాజీ ఐపీఎస్ అధికారి స్వాగత్‌దాస్, మాజీ ఐఏఎస్ అధికారి సంజీవ్‌కుమార్ జిందల్, సీనియర్ పాత్రికేయుడు పీఆర్ రమేష్, ఆశుతోష్ చతుర్వేదిలు కమిషనర్లుగా నియమితులయ్యారు. ఇప్పటికే కమిషనర్లుగా సేవలందిస్తున్న ఆనంది రామలింగం, వినోద్‌కుమార్ తివారీతో కలిపి ఈ 9 మంది నియామకంతో కమిషన్‌లో మొత్తం 11 మంది కమిషనర్లను పూర్తిగా నియమించినట్లయింది. ఇందులో ముగ్గురు మహిళలకు చోటు దక్కింది.
రాజ్‌కుమార్ గోయల్ సోమవారం ఉదయం 11 గంటలకు ప్రధాన కమిషనర్‌గా ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపదీముర్ము సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఇటీవల ప్రధాన కమిషనర్‌గా పదవీ విరమణ చేసిన హీరాలాల్ సమరియా తెలంగాణ కేడర్ ఐఏఎస్ అధికారిగా పనిచేశారు.
సుధారాణి రేలంగి అత్యుత్తమ సేవలకు గుర్తింపుగా ఆమె- రెండు గోల్డ్ ఇన్సిగ్నియా అవార్డులు, ఒక సిల్వర్ ఇన్సిగ్నియా అందుకున్నారు. దేశంలోని కీలక చట్టబద్ధ హోదాల్లో పనిచేస్తూ, ఉన్నత స్థాయి నైతిక విలువలు, న్యాయ విజ్ఞతకు ప్రతీకగా నిలిచిన ఆమెను వివిధ సంస్థలు, పలువురు ప్రముఖులు అభినందించారు.
Next Story

