వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై కదం తొక్కిన విద్యార్థులు
x

వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై కదం తొక్కిన విద్యార్థులు

ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేయడం ఎందుకని ప్రశ్నించిన విద్యార్థి సంఘ నేతలు


ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ మోడల్ లోకి తీసుకువెళ్లవద్దని డిమాండ్ చేస్తూ సీపీఐ (CPI), దాని అనుబంధ విద్యార్థి సంస్థ ఏఐఎస్ఎఫ్ (AISF) కార్యకర్తలు, నాయకులు గురువారం అనంతపురం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేశారు.
సంగమేష్ సర్కిల్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా బయలుదేరిన నాయకులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కలెక్టరేట్ గేట్లు ఎక్కే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ మోహరించిన పోలీసులు వారిని అడ్డుకోవడంతో రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది.
ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేయడం ఎందుకని ప్రశ్నిస్తూ, ఈ నిర్ణయం పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసే కుట్రగా ఆరోపించారు. ప్రైవేటీకరణను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేసిన నాయకులు, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఈ ఆందోళనకు నేపథ్యం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయం రాష్ట్రంలో సెగలు రేపుతోంది. ఇప్పటికే వైసీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల కార్యక్రమం జరిగింది.
గత ఏడాది సెప్టెంబర్‌లో కేబినెట్ ఆమోదించిన ప్రకారం, పులివెందుల, ఆదోని, మార్కాపురం, అమలాపురం, బాపట్ల, పాలకొల్లు, పార్వతీపురం, నర్సీపట్నం, మదనపల్లె, పెనుకొండ వంటి ప్రాంతాల్లో నిర్మాణమైన లేదా నిర్మాణంలో ఉన్న 10 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) మోడల్‌లో ప్రైవేటు సంస్థలకు అప్పగించనున్నారు. ఈ మోడల్‌లో ప్రభుత్వం భూమి, భవనాలు అందిస్తుంది కానీ నిర్వహణ, ఆపరేషన్ ప్రైవేటు భాగస్వాముల బాధ్యత అవుతుంది.
ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఆర్థిక ఇబ్బందులు, వేగవంతమైన అభివృద్ధి కోసమని సమర్థిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు "పీపీపీ మోడల్‌లో కూడా కళాశాలలు ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయి, సేవలు మెరుగవుతాయి" అని స్పష్టం చేశారు. అయితే విపక్షాలు, విద్యార్థి సంఘాలు దీన్ని ప్రైవేటీకరణగానే భావిస్తున్నాయి. ఇది పేద, మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్యను ఖరీదైనదిగా మార్చి, కన్వీనర్ కోటా సీట్లు తగ్గి ప్రైవేటు మేనేజ్‌మెంట్ సీట్లు పెరుగుతాయని ఆరోపిస్తున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్‌సీపీ నేతృత్వంలో ఒక కోటి సంతకాల సేకరణ, ర్యాలీలు జరుగుతున్నాయి.
ఈ నిరసన కార్యక్రమంలో సీపీఐ, ఏఐఎస్ఎఫ్ నాయకులతో పాటు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.
Read More
Next Story