విద్యార్ధులతో పెట్టుకుంటే ఏమవుతుందో తెలీదా ?
x

విద్యార్ధులతో పెట్టుకుంటే ఏమవుతుందో తెలీదా ?

విద్యార్ధి లోకం చాలా పవర్ ఫుల్. విద్యార్ధులతో పెట్టుకుంటే ఏమవుతుందో చాలా సినిమాల్లో చూపించటమే కాకుండా ప్రత్యక్షంగా చాలా రాజకీయపార్టీలకు అనుభవం ఉంది.


విద్యార్ధి లోకం చాలా పవర్ ఫుల్. విద్యార్ధులతో పెట్టుకుంటే ఏమవుతుందో చాలా సినిమాల్లో చూపించటమే కాకుండా ప్రత్యక్షంగా చాలా రాజకీయపార్టీలకు అనుభవం ఉంది. ఇపుడిదంతా ఎందుకంటే విద్యార్ధులతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనవసరంగా గోక్కుంటోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అధికారంలోకి వచ్చిన తర్వాత విరుద్ధంగా వ్యవహరిస్తోంది. అందుకనే ఆరుమాసాలు వెయిట్ చేసిన విద్యార్ధి సంఘాలు ఇపుడు రోడ్డెక్కాయి.

విషయం ఏమిటంటే విద్యార్ధిసంఘాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వంమీద మండిపోతున్నాయి. కారణం ఏమిటంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు విరుద్ధంగా ప్రభుత్వం నడుచుకుంటుంటడమే. మూడుపాయింట్ల మీద విద్యార్ధులు మండిపోతున్నారు. అవేమిటంటే మెగా డీఎస్సీ ప్రకటించకపోవటం, గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షల నిర్వహణకు మధ్య గ్యాప్ లేకపోవటం, గ్రూప్-1 పోస్టుల ఇంటర్వ్యూల్లో కటాఫ్ మార్కులను 1:50 కాకుండా 1:100 చేయాలని, ఫైనల్ గా 2 లక్షల ఉద్యోగులను వెంటనే భర్తీచేయాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్ధుల డిమాండ్లలో తప్పేమీలేదు. ఎందుకంటే పై డిమాండ్లలో మూడు ఎన్నికల్లో రేవంత్, కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలే. అప్పట్లో ఇచ్చిన హామీనే అధికారంలోకి వచ్చారు కాబట్టి అమలుచేయాలని విద్యార్ధులు డిమాండ్ చేస్తున్నారు.

ఎన్నికల్లో రేవంత్ మాట్లాడుతు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చి ఆరుమాసాలు అయినా ఉద్యోగాల భర్తీని ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆరుమాసాల్లో ఐదునెలలు ఎన్నికలకే సరిపోయింది కాబట్టి విద్యార్ధులు కూడా పట్టించుకోలేదు. హామీఅమలుకు మిగిలింది కేవలం ఆరుమాసాలు మాత్రమే. అందుకనే విద్యార్ధులు ఇపుడు 2 లక్షల ఉద్యోగాల భర్తీని డిమాండ్ చేస్తున్నది. 2 లక్షల ఉద్యోగాల్లోనే టీచర్ పోస్టుల భర్తీ, గ్రూప్-1, 2,3 కూడా ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే 25 వేల టీచర్ పోస్టుల భర్తీతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీచేస్తామన్నారు. అయితే నోటిఫికేషన్ ఇచ్చింది 11 వేల పోస్టులకు మాత్రమే. మిగిలిన 14 వేల పోస్టులు ఏమయ్యాయి ? అని విద్యార్ధులు అడుగుతున్నారు. 11 వేల టీచర్ పోస్టుల భర్తీ నోటిఫికేఫన్ కు అదనంగా వెంటనే 14 వేల పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే అని ఆందోళనలు మొదలుపెట్టారు.

గ్రూప్-1, 2 పోస్టుల పరీక్షలకు మధ్య పెద్ద గ్యాప్ లేదు. కాబట్టి రెండు పరీక్షల మధ్య కనీసం నెలరోజులు గ్యాప్ ఉండేట్లు చూడాలని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే గ్రూప్-1,2 పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు, నిరుద్యోగులు చాలామందే ఉంటారు. రెండు పరీక్షలకు ప్రిపరేషన్ సిలబస్ వేర్వేరుగా ఉంటాయి. ఒక పరీక్షకు హాజరయ్యే విద్యార్ధి రెండో పరీక్షకు వేరే సిలబస్ ప్రిపేర్ అవ్వటం కష్టం. అందుకనే రెండు పరీక్షల మధ్య నెలరోజుల గ్యాప్ ఉండాలని విద్యార్ధులు డిమాండ్ చేస్తున్నది. అయితే దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నిజానికి గ్రూప్-1 పరీక్షకు గ్రూప్ 2,3 పరీక్షకు మధ్య నెలరోజుల గ్యాప్ ఉండటం వల్ల ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీలేదు. కాకపోతే పాలకులు కాస్త బుర్రను ఉపయోగించాలంతే. పోస్టుల భర్తీ అన్నది విద్యార్ధులు, నిరుద్యోగుల కోసమే అయినపుడు అదేదో వాళ్ళ సౌకర్యం ప్రకారమే పరీక్షలు పెడితే సరిపోతుంది కదా.

ఇక మార్కుల వెయిటేజీ గురించి చూస్తే చాలాకాలంగా విద్యార్ధులు ఇంటర్వ్యూకి 1:100 నిష్పత్తిలో అభ్యర్ధులను పిలవాలని డిమాండ్ చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవటంలేదు. ఇపుడున్న విధానం ఏమిటంటే 1:50 నిష్పత్తి. విద్యార్ధులు 1:100 నిష్పత్తిని ఎందుకు డిమాండ్ చేస్తున్నట్లు ? ఎందుకంటే 1:50 నిష్పత్తిలో ఇంటర్వ్యూకి కటాఫ్ మార్కులు 70 రావాలి. అదే 1:100 నిష్పత్తి అయితే అభ్యర్ధికి 65 మార్కులు వస్తే సరిపోతుంది. 5 మార్కుల తేడాలో కొన్ని వేలమంది అభ్యర్ధులు ఇంటర్వ్యూకి అర్హత సాధిస్తారు. ఎందుకింతగా పట్టుబడుతున్నారంటే పోస్టుల భర్తీని ప్రభుత్వం మళ్ళీ ఎప్పుడు చేస్తుందో ఎవరు చెప్పలేరు. పైగా వేలాదిమంది అభ్యర్ధులకు వయసు దాటిపోతోంది. ఇపుడు పరీక్షల్లో అర్హత సంపాదించలేకపోతే తర్వాత నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందో తెలీదు, వచ్చినా వయసురీత్యా అర్హత ఉంటుందో లేదో కూడా తెలీదు.

తెలంగాణాలో 40 లక్షల మంది నిరుద్యోగులున్నారు. బీఆర్ఎస్ హయాంలో పోస్టుల భర్తీని పెద్దగా పట్టించుకోలేదు. 2017 నుండి డీఎస్సీని నిర్వహించలేదు. లక్షలాది పోస్టులు భర్తీ కాకుండా ఖాళీగా ఉండిపోయాయి. ఎన్నికలకు ముందు ఉద్యోగాల భర్తీ అని హడావుడి చేసినా ప్రతి పరీక్ష ప్రశ్నపత్రమూ లీకేజీయే. దాంతో విద్యార్ధులంతా గోలగోల చేసి కోర్టులకెక్కి స్టేలు తెచ్చుకున్నారు. దాంతో ఒక్క పోస్టు కూడా భర్తీకాలేదు. పరీక్షల నిర్వహణ, ఉద్యోగాల భర్తీలో కేసీయార్ ప్రభుత్వం ఘోరంగా ఫెయిలైంది. దాని ఫలితమే యావత్ విద్యార్ధిలోకం ఏకమైపోయి కేసీయార్ ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. బీఆర్ఎస్ ఓటమిలో విద్యార్దుల పాత్ర కూడా కీలకమే. ఈ విషయాలన్నీ తెలిసి కూడా రేవంత్ ప్రభుత్వం విద్యార్ధులతో చెలగాటమాడుతున్నది. విద్యార్ధుల ఆందోళనలకు ప్రతిపక్షాలే కారణమని ఎదురుదాడి చేస్తే సరిపోదు. తమలోని లోపాలను ప్రభుత్వం సరిచేసుకుని విద్యార్ధులకు మేలుచేస్తేనే వాళ్ళు శాంతిస్తారు. లేకపోతే రేవంత్ ప్రభుత్వానికి సమస్యలు తప్పవు.

Read More
Next Story